logo

తీరని దాహం.. ఆస్పరి ఆగ్రహం

నీరు చేరని ట్యాంకులు.. బొట్టు రాల్చని కుళాయిలు..  ఎండుతున్న గొంతులు.. గుక్కెడు నీటి కోసం బండెడు కష్టాలు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నెలలు అష్టకష్టాలు పడుతున్నారు. భరించలేకపోయారు.

Published : 25 May 2024 03:08 IST

న్యూస్‌టుడే, ఆస్పరి  

నీరు చేరని ట్యాంకులు.. బొట్టు రాల్చని కుళాయిలు..  ఎండుతున్న గొంతులు.. గుక్కెడు నీటి కోసం బండెడు కష్టాలు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నెలలు అష్టకష్టాలు పడుతున్నారు. భరించలేకపోయారు.   ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. ఆస్పరి వాసులు ఖాళీ బిందెలు చేతబట్టి కదిలొచ్చారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.  ఇదీ శుక్రవారం ఆస్పరి వాసులు చూపిన ‘జలా’గ్రహం.  

స్పరి పట్ణణంలోని ఎస్సీ కాలనీ, సుద్దబావి కాలనీతో పాటు వివిధ కాలనీల్లో తీవ్రమైన నీటిసమస్య ఉందని, పరిష్కరించాలని మహిళలు, పురుషులు, పిల్లలంతా కలిసికట్టుగా శుక్రవారం పెద్దఎత్తున ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చారు. ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. నీటి సమస్య గురించి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా.. ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. నాగనాతనహళ్లి జలాశయం నుంచి నీరు సక్రమంగా సరఫరా చేయాలని డిమాండు చేశారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో మహిళలంతా ఎంపీడీవో కార్యాలయం లోపలికి వెళ్లి ఎంపీడీవో, కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్య పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదన్నారు. ఎంపీడీవో లక్ష్మీనారాయణ, కార్యదర్శి  నాయక్‌ మాట్లాడుతూ.. గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. సర్పంచితో మాట్లాడి ట్యాంకర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు మహానంది ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో స్థానికులు నాగేంద్ర, వీరేష్, మహానంది, లాలప్ప, సావిత్రమ్మ, సుహసీసి, మునెమ్మ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని