logo

అక్రమాలకు అడ్డుకట్టలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు ద్వారా మద్యం విక్రయించే విధానం నిలిచిపోయింది. ఎన్నికల కమిషన్‌ చొరవతో సదరు విధానానికి తెర పడింది.

Published : 25 May 2024 02:57 IST

ఆన్‌లైన్‌ చెల్లింపులతోనే మద్యం అమ్మకాలు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు ద్వారా మద్యం విక్రయించే విధానం నిలిచిపోయింది. ఎన్నికల కమిషన్‌ చొరవతో సదరు విధానానికి తెర పడింది. కేవలం ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారానే శుక్రవారం నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో 175 మద్యం దుకాణాలున్నాయి. ప్రతిరోజూ రూ.4 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందు కేవలం నగదు ద్వారానే అమ్మకాలు జరిగేవి. డిజిటల్‌ పేమెంట్‌ విధానం అమలు చేయాలని జనం, ప్రతిపక్షాలు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం నగదుతో విక్రయాలు చేయడం ద్వారా పెద్ద కుంభకోణం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కేంద్రం దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోయింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత  ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదుతోపాటు డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా కూడా అమ్మకాలు జరిపే విధానం అమలులోకి వచ్చింది. 

గొలుసు దుకాణదారులతో  కుమ్మక్కై..

ప్రసుత్తం ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కేవలం డిజిటల్‌ చెల్లింపుల ద్వారా అమ్మకాలు జరపాలని మద్యనిషేధ, ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించి శుక్రవారం నుంచి అమలు చేశారు. కాగా కర్నూలులో పలువురు మందుబాబులు దుకాణాల్లో పనిచేసే సేల్స్‌మెన్, సూపర్‌వైజర్లతో గొడవకు దిగారు.  ఆన్‌లైన్‌ అమ్మకాల కారణంగా గొలుసు దుకాణాల నిర్వాహకులు, సేల్స్‌మెన్లకు మధ్య సంబంధాలకు చెక్‌ పడింది. నిబంధనల ప్రకారం ఓ వ్యక్తికి మూడు మద్యం సీసాలు మాత్రమే విక్రయించాల్సి ఉంది. అయితే సేల్స్‌మెన్లు గతంలో గొలుసు దుకాణ నిర్వాహకులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరిపేవారు. నగదు విధానం కావటంతో అక్రమ అమ్మకాల వ్యవహారం బయటపడేది కాదు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ నగదు చెల్లింపుల విధానంతో గొలుసు దుకాణాల నిర్వాహకులకు కళ్లెం పడింది. సేల్స్‌మెన్లు అధిక ధరలకు విక్రయించే అవకాశం లేకుండా పోయింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని