logo

పట్నవాసం.. చీకటి శాపం

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగక చీకట్లు కమ్ముకున్నాయి. నెలల తరబడి వెలగకున్నా పట్టించుకోవడం లేదు. ఏజెన్సీకి బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఏమీ చేయలేని పరిస్థితి.

Updated : 25 May 2024 06:08 IST

అధ్వానంగా ఎల్‌ఈడీ దీపాల నిర్వహణ
శివారు కాలనీల్లో అంధకారం
న్యూస్‌టుడే, ఆదోని పురపాలకం, కర్నూలు నగరపాలక సంస్థ, నంద్యాల పురపాలకం

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగక చీకట్లు కమ్ముకున్నాయి. నెలల తరబడి వెలగకున్నా పట్టించుకోవడం లేదు. ఏజెన్సీకి బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఏమీ చేయలేని పరిస్థితి. చివరికి జనం చీకట్లోనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఎదురెదురుగా వచ్చే వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చివరికి వీధి దీపాల విషయంలోనూ నిర్లక్ష్యం చేస్తోంది.

మ్మడి కర్నూలు జిల్లాలోని పురపాలక సంఘాల్లో ఎల్‌ఈడీ దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తొమ్మిది పురపాలక సంఘాల్లో యాభై వేలకుపైగా వీధి దీపాలున్నాయి. గత తెదేపా ప్రభుత్వ హయాంలో 2016-17 మధ్యకాలంలో ఈఈఎస్‌ఎల్‌ కంపెనీ ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ దీపాల నిర్వహణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా పాత బల్బుల స్థానంలో ఎల్‌ఈడీలను తెరపైకి తెచ్చారు. ఫలితంగా విద్యుత్తు ఆదా పెరిగింది. బిల్లుల రూపేణా ఆర్థిక భారం తగ్గింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దీపాల నిర్వహణను అటకెక్కించింది. ఫలితంగా శివారు కాలనీల్లో కారుచీకట్లు కమ్ముకున్నాయి. నేటికీ ప్రతి పురపాలక సంఘంలో పదుల సంఖ్యలో దీపాలు అవసరమైనా సకాలంలో సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. ఏటా పన్నుల రూపేణా పురపాలికల నుంచి రూ.180-190 కోట్ల వరకు ఆదాయం లభిస్తున్నా ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. 

భారీగా బకాయిలు

ఆదోని పట్టణంలోని 42 వార్డుల్లో 7 వేల వరకు ఎల్‌ఈడీలున్నాయి. గతంలో పాత దీపాల కారణంగా నెలకు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు విద్యుత్తు బిల్లు వచ్చేది. ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటుతో ఆ బిల్లు కాస్త రూ.4 లక్షలకు తగ్గింది. వైకాపా ప్రభుత్వం ఎల్‌ఈడీల నిర్వహణను పట్టించుకోకపోవడంతోపాటు సంబంధిత ఏజెన్సీకి నిర్ణీత మొత్తం చెల్లించకపోవడంతో ప్రజలకు అవస్థలు ప్రారంభమయ్యాయి. బిల్లులు ఇస్తేగానీ వీధి దీపాలు సరఫరా చేయమంటూ ఏజెన్సీ తెగేసి చెప్పింది. ఇప్పటికీ ఈఈఎస్‌ఎల్‌ కంపెనీకి సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. దేవీనగర్, పైకొట్టాలు, హనుమాన్‌నగర్, మహాయోగి లక్ష్మమ్మ నగర్‌ తదితర కాలనీల్లో ఎల్‌ఈడీ దీపాల అవసరం ఉంది. ఆలూరు వైపు వెళ్లే మార్గంలో కేవీఆర్, భీమిరెడ్డి నగర్, న్యూగాంధీ నగర్, అమరావతినగర్, విజయనగర కాలనీ, ప్రకాష్‌నగర్‌ ప్రాంతాల్లో నేటికీ దీపాలు లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. 


కర్నూలులో కష్టాలే..

ర్నూలు నగర పరిధిలో 52 వార్డులుండగా 24 వేలకుపైగా వీధి దీపాలున్నాయి. ఈఈఎస్‌ఎల్‌ కంపెనీ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. శివారు కాలనీలతో పాటు విలీన గ్రామాల్లో వీధి దీపాల సమస్య ఎక్కువగా ఉంది. నంద్యాల చెక్‌పోస్టు, పెద్దపాడు రహదారి, వీకర్‌ సెక్షన్‌ కాలనీ, శరీన్‌నగర్‌తోపాటు పలు కాలనీల్లో వీధి దీపాలు సరిగా వెలగడం లేదు. ఫలితంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. చాలా పురపాలక సంఘాల్లో వీధి దీపాల సమస్య తీవ్రంగా ఉన్నా పాలకులు దృష్టి సారించడం లేదు. 


నంద్యాలలో తప్పని అవస్థలు

నంద్యాలలో 42 వార్డులు ఉండగా.. 10 వేలకు పైగా ఎల్‌ఈడీలు ఉన్నాయి. వాటి నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. ఫలితంగా పలు ప్రాంతాల్లో దీపాలు వెలగడం లేదు. శ్రీనివాసనగర్, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండు, జగజ్జననీనగర్, దేవనగర్, పద్మావతినగర్, టెక్కె, రైల్వేస్టేషన్‌ తదితర ప్రాంతాల్లో దీపాలు వెలగక చీకట్లు కమ్ముకున్నాయి. శివారు కాలనీలైన రైతునగరం, వెంకటేశ్వరపురం, పొన్నాపురం తదితర కాలనీల్లో చాలాచోట్ల విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంకనూ రెండు వేల వరకు వీధి దీపాల అవసరముంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు