logo

ఇంటర్‌ విద్య.. భావిజీవిత మలుపు

విద్యార్థి జీవితం మలుపు తిరిగే ప్రధాన వేదిక ఇంటర్‌ విద్య. పదో తరగతి తర్వాత దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.

Published : 23 May 2024 02:01 IST

ప్రారంభమైన ప్రవేశాలు 

దేవనకొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు ఇంటర్‌ విద్యపై అవగాహన కల్పిస్తున్న అధ్యాపకులు 

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: విద్యార్థి జీవితం మలుపు తిరిగే ప్రధాన వేదిక ఇంటర్‌ విద్య. పదో తరగతి తర్వాత దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. గ్రూప్‌ ఎంపికలో విద్యా నిపుణులతో చర్చించడం, భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడేందుకు దోహదం చేసే అంశాలు తదితర వాటిపై విద్యార్థులు ఒకటి రెండుసార్లు విశ్లేషించుకున్న తర్వాతే ఇంటర్‌లో తమకిష్టమైన గ్రూప్‌ తీసుకుని ముందడుగు వేస్తారు. 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్మీడియేట్‌ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ఇంటర్‌ శాఖ విద్యాధికారులు తమ అధ్యాపకులతో కార్యాచరణ మొదలుపెట్టారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, పదో తరగతి పూర్తయిన విద్యార్థుల ఇళ్ల వద్దకెళ్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అందుతున్న విద్య, వసతులపై అవగాహన కల్పించడంతోపాటు ప్రవేశాలు చేపడుతున్నారు. ప్రైవేటు జూనియర్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆర్‌ఐవో గురువయ్య శెట్టి తెలిపారు.

విద్యా, వసతులపై విశ్లేషణ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 43 ప్రభుత్వ, 140 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటితోపాటు మొత్తం 54 కేజీబీవీల్లో 2,120 ఇంటర్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 60 శాతం సీట్లు భర్తీ అయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 32 ఆదర్శ పాఠశాలల్లో కూడా ఇంటర్మీడియట్‌ చదువుకోవడానికి అవకాశముంది. కేజీబీవీల్లో బాలికల చదువుతోపాటు సంరక్షణ, ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని ఒక్కో గ్రూప్‌నకు 120 సీట్లు అందుబాటులో ఉన్నాయంటూ అధ్యాపకులు ఇంటింటికి వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని