logo

కవ్వించి.. కాలుదువ్వుతున్నారు

వైకాపా నాయకులు, కార్యకర్తల కవ్వింపుచర్యలకు అడ్డుకట్టపడటం లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల రోజు నుంచి ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్నారు.

Published : 23 May 2024 01:41 IST

శ్రుతిమించుతున్న వైకాపా నేతల తీరు 

కర్నూలు, నంద్యాల నేరవిభాగం న్యూస్‌టుడే: వైకాపా నాయకులు, కార్యకర్తల కవ్వింపుచర్యలకు అడ్డుకట్టపడటం లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల రోజు నుంచి ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్నారు. ఫలితాల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. వాటిని అడ్డుకోవాల్సిన పోలీసులు నేరానికి పాల్పడ్డ వారిపై కాకుండా ఫిర్యాదుదారులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. కొందరు తెలివిగా దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేయకుండా ఇరువురిపైనా బైండోవర్‌ నమోదు చేస్తున్నారు. 

ఎక్కడ...ఎప్పుడు ఏం జరిగింది

  • ఈనెల 13న మాజీ ఎమ్మెల్యే కర్నూలు అసెంబ్లీ పరిధిలోని జొహరాపురంలోని పోలింగ్‌ బూత్‌లో దౌర్జన్యానికి పాల్పడటంతో తెదేపా ఏజెంటు శ్రీనివాసగౌడ్‌ ప్రతిఘటించారు. అదే రోజు రాత్రి వైకాపా వర్గీయులు ఆయన ఇంటిపై మూకుమ్మడి దాడి చేయడంతో కర్నూలు 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీన్ని మనసులో పెట్టుకొని మాజీ ఎమ్మెల్యే అనుచరుడైన శేఖర్‌ మళ్లీ ఈ నెల 15న రాత్రిపూట కాపుకాసి స్థానిక పాతబస్టాండులో శ్రీనివాసగౌడ్‌పై దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత చోటుచేసుకొంది. పరిస్థితిని గమనిస్తే భవిష్యత్తులో మాజీ ఎమ్మెల్యే అనుచరుల నుంచి శ్రీనివాసగౌడ్‌కు హాని ఉన్నట్లు తెదేపా నాయకులు భావిస్తున్నారు. 
  • ఈ నెల 21న కర్నూలు జిల్లా వైకాపా సామాజిక మాధ్యమ కన్వీనరు ఇంద్రసేనారెడ్డి తెదేపా వర్గాన్ని రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలతో పోస్టు పెట్టారు. కర్నూలు 4వ పట్టణ పోలీసుస్టేషన్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల రోజు బి.క్యాంపు డాక్టర్స్‌ కాలనీకి చెందిన ధర్మా, బాలు అనే ఇద్దరు వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయి తెదేపా నగర అధ్యక్షుడు నాగరాజు డ్రైవర్‌పై దాడి చేసి గాయపర్చడంతో కర్నూలు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. 
  • ఎన్నికల రోజు డోన్‌ స్వతంత్ర అభ్యర్థి పీఎన్‌ బాబుపై వైకాపా అభ్యర్థి అనుచరులు దాడికి పాల్పడ్డారు. తర్వాత సీమ సుధాకర్‌రెడ్డి అనుచరులను పోలీసులు అరెస్టు చేయటంతో వైకాపా కుట్రనే ఆరోపణలు వచ్చాయి.  
  • ఎన్నికల రోజు పాణ్యం వైకాపా అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌రెడ్డి తనయుడు వేర్వేరు చోట్ల విద్యార్థి సంఘం నాయకుడు శ్రీరాములు, శివపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఓర్వకల్లు మండలం నన్నూరులో వైకాపా నాయకులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. 

  • ఆదోని పట్టణంలో వైకాపా నాయకుడు కృష్ణ మోహన్‌ బెదిరించి తెదేపా కార్యకర్త మెడలోని కండువా తీయించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. అళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గంలోని రుద్రవరం, శిరివెళ్లలో వైకాపా రెచ్చగొట్టే చర్యలతో ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకున్నాయి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని