logo

రాయితీలోనూ కోతేశారు

ప్రసుత్తం తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అవసరమైన విత్తనాలు సమకూర్చాల్సి ఉంది.

Updated : 25 May 2024 06:15 IST

ఉమ్మడి జిల్లాకు 4,014 క్వింటాళ్ల పచ్చిరొట్ట కేటాయింపు
అందులోనూ భారీగా తగ్గింపు
న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

ప్రసుత్తం తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అవసరమైన విత్తనాలు సమకూర్చాల్సి ఉంది. భూసారం పెంచేలా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పచ్చిరొట్ట ఎరువులను రాయితీపై అందించాల్సి ఉంది. ఇప్పటివరకు పంపిణీ చేసేలా అధికారులు సన్నద్ధమవ్వలేదు. మరోవైపు కేటాయింపుల్లోనూ కోతలు విధించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో సాధారణ సాగు 4.19 లక్షలు, నంద్యాల జిల్లాలో 2.38 లక్షల హెక్టార్లుగా ఉంది. రైతులకు జీలుగ, పిల్లి పెసర విత్తనాలు 50 శాతం రాయితీపై పంపిణీకి చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాకు 222 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 3,792 క్వింటాళ్లు కలిపి ఉమ్మడి జిల్లాకు 4,014 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు కేటాయించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ఉత్తర్వులు పంపింది. 

ఉమ్మడి జిల్లాకు...

కర్నూలు జిల్లాలో 31.50 క్వింటాళ్ల జీలుగ, 3.40 క్వింటాళ్ల పిల్లిపెసర విత్తనాలు, నంద్యాల జిల్లాలో పిల్లిపెసర 6.48 క్వింటాళ్లు, జనుము 1.90, జీలుగ 2,565.70 క్వింటాళ్లు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,617.36 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి ఉమ్మడి జిల్లాకు రాష్ట్ర వ్యవసాయశాఖ 4,014 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు కేటాయించగా అందులో 1,396.64 క్వింటాళ్ల మేర జిల్లా వ్యవసాయశాఖ అధికారులు కోత విధించడం గమనార్హం. 

జీలుగ విత్తనాలు కిలో ధర రూ.88 ఉండగా రాయితీపోనూ రూ.44, పిల్లి పెసర కిలో ధర రూ.134 ఉండగా రాయితీ పోను రైతులు రూ.67 చెల్లించాల్సి ఉంటుంది.

సన్నద్ధత కరవు

ఉమ్మడి జిల్లాలో మే నెలలో సాధారణం కంటే వంద శాతం అధికంగా వర్షాలు కురిశాయి. వారంరోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంకానుంది. ఈ అదునులో జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలు పంపిణీ చేయాల్సి ఉండగా అధికారులు నేటికీ ప్రారంభించలేదు. కర్నూలు జిల్లాలో ఎక్కువగా పత్తి, మిరప, వరి పంటలు సాగవుతాయి. ఖరీఫ్‌ సీజన్‌లో ముందుగా రైతులు తమ పొలాల్లో పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేస్తారు. ఆ పంటను తిరిగి దున్నితే నేల స్వభావం పెరిగి దిగుబడులు బాగుంటాయి. కానీ ఖరీఫ్‌పై వ్యవసాయశాఖ అధికారుల్లో సన్నద్ధత కొరవడింది. పంపిణీ చేసే విత్తనాలు అరకొరగా కేటాయించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

తప్పని అదనపు భారం 

ప్రభుత్వం ఏటా వ్యవసాయశాఖ ద్వారా ఖరీఫ్‌ సీజన్‌లో జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలను 50 శాతం రాయితీపై రైతులకు పంపిణీ చేస్తుంది. ప్రసుత్తం పరిశీలిస్తే ఉమ్మడి జిల్లాలో 26 మండలాలకు పచ్చిరొట్ట విత్తనాలు క్వింటా కూడా కేటాయించలేదు. తమకు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేయాలని ఆయా మండలాల్లో అన్నదాతలు విన్నవిస్తున్నా వ్యవసాయాధికారులు విత్తనాల ఊసే ఎత్తడం లేదు. బయట మార్కెట్‌లో పిల్లిపెసర క్వింటా రూ.13,400 ధర ఉంది. రైతులు బయట కొనుగోలు చేసి భూసారం పెంచుకోవాలంటే అదనపు భారం తప్పదు. ఈ నేపథ్యంలో అన్నదాతలకు అవసరమైన మేర విత్తనాలు అందించాల్సి ఉంది.

అన్నదాతల ఆగ్రహం

కర్నూలు జిల్లాలో 26 మండలాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి. ఖరీఫ్‌ సాధారణ సాగు 4.20 లక్షల హెక్టార్లుగా ఉంది. జిల్లాలో ఐదు మండలాల్లో 31.5 క్వింటాళ్ల జీలుగ, 3.4 క్వింటాళ్ల పిల్లిపెసర అవసరమని మండల వ్యవసాయాధికారులు ప్రతిపాదనలు పంపగా 18 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 1.36 క్వింటాళ్ల పిల్లిపెసర విత్తనాలు కేటాయించారు. జనుము ఒక్క కిలో కూడా మంజూరుకాకపోవడం గమనార్హం. పచ్చిరొట్ట ఎరువులు అరకొరగా కేటాయింపులు చేయడంపై  అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మమ అనిపించేశారు..

నంద్యాల జిల్లాలో 29 మండలాలు ఉండగా అందులో 24 ప్రాంతాలకు 3,683.62 క్వింటాళ్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. 2,565.70 క్వింటాళ్ల జీలుగ, నాలుగు మండలాలకు 15.50 క్వింటాళ్ల పిల్లిపెసర అవసరమని పేర్కొనగా కేవలం 6.48 క్వింటాళ్లు, సంజామల మండలానికి 4.00 క్వింటాళ్ల జనుము అవసరమని ప్రతిపాదనలు పంపగా 1.90 క్వింటాళ్లు మాత్రమే కేటాయించారు. నంద్యాలకు నాలుగు క్వింటాళ్ల పిల్లిపెసర అవసరమని ప్రతిపాదనలు పంపితే ఒక రైతుకు 40 కిలోలు, మహానందిలో 2.50 క్వింటాళ్ల పిల్లిపెసర అవసరమని ప్రతిపాదనలు పంపితే ఒకే ఒక్క రైతుకు 40 కేజీలు కేటాయించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని