logo

భూ మార్పిడి.. కాసుల ముడి

భూ మార్పిడి (ల్యాండ్‌ కన్వర్షన్‌) దస్త్రం ముందుకు కదలక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

Published : 25 May 2024 03:17 IST

పెండింగ్‌లో వేల దరఖాస్తులు
కార్యాలయం చుట్టూ బాధితుల ప్రదక్షిణలు
న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

భూ మార్పిడి (ల్యాండ్‌ కన్వర్షన్‌) దస్త్రం ముందుకు కదలక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అర్జీదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అనుమతులు రావడం లేదు. నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాల్సిన దరఖాస్తులు నెలలపాటు కార్యాలయాల్లోనే మగ్గుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయ గోదాముల నిర్మాణం, పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు తదితర వాటి కోసం భూమి మార్పిడికి దరఖాస్తులు చేస్తున్నారు. భూ బదిలీకి మార్కెట్‌ విలువ ఆధారంగా కొంత శాతం రుసుము చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విలువ ప్రకారం పట్టణాలు, గ్రామాల్లో భూముల విలువలో ఐదు శాతం రుసుముగా చెల్లించి భూ మార్పిడికి దరఖాస్తు చేసుకోవాలి. ఆర్డీవో కార్యాలయానికి దరఖాస్తులు వచ్చిన తర్వాత క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అధికారులు నివేదిక ఇస్తారు. దీని ప్రకారం ఆర్డీవో అంగీకరిస్తే నిబంధనలకు అనుగుణంగా వ్యవసాయేతర భూములుగా మారుస్తారు.  నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయి. బాధితులు అధికారులకు విన్నవిస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. దస్త్రాలు కదలకపోవడంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. 

కొర్రీలు పెట్టి.. పక్కకు నెట్టి

భూమార్పిడి కోసం నేరుగా రెవెన్యూ కార్యాలయాలను సంప్రదిస్తుంటే వివిధ కొర్రీలతో దరఖాస్తులను పెండింగ్‌లో పెడుతున్నారు. నిబంధనల మేరకు భూమార్పిడి ప్రక్రియ నెల రోజుల్లో పూర్తి కావాలి. కొంతమంది రెవెన్యూ సిబ్బందికి డబ్బులు ఇవ్వకపోతే దస్త్రాలు ముందుకు కదిలించడం లేదు. సర్దుబాట్లు బాగా జరిగితే 15 రోజుల్లోనే కొంత మేర మార్పిడి జరుగుతోంది. నంద్యాల మండల పరిధిలో కొన్ని దస్త్రాలు ఆర్డీవో కార్యాలయంలో 10 రోజుల్లోనే ‘ఓకే’ కాగా.. మరికొన్ని మాత్రం నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. కుటుంబ వారసత్వ ధ్రువపత్రం లేదని, ఆన్‌లైన్‌లో కుటుంబ సభ్యుల పేర్లు లేవని, భూమి సబ్‌ డివిజన్‌ కాలేదని, దరఖాస్తులు అసంపూర్తిగా ఉంటున్నాయని చెబుతూ పక్కన పెడుతున్నారు.  

ఎన్నికల బూచి. వాయిదాల పేచీ

ఈ ఏడాది మార్చిలో ఎన్నికల ప్రకటన వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని పలు రెవెన్యూ కార్యాలయాల్లో గతేడాది నవంబరు నుంచే సార్వత్రిక ఎన్నికల పేరుతో భూమార్పిడి దస్త్రాలను పక్కన పెట్టారు. జిల్లా కేంద్రం నంద్యాలలో తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాధికారులను ప్రసన్నం చేసుకున్నవారికి మాత్రమే భూమార్పిడి పత్రాలు అందాయి. మిగతావారికి మాత్రం ఏడు నెలలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. ఆత్మకూరు, పాణ్య,ం ఆళ్లగడ్డ, డోన్, బేతంచెర్ల, బనగానపల్లి, కోవెలకుంట్ల మండలాలతోపాటు కర్నూలు జిల్లాలో జిల్లా కేంద్రమైన కర్నూలు, కల్లూరు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం మండలాల్లో పెద్దఎత్తున దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని