logo

వేరుశనగ విత్తు.. నాసిరకం ఎత్తు

గతేడాది రెండు సీజన్లు ‘కరవు’లో కలిశాయి.  ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురుస్తుండటంతో హలధారి ఆనందంగా పొలంబాట పడుతున్నారు.. పొలాలను హలాలు దున్నుతున్నాయి.

Published : 23 May 2024 02:31 IST

జిల్లాకు చేరిన విత్తనకాయలు 

గతేడాది రెండు సీజన్లు ‘కరవు’లో కలిశాయి.  ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురుస్తుండటంతో హలధారి ఆనందంగా పొలంబాట పడుతున్నారు.. పొలాలను హలాలు దున్నుతున్నాయి.. రైతులు విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 16,379 క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయ కేటాయించారు. విత్తన పంపిణీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యాపారులకు లాభం చేసేదిలా ఉంది. ఆ విత్తనాల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. 

న్యూస్‌టుడే, కర్నూలు వ్యవసాయం

సాగుకు సరిపోని కేటాయింపులు

ఉమ్మడి కర్నూలు జిల్లాకు కె-6, టీసీజీఎస్‌-1694, కదిరి లేపాక్షి రకం వేరుశనగ విత్తనాలు కేటాయించారు. కర్నూలు జిల్లా పరిధిలోని పత్తికొండ, కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు డివిజన్‌ పరిధిలో 58,969 హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉంది.. 13,929 క్వింటాళ్ల విత్తనం కేటాయించారు. మరో ఐదు వేల క్వింటాళ్లు కేటాయించాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపించినా వ్యవసాయశాఖ నుంచి ఎలాంటి స్పందన లేదు. నంద్యాల జిల్లా డోన్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని డోన్, ప్యాపిలి మండలాల్లో వేరుశనగ సాగవుతోంది. 2,450 క్వింటాళ్ల విత్తనాలు కేటాయించారు. 

వ్యాపారులకు లాభం

గతంలో ఏపీ సీడ్స్, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో కొనసాగిన విత్తనోత్పత్తి పథకం ద్వారా సేకరించేవారు. రైతులకు మూల విత్తనం అందించి సాగు చేపట్టేవారు. పంట పూర్తికాగానే కొనుగోలు చేసేవారు.. వాటిని ప్రాసెసింగ్‌ చేసి విత్తనాలు అందించేవారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అటకెక్కించింది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి నేరుగా వ్యాపారుల నుంచి సేకరించారు. సదరు వ్యాపారులు రైతులకు క్వింటాకు రూ.6,500-రూ.7,000 చెల్లించి కొనుగోలు చేశారు. వాటిని ఏపీ సీడ్స్‌ సంస్థ క్వింటాకు రూ.9,500 చెల్లించి తీసుకొంది. క్వింటాపై రూ.2,500 వ్యాపారులకు లాభం చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. 

రైతులకు రూ.కోటి భారం

ప్రభుత్వం 40 శాతం రాయితీతో వేరుశనగ విత్తన కాయలు అందజేస్తోంది. కిలో ధర రూ.95గా నిర్ణయించారు.. ఇందులో 40 శాతం రాయితీ పోతే రైతులు రూ.57 చెల్లిస్తే కిలో విత్తన కాయలు ఇస్తారు. ప్రభుత్వం ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం కొనుగోలు చేస్తే 40 శాతం రాయితీ పోనూ రూ.4,500-రూ.5,000 కు క్వింటా వేరుశనగ విత్తనం అందించడానికి వీలుంది. ప్రభుత్వం అందజేస్తున్న విత్తన కాయలు కొనుగోలు చేసే రైతులకు క్వింటాపై రూ.500 భారం పడుతోంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా రైతులకు రూ.కోటి వరకు విత్తన భారం పడుతుందని అంచనా.

ప్రాసెసింగ్‌ను పరిశీలించని అధికారులు

ఏపీ సీడ్స్‌ సంస్థ  విత్తనాలను జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం జల్లాపురంలోని మహంకాలేశ్వర అగ్రిటెక్‌ ప్రైవేటు లిమిటెడ్, కర్నూలు జిల్లా ఉల్చాల రోడ్డులో మునగాలపాడు పరిధిలో చక్ర సీడ్స్, కల్లూరు మండల పరిధిలోని కల్లూరు పారిశ్రామికవాడలో శ్రీకృష్ణ సీడ్స్, శ్రీ శివసాయి సీడ్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో శుద్ధి ప్రక్రియ చేపడుతోంది. పరిశీలించేందుకు ఏఈవోలను ఇన్‌ఛార్జులుగా నియమించారు. ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అధికారులు అటువైపు వెళ్లలేదు. దీంతో  30 కిలోల సంచిలో 60 శాతం నాణ్యమైనవి.. 40 శాతం నాసిరకమైనవి కలిపేసి మాయ చేసినట్లు తెలుస్తోంది.

విత్తన శుద్ధి.. అబద్ధం

  • వ్యాపారులు మార్కెట్‌ యార్డుల్లో రైతుల నుంచి తక్కువ ధరకు వేరుశనగ విత్తనకాయలు కొనుగోలు చేసి ఏపీ సీడ్స్‌ సంస్థకు సరఫరా చేస్తున్నారు. వాటిని శుద్ధి చేసిన ప్రయోగశాలల్లో నాణ్యతను నిర్ధారించిన తర్వాత రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా మమ అనిపించి 30 కిలోల సంచుల్లో ప్యాకింగ్‌ చేసి పదివేల క్వింటాళ్ల వరకు పంపించారు. వ్యవసాయాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విత్తన శుద్ధి ప్రక్రియ గాడి తప్పింది.
  • కె-6 రకం గతంలో నాణ్యతగా ఉండేది. ప్రస్తుతం అంతా మిశ్రమంగా ఉంది.. విత్తనం నాసిరకంగా ఉందని రైతులు పేర్కొంటున్నారు. సాధారణంగా ఈ రకం విత్తన గింజలకు ముక్కులా మొన ఉంటుంది. ప్రస్తుతం విత్తన గింజల్లో అలాంటివి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. 
  • కదిరి లేపాక్షి విత్తనకాయలూ నాసిరకంగానే ఉన్నాయి. దిగుబడి బాగా వస్తుందని అధికారులు చెబుతున్నారు. గింజ చేదుగా ఉంటోందని రైతులు చెబుతున్నారు. దీని వల్ల ఆశించిన ధర రావడం లేదు.
  • టీసీజీఎస్‌-1694 రకం విత్తనానికి డిమాండ్‌ ఉండటంతో వ్యాపారులు ఇతర రకాలు కలిపి ప్యాకింగ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని