logo

అక్రమ ఇసుక రవాణా అడ్డుకట్టకు చర్యలు

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టినట్లు సెబ్‌ పర్యవేక్షణాధికారి రవికుమార్‌ తెలిపారు.

Published : 23 May 2024 02:12 IST

- సెబ్‌ పర్యవేక్షణాధికారి రవికుమార్‌

వివరాలు వెల్లడిస్తున్న సెబ్‌ పర్యవేక్షణాధికారి రవికుమార్, పక్కన సీఐలు రాజేంద్రప్రసాద్, నరసనాయుడు 

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టినట్లు సెబ్‌ పర్యవేక్షణాధికారి రవికుమార్‌ తెలిపారు. బుధవారం కర్నూలు సెబ్‌ కార్యాలయంలో ఆయన కర్నూలు స్టేషన్‌ సీఐ రాజేంద్రప్రసాద్, డీటీఎఫ్‌ సీఐ నరసనాయుడు, ఎస్సై వీరస్వామిలతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తుంగభద్రనది నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించామన్నారు. కర్నూలు స్టేషన్‌ పరిధిలో మునగాలపాడు, జొహరాపురం పరిధిలో దాడులు నిర్వహించి 8 ట్రాక్టర్లను సీజ్‌ చేసి 8 మందిపై కేసులు నమోదు చేసి 32 మెట్రిక్‌ టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నామన్నారు. రూ.90 వేలు అపరాధ రుసుము వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేశామన్నారు. ఆదోనిలో రెండు ఇసుక ట్రాక్టర్లు, పత్తికొండ పరిధిలో రెండు ట్రాక్టర్లు సీజ్‌ చేసి 20 మెట్రిక్‌ టన్నులు సీజ్‌ చేశామన్నారు. నదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు, ఆదోని, గుడికంబాలి, కౌతాళంలో ఇసుక డిపోలున్నాయని, ఇసుక అవసరార్థులు అక్రమంగా ఇసుక కొనుగోలు చేయకుండా దరఖాస్తు చేసుకుని కొనుగోలు చేయాలన్నారు. అక్రమ ఇసుకను కొని ప్రోత్సహించవద్దన్నారు. ఇసుక అక్రమ రవాణా సమాచారం తెలిసినవారు తనకు (8008828467) ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. 2023 ఏడాదిలో ఇసుకకు సంబంధించి 137 కేసులు నమోదైతే ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటి వరకు వరకు 187 కేసులు నమోదు చేసి 719 మెట్రిక్‌ టన్నుల ఇసుకను సీజ్‌ చేశామన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 17,839 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని 319 కేసులు నమోదు చేసి 387 మంది నిందితులను అరెస్టు చేసి 216 వాహనాలు సీజ్‌ చేశామన్నారు. సారాకు సంబంధించి ఎర్రకత్వతాండా, ఎంఎం తాండా, రోళ్లపాడు తాండా, ఆదోని హిల్స్‌లు దాడులు చేసి భారీ మోతాదులో బెల్లం ఊటలను ధ్వంసం చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని