logo

వనం.. హననం

ఈసారి ఎండలు మండిపోయాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎక్కడ పచ్చదనం ఉంటే అక్కడ జనాలు వాలిపోయారు. ప్రస్తుతం చినుకులు కురుస్తున్నాయి.

Published : 23 May 2024 02:27 IST

నర్సరీలకు నిధులివ్వని ప్రభుత్వం 
నిలిచిపోయిన మొక్కల పెంపకం

‘‘కర్నూలు- గుంటూరు రహదారిని విస్తరిస్తున్నారు.. కర్నూలు నగరం నుంచి బైర్లూటి వరకు నాలుగు వరుసలుగా పనులు చేపడుతున్నారు.. రహదారికి ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలను తొలగించారు.. మళ్లీ మొక్కలు నాటాలంటే ఉమ్మడి జిల్లాలో ఎక్కడా అందుబాటులో లేవు.. కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, ఆళ్లగడ్డ మున్సిపాల్టీల్లో రోడ్ల మధ్య డివైడర్లు ఏర్పాటు చేసినా వాటిలో నాటేందుకు మొక్కలు అందుబాటులో లేవు.’’

సారి ఎండలు మండిపోయాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎక్కడ పచ్చదనం ఉంటే అక్కడ జనాలు వాలిపోయారు. ప్రస్తుతం చినుకులు కురుస్తున్నాయి. ఎండాకాలంలో పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పలువురు తమ ఇళ్ల ఎదుట మొక్కలు నాటుకోవాలని చూస్తున్నారు. నర్సరీల్లో మొక్కలు కానరాకపోవడంతో ప్రైవేటు నర్సరీల వద్దకు వెళ్తున్నారు.. అక్కడ కేవలం పూల మొక్కలే దొరుకుతున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పచ్చదానికి మంగళం పాడింది..నిధులు ఇవ్వకపోవడంతో సామాజిక వన నర్సరీలను మూసేశారు. అడవులు క్షీణిస్తున్నాయి.. పచ్చదనాన్ని పెంపొందించాలని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదికలు పేర్కొంటున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు.

న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం, ఆత్మకూరు

నంద్యాల బొమ్మలసత్రం: మహానందిలో అటవీ శాఖ సామాజిక వన విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్‌ నర్సరీలో గతంలో
ఏటా రెండు లక్షలకు పైగా మొక్కలు పెంచేవారు.. రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో ప్రస్తుతం 30 వేల మొక్కలు పెంచుతున్నారు.

అప్పుడు కళకళ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో అటవీ శాఖ సామాజిక విభాగం ఆధ్వర్యంలో సెంట్రల్‌ నర్సరీలు ఏర్పాటు చేశారు. పశ్చిమ ప్రాంతంలో విజయవనం, బనవాసి, కరివేముల, కాల్వబుగ్గ, వెల్దుర్తి, మదార్‌పురం, గోనెగండ్ల, పందికోన, బోడబండ, తూర్పు ప్రాంతంలో మహానంది, ఏనుగుమర్రి, డోన్, నర్సాపురం, రెడ్డిపల్లె నర్సరీల్లో లక్షలాది మొక్కలను పెంచేవారు. కానుగ, సుంకేసుల, వేప, నేరేడు, సుబాబుల్, టేకు, జుట్టేగు, ఎర్రచందనం, చింత తదితర మొక్కలతో పాటు జామ, సపోట, దానిమ్మ, మామిడి, ఉసిరి, నిమ్మ, చీనీ వంటివి పెద్దఎత్తున పెంచేవారు. నర్సరీల్లో పెంచిన మొక్కలను జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట నాటేవారు. పొలాల్లో, ఇంటి ఆవరణాల్లో పెంచుకునే వారికి పంపిణీ చేసేవారు.

ఇప్పుడు వెలవెల

నర్సరీల్లో పెంచిన మొక్కలను పొదుపు సంఘాలు, విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘ఖాళీ’ ప్రదేశాల్లో నాటించే వారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా గాలికొదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అటవీ శాఖ సామాజిక వన నర్సరీలను మూసేసింది. పాణ్యం నర్సరీ రూ.3 లక్షలు, రుద్రవరం నర్సరీలకు రూ.4 లక్షల వరకు రావాల్సి ఉంది. వన నర్సరీల నిర్వహణకు కేంద్రం ఉపాధి హామీ నిధులు కేటాయించేది.. ఈ పథకం ద్వారానే కూలీలకు వేతనాలు చెల్లించేవారు. ఉపాధిహామీ పథకం లబ్ధి జాబితా నుంచి వన నర్సరీలను తొలగించారు.. రెండేళ్ల నుంచి నిధులు రావడం లేదు. ప్రత్యామ్నాయ నిధులిచ్చి మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. 

వన  మహోత్సవాలకు మంగళం

గతంలో వానాకాలం ప్రారంభంకాగానే పెద్దఎత్తున మొక్కలు నాటేవారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు, పర్యావరణ దినోత్సవం, ముఖ్యమంత్రి, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర అతిథులు వచ్చినప్పుడు గౌరవ సూచకంగా మొక్కలు నాటుతారు. మూడేళ్లుగా అటవీ శాఖ నర్సరీల్లో మొక్కలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు నర్సరీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. 53 మండలాల పరిధిలో గత కొన్నేళ్లుగా వన మహోత్సవాలు మొక్కుబడిగా కొనసాగుతున్నాయి. ఏటా ఆగస్టు నెలలో పాఠశాలలు, కళాశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమం నెమ్మదించింది.

మొక్కబడిగా సంరక్షణ

  • జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో 2022-23 సంవత్సరంలో రహదారికి ఇరువైపులా 300 కి.మీ. మేర మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. 2022 డిసెంబరు నాటికి 40.20 కి.మీ. మేర నాటినట్లు దస్త్రాల్లో రాసుకున్నారు.  
  • ఉమ్మడి జిల్లాలో 5.82 లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా నిర్దేశించగా 3.35 లక్షలు నాటారు. వాటిలో 1.99 లక్షలు బతికినట్లు లెక్కల్లో చూపించారు. ఒక్కో మొక్క సంరక్షణకు రోజుకు 50 పైసలు చొప్పున నెలకు రూ.15, నీరు పోసేందుకు ఒక కి.మీ. పరిధిలో 400 మొక్కలకు రోజుకు రూ.4.15 చొప్పున నెలకు రూ.49,800 చెల్లించారు. 
  • నంద్యాల జిల్లాలో 100 కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని డ్వామా అధికారులు లక్ష్యం నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 180.5 కి.మీ. వరకు రోడ్లను ఎంపిక చేసుకున్నారు. 176.5 కి.మీ. మేర గుంతలు తీశారు. ఏడాది పొడవునా గుంతలు తీయడం, మొక్కలు నాటడం, నీళ్లు పోయడం వంటి పనులకు రూ.55 లక్షలకుపైగా ఖర్చు చేశారు. నాటిన వాటిలో పాతిక శాతం కనిపించడం లేదు. 
  • కర్నూలు జిల్లా విస్తీర్ణం 7,97,740 హెక్టార్లు ఉండగా 25 మండలాల పరిధిలో కేవలం 32,032 హెక్టార్లలో (4 శాతం) అడవులు ఉండటం గమనార్హం. కౌతాళం, కోసిగి, పెద్దకడబూరు మండలాల్లో ఒక శాతం, హాలహర్వి, ఆలూరు, ఆస్పరిలో రెండు శాతమే ఉంది. మొక్కల పెంపు కాగితాలకే పరిమితమైంది. గత ఐదేళ్లలో 10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నా.. కేవలం 3 లక్షల నాటినట్లు సమాచారం. వీటి సంరక్షణ లేకపోవడంతో చాలా వరకు ఎండిపోయాయి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని