logo

ఉచిత శిక్షణ.. క్రికెట్‌కు నిచ్చెన

బేతంచెర్లలో నిర్వహిసున్న ఉచిత శిక్షణను క్రికెట్‌పై ఆసక్తితో విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి చిన్నారులు శిక్షణ శిబిరాలకు హాజరై బౌలింగ్, బ్యాటింగ్‌లలో తర్ఫీదు పొందుతున్నారు.

Published : 23 May 2024 02:06 IST

సాధన చేస్తున్న విద్యార్థులు 

బేతంచెర్ల, న్యూస్‌టుడే: బేతంచెర్లలో నిర్వహిసున్న ఉచిత శిక్షణను క్రికెట్‌పై ఆసక్తితో విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి చిన్నారులు శిక్షణ శిబిరాలకు హాజరై బౌలింగ్, బ్యాటింగ్‌లలో తర్ఫీదు పొందుతున్నారు. బేతంచెర్ల పట్టణంలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో క్రమం తప్పకుండా విద్యార్థులు సాధన చేస్తున్నారు. చిన్నారులు వచ్చిన వెంటనే వారికి  సీనియర్‌ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. క్రీడాకారులు ఫిట్‌గా ఉన్నారా లేదా అనే విషయాన్ని శిక్షకులు పరిశీలించి ఆ మేరకు వివిధ రకాల ఎక్సర్‌సైజ్‌లు చేయిస్తున్నారు. చిన్నారులు, శిక్షకులతో ఇక్కడి మైదానం ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటోంది.తొలుత శిక్షకులు ఆటలో పాటించాల్సిన విధానాలు వివరిస్తున్నారు. అందరికీ అవగాహన కల్పించాక శిక్షణ ఇస్తున్నారు.  షార్ట్‌ పిచ్, యార్కర్, పుల్‌టాస్, స్పిన్‌ బంతులను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తున్నారు. బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్‌ ఆడే తీరును బట్టి బంతిని ఎదుర్కొనే విధానాలను నేర్పిస్తున్నారు. వాటితో పాటు ఫీల్డింగ్‌లో కూడా పలు అంశాలపై విద్యార్థులకు చెబుతున్నారు. ఎలా ఆడాలో సీనియర్లు మెలకువలు నేర్పిస్తుండటంతో మైదానం ఎప్పుడూ సందడిగా ఉంటోంది.


ఆటపై ఇష్టంతోనే సాధన 

- మహమ్మద్‌ కైఫ్, ఇంటర్‌

క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఐపీఎల్‌ చూడటంతో ప్రభావితమయ్యాను. ఆట నేర్చుకోవాలనే పట్టుదలతో ముంబయిలో దిలీప్‌ వెంగ్‌ సర్కార్‌ క్రికెట్‌ అకాడమీలో అండర్‌ 17, 19 విభాగంలో ఆడాను. ఆల్‌ రౌండర్‌గా రాణిస్తూ పతకాలు సాధించాను. క్రికెట్‌లో మెలకువలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ సారి వేసవిశిక్షణ శిబిరానికి హాజరయ్యాను. ఇక్కడ  బ్యాటింగ్, బౌలింగ్‌ అంశాల్లో చక్కటి శిక్షణ ఇస్తున్నారు. వేసవి తర్వాత సాధన కొనసాగించి మంచి ఆటగాడిగా రాణించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నాను.


జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్నా

- ఎస్‌ఎండీ సమీర్, బేతంచెర్ల

రెండు సంవత్సరాల నుంచి వేసవి శిక్షణ తీసుకుంటున్నా. శిక్షణ తీసుకున్న తర్వాత జిల్లాస్థాయిలో నిర్వహించిన క్రికెట్‌ పోటీల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. కర్నూలులో జరిగిన అండర్‌-14 సబ్‌ జూనియర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీల్లో పాల్గొని జట్టు విజయానికి కృషి చేశా. సిమెంట్‌నగర్, బేతంచెర్లలో వేసవి శిక్షణ శిబిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్‌ జట్టులో ఆడి పతకం సాధించాను. బ్యాటింగ్‌లో పట్టు సాధించడం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాం. వేసవి శిక్షణ శిబిరంలో మెలకువలు నేర్చుకున్నాను.


ఆసక్తి పెరిగింది

 - శ్రీనివాసులు, శిక్షకుడు

ప్రస్తుత రోజుల్లో క్రికెట్‌లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండేళ్ల నుంచి విద్యార్థులకు ఉచితంగా వేసవిలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాం. విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. బేతంచెర్ల, సిమెంట్‌నగర్‌ గ్రామాల్లో జిల్లాస్థాయిలో నిర్వహించిన క్రికెట్‌ పోటీలకు ఎంపిక లు చేశాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని