logo

ఉల్లి మడిలో కన్నీళ్లు

‘ఉల్లి’ పేరు చెప్పగానే మొదట గుర్తుకొచ్చేది కర్నూలు.. రాష్ట్రంలోనే ఇక్కడ అత్యధికంగా సాగవుతుంది.. ఇక్కడి నుంచి గతంలో పెద్దఎత్తున ఇతర రాష్ట్రాలకు సరకు ఎగుమతయ్యేది.. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితికి దిగజారింది.

Published : 21 May 2024 03:36 IST

అందని రాయితీ విత్తనం
కొరవడిన ప్రభుత్వ ప్రోత్సాహకం

పొలంలో విత్తనాలు చల్లుతున్న రైతు

కర్నూలు వ్యవసాయం, న్యూస్‌టుడే: ‘ఉల్లి’ పేరు చెప్పగానే మొదట గుర్తుకొచ్చేది కర్నూలు.. రాష్ట్రంలోనే ఇక్కడ అత్యధికంగా సాగవుతుంది.. ఇక్కడి నుంచి గతంలో పెద్దఎత్తున ఇతర రాష్ట్రాలకు సరకు ఎగుమతయ్యేది.. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితికి దిగజారింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సహకారం పూర్తిగా కొరవడింది. కనీసం రాయితీ విత్తనాలు ఇవ్వడం లేదు. ప్రోత్సాహకాలు అంతంత మాత్రమే.. రైతులు బయట మార్కెట్లో కొనుగోలు చేసిన విత్తనాలు నాసిరకంగా ఉండటంతో దిగుబడి పడిపోయింది.. వచ్చిన అరకొర ఉల్లికి గిట్టుబాటు ధరలు లభించడం లేదు. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టినా అప్పులు మిగులుతున్నాయి. దీంతో చాలామంది ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపుతున్నారు. 

పడిపోయిన సాగు విస్తీర్ణం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంలో 35 వేల హెక్టార్లలో ఉల్లి సాగయ్యేది.. ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడటం.. వర్షాభావ పరిస్థితులు.. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం.. తెగుళ్ల ఉద్ధృతి.. పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం తదితర కారణాలతో ఏటా సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. రబీలో అయితే ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం ఐదువేల హెక్టార్లకుమించడం లేదు. 2023-24లో 21,758 హెక్టార్ల మేర సాగైంది. సాధారణం కంటే 1,374 హెక్టార్లలో విస్తీర్ణం తగ్గిపోవడం గమనార్హం. 


ఐదేళ్లుగా దక్కని మద్దతు

  • 2021, 2022లో ఉల్లి క్వింటా రూ.500, రూ.600లోపే పలికింది. మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరినా.. ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించాం.. పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని సీఎం జగన్‌ గొప్పలు చెప్పారు. తన ఐదేళ్ల పాలనలో ఉల్లి రైతులను ఆదుకొనేలా కనీస చర్యలు చేపట్టలేదు. 2020-21లో క్వింటా రూ.770 చొప్పున 9,289.50 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఆ తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవు. 
  • కర్నూలు జిల్లాలో (2022-23) రెండు సీజన్లలో కలిపి 25,363 హెక్టార్లు, నంద్యాలలో ఎనిమిది వేల హెక్టార్లలో సాగైంది. సాధారణానికి మించి సాగవడంతో కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు ఉల్లి పోటెత్తింది. సుమారు నాలుగు లక్షల క్వింటాళ్ల వరకు క్రయవిక్రయాలు జరిగాయి. క్వింటా రూ.100, రూ.300 మాత్రమే పలకడం గమనార్హం. ధర లేకపోవడంతో చాలా మంది పొలాల్లో వదిలేశారు. మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. 

ముంచుతున్న విత్తనం

  • గతంలో రాయితీపై విరివిగా విత్తనాలిచ్చేవారు. నాలుగేళ్లుగా కోత పెడుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో అత్యధికంగా ఉల్లి సాగైతే.. రబీ సీజన్‌లో అరకొరగా ఇస్తుండటం గమనార్హం. 2022-23లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు 3,500 కిలోల రాయితీ విత్తనం ఇవ్వాలని నిర్ణయించారు. చివరికి 2,000 కిలోలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. 2023-24లో కేవలం నంద్యాల జిల్లాలో 20 క్వింటాళ్ల విత్తనం అందించారు.
  • హెక్టారుకు రూ.3 వేల చొప్పున ఒక్కో రైతుకు రెండు హెక్టార్ల వరకు రూ.6 వేల విత్తన రాయితీ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా అది మాటలకే పరిమితమైంది. ప్రభుత్వం నాణ్యమైన ఉల్లి విత్తనాలు ఇవ్వకపోవడంతో రైతులు స్థానికంగానే లూజుగా కొనుగోలు చేస్తున్నారు. కిలో విత్తనానికి రూ.600-800కు వ్యాపారులు విక్రయిస్తున్నారు. 

ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసిన విత్తనంలో నాణ్యత లేకపోవడంతో దిగుబడి పడిపోతోంది. ఉల్లిగడ్డ సైజులో హెచ్చుతగ్గులు ఉండటంతో ధరలు ఆశించిన మేర రావడం లేదు. ఎకరాకు 100-200 ప్యాకెట్ల దిగుబడి వచ్చే ఉల్లి ప్రస్తుతం 50-60 ప్యాకెట్లు రావడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


పడిపోయిన ఆదాయం

2022లో ఉల్లి ధరలు పతనమవడంతో కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ రూ.కోటి ఆదాయం కోల్పోయిందంటే ఉల్లి రైతుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది గిట్టుబాటు ధరలున్నా దిగుబడులు లేవు. గతేడాది ఒక్కరోజే మార్కెట్‌కు 15-20 వేల క్వింటాళ్ల ఉల్లి దిగుబడులు వచ్చేవి..ఇప్పుడు వెయ్యి క్వింటాళ్ల దిగుబడులు కూడా రావడం లేదు... ప్రస్తుతం ఉల్లి ధరలు కాస్త ఆశాజనకంగా ఉన్నా దిగుబడులు లేక మార్కెట్‌ వెలవెలబోతోంది. 


నిల్వ చేసుకొనే మార్గమేది

25 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యమున్న ఉల్లి గోదాములు నిర్మించుకునేందుకు 50 శాతం రాయితీపై రూ.87,500, ఉల్లి నారు మడులు పెంచుకునేందుకు షెడ్లకు చదరపు మీటరుకు ఒక్కింటికి రూ.355 రాయితీ ఇస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పింది. ఉల్లి నాటు యంత్రాలు, గ్రేడింగ్‌ యంత్రాలకు సంబంధించి రైతులకు 50 శాతం, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 75 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొంది. వంద సోలార్‌ డ్రయింగ్‌ యూనిట్లను ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ సహకారంతో ఉల్లి రైతు సంఘాలకు ఇచ్చి ఉల్లి పంట ప్రాసెసింగ్‌ సదుపాయం కల్పించామని చెప్పారు. అరకొరగా ఏర్పాటు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు