logo

130 చరవాణులతో పాటు నగదు స్వాధీనం

డోన్‌ పట్టణంలోని చిగురుమానుపేటలో ఇంటింటి సోదాలు జరిపినట్లు బుధవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి డిఎస్పీ వివరాలు వెల్లడించారు.

Published : 23 May 2024 01:43 IST

చరవాణులు నగదు, నిందితుడ్ని చూపుతున్న డీఎస్పీ శ్రీనివాసరెడ్డి 

డోన్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: డోన్‌ పట్టణంలోని చిగురుమానుపేటలో ఇంటింటి సోదాలు జరిపినట్లు బుధవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి డిఎస్పీ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిగురుమానుపేటలోని ఎరుకలి రవి అలియాస్‌ పిలక రవి ఇంట్లో సోదాలు నిర్వహించగా 130 చరవాణులు, రూ.1,48,500 నగదు లభించడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. రవి సమీప బంధువులైన ఎరుకలి నవాగ్, ఎరుకలి పవన్‌ తమిళనాడులోని జన రద్దీ ప్రాంతాల్లో చరవాణులు చోరీ చేస్తారన్నారు. అలా దొంగిలించిన  వాటిని రవికి ఇస్తారని, ఆయన హైదరాబాద్‌కు తీసుకెళ్ళి అక్కడ మహమ్మద్‌ ఖాజానిజాముద్దిన్‌ అలియాస్‌ ఖైజర్‌కు విక్రయిస్తుంటారని తెలిపారు. 130 చరవాణుల విలువ రూ.21,00,000 ఉండొచ్చని, నగదు రూ.1,48,500లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆయనపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. పట్టణ, గ్రామీణ సీఐలు ప్రవీణ్‌కుమార్, అస్రత్‌బాషా, పట్టణ, గ్రామీణ, జలదుర్గం ఎస్సైలు శరత్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌ తమ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.


విద్యుదాఘాతానికి గురై యువకుడి దుర్మరణం

జలదుర్గం (ప్యాపిలి), న్యూస్‌టుడే: మండలంలోని జలదుర్గం గ్రామానికి చెందిన వెంకటరమణ (21) విద్యుదాఘాతానికి గురై బుధవారం మృతి చెందారని పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన చిక్కెం నాగరాజు, మహేశ్వరి దంపతుల కుమారుడు వెంకటరమణ పొలానికి వెళ్లి వేరుశనగ విత్తనం వేస్తుండగా, ఓచోట మలుపు తిరగాల్సి ఉండగా అక్కడకు రాగానే ప్రమాదవశాత్తు స్టార్టర్‌ బాక్స్, విద్యుత్తు తీగలు తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన డోన్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జలదుర్గం ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని