logo

విద్యా కుసుమం.. విలువలకు నిలయం

కర్నూలు నగరంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలోని కసిరెడ్డి వెంకటరెడ్డి (కేవీఆర్‌) మహిళా డిగ్రీ, జూనియర్‌ కళాశాల ఎంతో ప్రసిద్ధి. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు 1958లో కసిరెడ్డి వెంకటరెడ్డి ఈ కళాశాలను ప్రారంభించారు.

Published : 25 May 2024 03:03 IST

కేవీఆర్‌ కళాశాలలో ఇంటర్న్‌షిప్‌  

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: కర్నూలు నగరంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలోని కసిరెడ్డి వెంకటరెడ్డి (కేవీఆర్‌) మహిళా డిగ్రీ, జూనియర్‌ కళాశాల ఎంతో ప్రసిద్ధి. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు 1958లో కసిరెడ్డి వెంకటరెడ్డి ఈ కళాశాలను ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు ఎంతో మంది విద్యార్థినులు ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసుకొని ఉన్నత స్థానాల్లో నిలిచారు. ఇక్కడ పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థినులు కేవీఆర్‌ కళాశాలలోనే అధ్యాపకులుగా రాణిస్తుండటం గమనార్హం. కళాశాల ప్రారంభం నుంచి మహిళా విద్య, మహిళా సాధికారతకు కృషి చేస్తోందని ప్రిన్సిపల్‌ వీవీఎస్‌ కుమార్‌ తెలిపారు. విద్యార్థినులు ఎన్‌ఎస్‌ఎస్‌లో రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, స్వీయ రక్షణలో కత్తి, కర్ర సాము మెలకువలు నేర్పిస్తుండటం విశేషం. మొదట్లో మూడు సైన్స్, నాలుగు ఆర్ట్స్‌ గ్రూపులతో ప్రారంభమైంది. 1998లో డిగ్రీ కోర్సులతోపాటు పీజీ కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థినుల సౌకర్యం కోసం కళాశాల ఆవరణలోనే వసతి గృహం కూడా ఉంది. దీంతో విద్యార్థినులకు రక్షణతోపాటు విలువలతో కూడిన విద్యను కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో అందిస్తున్నారు. ఇంటర్‌లో సుమారు 1,100 మంది, డిగ్రీలో 1,300 మంది, పీజీలో 100 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ కళాశాలలో చదవడానికి ఎంతో మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కర్నూలు నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాలు, అనంతపురం, వైజాగ్, వైఎస్సార్‌ జిల్లాలతోపాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా విద్యార్థినులు ఇక్కడ చదువుకోవడం విశేషం.

సాగుబడి పాఠాలు..

  • సైన్స్‌ చదివే విద్యార్థినులు ఇంటర్న్‌షిప్‌లో హైడ్రోఫోనిక్‌ సాగు పాఠాలు నేర్చుకుంటున్నారు. కుండీలు, మడుల్లో కన్నా హైడ్రోఫోనిక్‌ పద్ధతిలో 15 రోజులు ముందుగానే ఆకుకూరలు కోతకు వస్తాయి. ప్రొట్రేల్లో కొబ్బరి పొట్టు నింపి, ఆకుకూరల విత్తనాలు వేసిన 21 రోజులు పెంచుతారు. తర్వాత మొక్కలను పీవీసీ పైపులతో తయారైన ఎన్‌ఎఫ్‌టీ ఛానల్‌లో ఉంచాలి. పైపుల్లో నిరంతరం ద్రావణ రూపంలోని సూక్ష్మ, స్థూల పోషకాలతో కూడిన నీరు సరఫరా అవుతూ ఉంటుంది. ఈ పద్ధతిలో పెట్టిన పాలకూర, కొత్తిమీర, పుదీనా, పొన్నగంటి, పాలకూర, చెర్రి, టమాటా, ఎర్రతోట కూరలు 20 నుంచి 25 రోజుల్లో కోతకు వస్తాయి. 
  • కళాశాలలోని బొటనీ కార్యాలయంలో సూర్యరశ్మి తగలకుండా శుద్ధి గ్రీన్‌ స్టాటప్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఇందులో ఎర్రతోట కూర, బేసిల్, పాలకూర, బటర్‌ కప్‌ లెట్యూస్‌ ఇలా 24 మొక్కలు ఉన్నాయి. దీని ఏర్పాటుకు సుమారు రూ.24 వేలు వెచ్చించారు. 

దరఖాస్తుల స్వీకరణ

ఇంటర్‌లో జనరల్‌ కోర్సులకు సంబంధించి 480 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఒకేషనల్‌ కోర్సులో 200 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటివరకు 150 మందికి అడ్మిషన్లు ఇచ్చారు. జూన్‌ 6వ తేదీ నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.


ఎన్‌సీసీలో శిక్షణ

ప్రభుత్వ కొలువు సాధించడంలో ఎన్‌సీసీ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. దీంతోపాటు చదువులో ఉత్తమ మార్కులు సాధించడం, క్రీడల్లో సత్తా చాటితే సర్కారు కొలువులు సులువుగా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం విద్యార్థినులు చదువుతోపాటు ఎన్‌సీసీ, క్రీడలపై దృష్టి సారించడంతోపాటు పతకాలు సొంతం చేసుకుంటున్నారు. నగరంలోని కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల్లో 20 శాతం మందిని ఎన్‌సీసీ విభాగానికి ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రతి ఏడాది రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొని కర్నూలు జిల్లాకు గుర్తింపు తెచ్చిపెడుతున్నారు. ఎన్‌సీసీలో చురుకైన విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడంతోపాటు మెలకువలు నేర్పిస్తుండటం విశేషం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని