logo

చినుకు రాలింది.. దోమ పుట్టింది

చినుకు రాలింది.. ‘ఖాళీ’ స్థలాలు.. గుంతల్లో నిలిచిన నీటిలో దోమ పుట్టింది.. పుర సిబ్బంది మేల్కొనకపోతే జనం రోగాలబారిన పడటం ఖాయం.

Updated : 23 May 2024 04:52 IST

మేల్కొనకపోతే ప్రమాదమే
కట్టడికి కదలని పుర సిబ్బంది

చినుకు రాలింది.. ‘ఖాళీ’ స్థలాలు.. గుంతల్లో నిలిచిన నీటిలో దోమ పుట్టింది.. పుర సిబ్బంది మేల్కొనకపోతే జనం రోగాలబారిన పడటం ఖాయం. వర్షాకాలం రాకమునుపే కేసులు వెలుగు చూస్తున్నాయి. నగరం, పట్టణాల్లో అపరిశుభ్రత వెంటాడుతోంది. ఏటా పన్నుల రూపేణా ఆదాయం పొందుతున్న పురపాలికలు ఆ స్థాయిలో ప్రజారోగ్యంపై దృష్టి సారించడం లేదు. వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోయినా.. తొలగించే పరిస్థితి లేదు. జనం జ్వరాల బారిన పడుతున్నారు. ప్రాణాలమీదికొస్తున్నా.. పట్టించుకునేవారు కరవయ్యారు. పుర యంత్రాంగం మేల్కొనకపోతే జనాలకు రోగాల ముప్పు తప్పేలా లేదనేది స్పష్టమవుతోంది. 

న్యూస్‌టుడే, ఆదోని, నంద్యాల పురపాలకం, కర్నూలు నగరపాలక సంస్థ, పాతపట్టణం

 పట్టించుకోని ప్రజారోగ్య వ్యవస్థ 

పురపాలికల్లో ప్రజారోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కర్నూలు నగరపాలక సంస్థలో ఏటా రూ.50 లక్షలు, నంద్యాలలో రూ.10-15 లక్షలు, ఆదోనిలో రూ.5-10 లక్షల వరకు దోమల నివారణకు ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నారు. డోన్, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, గూడూరు తదితర పురపాలికల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇక్కడా ఒక్కో పురపాలికల్లో ఏటా రూ.1-2 లక్షలు ఖర్చు చేస్తున్నా.. కేసుల తీవ్రత ఆగడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి వర్ణనాతీతం. క్షేత్రస్థాయిలో మాత్రం వాటి ఫలితాలు కనిపించడం లేదు. తొమ్మిది పురపాలికల్లో ఫాగింగ్‌ యంత్రాలు 20-25, పిచికారీ పరికరాలు 350 వరకు ఉన్నాయి. వీటికి పని చెప్పక.... చాలా వాటిని మూలన పడేశారు. 

తొంగి చూసిన డెంగీ

ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంఘాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో 2024 ఏడాది జనవరి నుంచి మే నెలవరకు మొత్తం 192 డెంగీ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 168, నంద్యాల జిల్లాలో 24 కేసులు వచ్చాయి. మలేరియా కేసులు కర్నూలు జిల్లాలో రెండు వెలుగు చూశాయి. మండు వేసవిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక వర్షాకాలంలో పరిస్థితి తలచుకుంటే ఆందోళన కలిగిస్తోంది. 

కానరాని ప్రత్యేక కార్యక్రమాలు 

2014-19 మధ్య కాలంలో ‘దోమలపై దండయాత్ర’ పేరుతో నివారణ చర్యలు చేపట్టేవి. ఇవి ప్రజలను ఎంతో ఆలోచింపజేసేవి. ప్రతి శుక్రవారం ఫ్రై డే.. డ్రై డే నిర్వహించేవారు. దోమలు పుట్టే ప్రాంతాలను గుర్తించి.. నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకునేవారు. ఇక వార్డుల్లో నీటి తొట్టెలు, పాత సామగ్రి, అపరిశుభ్రత, ట్యాంకులను తెరిచి ఉంచడం, టెంకాయ చిప్పలు, టైర్లలో నీరు నిలిచి ఉండటం తదితరాలతో వచ్చే అనర్థాలను జనాలకు వివరించే వారు. వారిలో చైతన్యపర్చే కార్యక్రమాలు చేపట్టేవారు. వైకాపా ప్రభుత్వంలో ఇలాంటివి కనిపించలేదు. కనీసం క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది..? కేసులు వచ్చిన చోట ఏం చేయాలి? భవిష్యత్తు కార్యచరణ ఏమిటి...? అనే ఆలోచన లేకపోయింది.

నిధులు పక్కదారి

దోమల నివారణ పేరుతో నిధులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. కంటికి కనిపించే లెక్కలు కావు.. చేసిన పనులకు లెక్కలు వేయలేని పరిస్థితి. దీంతో ఈ విభాగంలో నిధులు పక్కదారి పట్టించారు. కర్నూలు నగరపాలక సంస్థలో ఇంధనం వాడకం పేరుతో సుమారు రూ.లక్షలు జేబులో వేసుకున్నారు. గతంలో ఆదోని పురపాలక సంఘంలో నాసిరకం బ్లీచింగ్, మలాథియన్‌ ద్రావణం తెప్పించి.. అధిక మొత్తంలో బిల్లులు చేసి, సొమ్ము స్వాహా చేశారు. అన్ని పురాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫాగింగ్‌ పేరుతో తిప్పే వాహనాలకు ఇంధనం కోసం బోగస్‌ బిల్లులు తయారుచేసి అక్రమాలకు పాల్పడుతున్న సంఘటనలున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని