logo

అభిషేకం.. ఆంక్షలు

శ్రీశైల ఆలయ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు.. మల్లన్న అభిషేకానికి వచ్చిన భక్తులపై అదనపు భారం మోపారు. ఒక్కో భక్తుడు రూ.300 టికెట్లను రెండేసి కొనుగోలు చేస్తేనే మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం ఉంటుందని చెప్పడం వివాదాస్పదమైంది.

Updated : 21 May 2024 05:56 IST

మల్లన్న భక్తులపై బాదుడు
వెబ్‌సైట్‌లో టికెట్ల నిలిపివేత

రూ.300 టికెట్లు రెండేసి తీసుకోవాలని సేవాకర్తల పిల్లలు, కుటుంబ సభ్యులను క్యూలైన్‌ నుంచి బయటకు పంపిస్తున్న సిబ్బంది

ఈనాడు, కర్నూలు శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల ఆలయ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు.. మల్లన్న అభిషేకానికి వచ్చిన భక్తులపై అదనపు భారం మోపారు. ఒక్కో భక్తుడు రూ.300 టికెట్లను రెండేసి కొనుగోలు చేస్తేనే మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం ఉంటుందని చెప్పడం వివాదాస్పదమైంది. స్వామి అభిషేకం కోసం రూ.1,500 టికెట్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.. ఇందుకు అనుసంధానంగా రూ.500 టికెట్‌ తీసుకోవాలి.. అభిషేకానంతర దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఎనిమిదేళ్ల నుంచి అమల్లో ఉన్న ఈ విధానం వల్ల దంపతులు అభిషేకం టికెట్లు కొనుగోలు చేసి తమ ఇద్దరు పిల్లలు లేదా కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని స్వామివారి స్పర్శ దర్శనానికి తీసుకెళ్లేవారు. గత రెండు రోజుల నుంచి శ్రీశైల దేవస్థానం అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో కొన్ని మార్పులను తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి నుంచి దేవస్థానం వెబ్‌సైట్‌లో రూ.500 అభిషేకానంతర దర్శనం ఆప్షన్‌ను తొలగించారు. దీంతో అభిషేకానికి వచ్చిన సేవాకర్తలు తమ పిల్లలు, కుటుంబ సభ్యులకు అభిషేకానంతర దర్శనం టిక్కెట్లు పొందలేకపోయారు. 

దోపిడీకి అడ్డుకట్ట వేస్తున్నామంటూ

కొన్ని ఇంటర్నెట్‌ సెంటర్ల యాజమాన్యాలు ‘అభిషేక అనంతర దర్శనం’ టికెట్లను బుక్‌ చేసి అక్రమాలకు తెర తీశారని తెలుసుకున్న అధికారులు వెంటనే సరిదిద్దే చర్యలకు ఉపక్రమించారనే ప్రచారం జరుగుతోంది. ఇంటర్నెట్‌ కేంద్రాల నిర్వాహకులు అభిషేక అనంతరం దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసి ఎక్కువ ధరలకు ఇతరులకు విక్రయించి దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు ప్రత్యామ్నాయ పద్ధతులకు తెరలేపారంటున్నారు.శ్రీశైలంలో సేవల టికెట్లు రోజుకు ఒక లాగిన్‌ ఐ.డి. నుంచి రెండు మాత్రమే ఇచ్చేలా చర్యలు చేపట్టారు. ఫలితంగా ఒకే లాగిన్‌ ఐ.డి. నుంచి వందలాది టికెట్లు బుక్‌ చేసే నెట్‌ సెంటర్ల నిర్వాహకుల ధన దాహానికి అడ్డుకట్ట పడినట్లవుతుందని భావిస్తున్నారు. 


అధికారుల ఏకపక్ష నిర్ణయం

శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తులకు అవసరమైన ఆన్‌లైన్‌ సేవల్ని తాము ఉచితంగా అందిస్తామని 2021లో ఓ ప్రైవేటు సంస్థ ముందుకు వచ్చింది. సుమారు రూ.40 లక్షల వరకు వ్యయమయ్యే అంతర్జాల చిరునామా రూపకల్పనను ఉచితంగా చేస్తామని చెప్పడంతో ఆ సంస్థకే సేవల టికెట్ల జారీ, అంతర్జాల చిరునామా నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఆమేరకు అధికారిక ఒప్పందం చేసుకున్నారు. దేవస్థానం అధికారులు ఎలాంటి టెండర్ల ప్రక్రియ నిర్వహించకుండా ఏకపక్షంగా ఆ ఒప్పందం చేసుకోవడం గమనార్హం. ఓ మంత్రి సిఫార్సులు, అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆ సంస్థ ప్రతినిధులదే ఇష్టారాజ్యమన్నట్లుగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఆ మంత్రి ఒత్తిడి కారణంగానే దేవస్థానం అధికారులు కూడా ఆ ప్రైవేటు సంస్థతో సేవల టికెట్ల విక్రయాలకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది.


సాంకేతిక లోపమంటూ దాటవేసే ప్రయత్నం

వెబ్‌సైట్‌లో అభిషేకానంతర దర్శనం టికెట్లు లేకపోతే తమను బాధ్యుల్ని చేస్తారా..? అని కొందరు భక్తులు మండిపడ్డారు. దేవస్థానం అధికారులు రోజుకో నిబంధన అమలు చేస్తూ భక్తుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహ వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా, దేవస్థానం అధికారులు కొత్త నిర్ణయాలు తీసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. వెబ్‌సైట్‌ నిర్వహణ వల్ల భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ దేవస్థానం అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. సాంకేతిక లోపం వల్లే రూ.500 అభిషేకానంతర టిక్కెట్లు వెబ్‌సైట్‌లో భక్తులకు లభించలేదని దేవస్థానానికి చెందిన ఐటీ విభాగం సిబ్బంది ఒకరు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. సోమవారం సాయంత్రానికి కూడా దేవస్థానం వెబ్‌సైట్లో రూ.500 అభిషేకానంతర టికెట్లు అందుబాటులోకి రాలేదు. వెబ్‌సైట్లో నెలకొన్న సమస్య వల్ల అభిషేకం నిర్వహించుకోవాలనుకునే సేవాకర్తలకు ఇబ్బందులు తప్పేటట్లు లేవు.


భక్తుల ఆగ్రహం

స్వామి దర్శనానికి తమ కుమారుడికి రూ.300 టికెట్లు రెండు కొన్నానని చెబుతున్న భక్తులు 

మల్లన్న దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు. చాలా మంది దంపతులు రూ.1500 అభిషేకం టికెట్లు కొని  ఉదయం ఆలయ క్యూలైన్ల వద్దకు చేరుకున్నారు. అభిషేకానంతర టికెట్లు లేని పక్షంలో, అందుకు ప్రత్యామ్నాయంగా ఒక్కొక్కరికీ రూ.300 టిక్కెట్లు రెండేసి చొప్పున కొనుగోలు చేస్తేనే స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని సిబ్బంది చెప్పడంతో భక్తులు కంగుతిన్నారు. రూ.300 టికెట్లను సమీపంలోని కౌంటర్ల వద్ద తెచ్చుకోవాలని భక్తులను బయటకు పంపించారు. చేసేది లేక అదనంగా రెండేసి కొనుగోలు చేసి పిల్లలు, బంధువులతో కలిసి స్వామి దర్శనానికి వెళ్లారు. రూ.300 టిక్కెట్లను రెండేసి చొప్పున కొనుగోలు చేయడం వల్ల ఒక్కో భక్తుడిపై అదనంగా రూ.100 భారం పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని