logo

పట్టణాలను ముంచెత్తుతోంది

మున్సిపాలిటీల్లో ప్రజల ముక్కుపిండి రూ.11.71 కోట్ల మేర చెత్త పన్ను వసూలు చేశారు.. ఆస్తి, నీటి తదితర పన్నుల రూపంలో రూ.120- రూ.150 కోట్ల మేర ఆదాయం వస్తోంది.. ప్రజల ఆరోగ్యాన్ని ‘చెత్త’లో వదిలేశారు.

Published : 21 May 2024 03:30 IST

కానరాని శుద్ధి ప్రక్రియ
ఎన్జీటీ ఆదేశాలు బేఖాతర్‌
ఆదోని, నంద్యాల పురపాలకం, కర్నూలు నగరపాలక, న్యూస్‌టుడే

ఆదోని కంపోస్టుయార్డులో గుట్టలుగా పేరుకుపోయిన చెత్త

మున్సిపాలిటీల్లో ప్రజల ముక్కుపిండి రూ.11.71 కోట్ల మేర చెత్త పన్ను వసూలు చేశారు.. ఆస్తి, నీటి తదితర పన్నుల రూపంలో రూ.120- రూ.150 కోట్ల మేర ఆదాయం వస్తోంది.. ప్రజల ఆరోగ్యాన్ని ‘చెత్త’లో వదిలేశారు. టన్నుల్లో చెత్త పోగవుతోంది.. శుద్ధి పనులు చేపట్టాలి.. డంపింగ్‌ యార్డులు ఖాళీ చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది.. ఏకంగా కర్నూలు నగరపాలక సంస్థకు జరిమానా విధించింది.. అయినా పుర అధికారుల్లో కదలికలేదు.. గుట్టలుగా పేరుకుపోయిన చెత్త ప్రజల ప్రాణానికి కుంపటిలా మారింది.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల పరిధిలో నిత్యం 500 మెట్రిక్‌ టన్నుల మేర చెత్త పోగవుతోంది. టన్నుల మేర పోగవడంతో పరిసర ప్రాంతాలు కాలుష్యంబారిన పడుతున్నాయి. వీటిని శుద్ధి చేయాలని ఎన్జీటీ హెచ్చరించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు డంపింగ్‌ యార్డులో చెత్తనంతా శుద్ధి చేయాలి.. అక్కడున్న మట్టిని తొలగించి కొత్తది వేసి మొక్కలు నాటాల్సి ఉంటుంది.

అందుకు నిధుల్లేవని పురపాలక సంఘాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. కేంద్రం ముందుకొచ్చి 15వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి 35 శాతం మేర వెచ్చించి పనులు చేపట్టాలని సూచించింది. యూఎల్‌బీ (పురపాలికల) వాటా చెల్లించకపోవడంతో పనులు నత్తను తలపిస్తున్నాయి. గతంలో 13వ ఆర్థిక సంఘం నిధులతో చెత్త శుద్ధికి సంబంధించిన నిర్మాణాలు, ఏర్పాట్లు చేసుకోవాలని.. అందుకు నిధులు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. నాడు చాలా పురపాలికల్లో వీటిపై వెచ్చించిన నిధులు వృథా అయ్యాయి.

ప్రజల ఆరోగ్యంపై ప్రభావం

ఏళ్ల తరబడి చెత్త పోగవడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. డంపింగ్‌ యార్డుల చుట్టూ కి.మీ. మేర నీరు కలుషితమవుతోంది. డంపింగ్‌ యార్డుకు సమీపంలో బోరుబావులు తవ్విస్తే రంగు మారిన నీరు వస్తోంది. 


గడువు గడబిడ

ఆదోని పట్టణ శివారులోని జాతీయ రహదారికి సమీపంలో డంపింగ్‌ యార్డులో 40 వేల మెట్రిక్‌ టన్నుల చెత్త పోగైంది. శుద్ధి చేసేందుకు మహారాష్ట్రకు చెందిన ఓ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. ఇందుకు రూ.2.25 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఐదారు నెలల్లో పనులు పూర్తిచేసేలా 2022లో ఒప్పందం చేసుకొన్నారు. నేటికీ 30 శాతం చెత్తను మాత్రమే శుద్ధి చేశారు. ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి. జూన్‌ లోపు పూర్తి చేయాలని గడువు విధించారు.


కుందూ కలుషితం

నంద్యాల పట్టణం భీమవరం రహదారిలోని డంపింగ్‌ యార్డులో 66 వేల మెట్రిక్‌ టన్నుల చెత్త పోగైంది. 2022 జనవరిలో చెత్త శుద్ధి పనులు చేపట్టారు. మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు. ఇందుకు రూ.5 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 30 శాతం చెత్త శుద్ధి చేసినట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఎక్కడపడితే అక్కడ చెత్త పారబోస్తున్నారు. కుందూ నది తీర ప్రాంతంలో 1,500 లారీల చెత్త వేశారు.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నదిలోకి నీరంతా వెళ్లి కలుషితం అవుతోంది. 


నగరం.. నరకం 

కర్నూలు నగరంలో నిత్యం 181 టన్నుల చెత్త ఉత్పత్తవుతోంది. నగర శివారులో గార్గేయపురం గ్రామ సమీపంలో చెత్త తెచ్చి పారబోస్తున్నారు. ఇప్పటి వరకు శుద్ధి ప్రక్రియ ఊసే లేకుండాపోయింది. ఇక్కడ లక్ష మెట్రిక్‌ టన్నులకుపైగా చెత్త పోగైంది. గుట్టలుగా చెత్త పోగవడంతో కాలుష్యం బారిన పడుతున్నామని గ్రామస్థులు పలుమార్లు ఆందోళన చేపట్టారు. అయినా అధికారులు మేల్కొనడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు