logo

రుచించనిమామిడి

ఉమ్మడి జిల్లాలోని మామిడి రైతుల జీవితాల్లో తియ్యదనం కరవైంది. మామిడిని పండించిన రైతులు ఈ ఏడాది దిగుబడిలోనూ, ధరలోనూ పెద్దగా ప్రగతి లేకపోవడంతో కుదేలయ్యారు.

Published : 25 May 2024 03:06 IST

దిగుబడులు, ధరలు అంతంతే
అన్నదాతకు గిట్టుబాటు కాని పరిస్థితి

డోన్, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని మామిడి రైతుల జీవితాల్లో తియ్యదనం కరవైంది. మామిడిని పండించిన రైతులు ఈ ఏడాది దిగుబడిలోనూ, ధరలోనూ పెద్దగా ప్రగతి లేకపోవడంతో కుదేలయ్యారు. మామిడి తమ జీవితాలను తీపిమయం చేయలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని డోన్, ఓర్వకల్లు, ఎంబాయి, మండ్లవానిపల్లె, ఓబులాపురం, కొత్తపల్లె, ప్యాపిలి మండలంలోని పలు ప్రాంతాలతో పాటు కోడుమూరు, దేవనకొండ మామిడికి ఎంతో ప్రసిద్ధి. ఏటా జిల్లా నుంచి లక్ష టన్నుల వరకు ఇతర ప్రాంతాలకు ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తారు. 

ఈ ఏడాది మామిడి దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడం, కాసిన అడపాదడపా తోటల్లోనూ దిగబడులు వచ్చినా..వాటికి అనుకున్న స్థాయిలో ధరలు లేకపోవడంతో మామిడి మార్కెట్లలో కళ తగ్గింది. వ్యాపారాలు బోసిపోతున్నాయని వ్యాపారులు దిగులు చెందుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి మామిడి తోటలను కొనుగోలు చేసిన రైతులకు ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదని ఆందోళన చెందుతున్నారు. డోన్, గుంతకల్లు, బళ్లారి, అనంతపురం తదితర మార్కెట్లకు పెద్దఎత్తున మామిడి ఎగుమతులు ఉండేవి. ఆశించిన మేర దిగుబడులు లేకపోవటంతో కొందరు కొనుగోలుదారులు పొలాల వద్దకు వెళ్లి అక్కడే కొనుగోలు చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, చీడపీడలతో అనుకున్న స్థాయిలో దిగుబడులు రాలేదు. ఎకరాకు 2 టన్నుల వరకు మాత్రమే వచ్చాయంటున్నారు. టన్ను బేనిషాన్‌ రకం రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు పలుకుతోందంటున్నారు. ఏటా దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు మామిడి ఉత్పత్తుల ద్వారా టర్నోవర్‌ జరిగేదని, ఈ ఏడాది అంత ఎత్తున జరగలేదంటున్నారు. మామిడిలో తోతాపురి, రసాలు, ఇతర రకాలకు సంబంధించిన వాటి ధరలు కూడా మరింతగా దిగజారాయని చెబుతున్నారు. వాటి ధర కూడా రూ.12 వేల నుంచి రూ.20 వేల లోపు మాత్రమే ఉన్నాయని, వచ్చిన అంతంతమాత్రం దిగుబడులతో ఈ ధరలు మరింతగా తమను కుంగదీస్తున్నాయని చెబుతున్నారు. మార్కెట్లలో వ్యాపారుల వద్ద మాత్రం కిలో రూ.80 నుంచి 100 వరకు ధర పలుకుతున్నా...రైతుల జీవితాల్లో మాత్రం కాంతులీనడం లేదు. 


గతేడాది కంటే తక్కువే 

- సూరిబాబు, వ్యాపారి

గతేడాది నాలుగైదుతోటల్లో మామిడిని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చుపెట్టి కొనుగోలు చేశాం. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో తోటల దగ్గరికెళ్లి కొనుగోలు చేయాలంటేనే భయపడ్డాం. ఎలాగోలా ధైర్యం చేసి మామిడితోటలు కొనుగోలు చేశాం. దిగుబడులు పెద్దగా రాలేదు, కనీసం ధరలైనా ఆశించిన స్థాయిలో ఉంటాయనుకుంటే వాటి పరిస్థితి దారుణంగానే తయారైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని