logo

అంగన్‌వాడీ.. చదువులు చతికిలబడి

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏటా చిన్నారుల చేరిక తగ్గుతోంది. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంతో పాటు 3-6 ఏళ్ల వయసున్న చిన్నారులకు విద్యాబోధన అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వీటిని ఏర్పాటు చేశారు.

Published : 27 May 2024 03:04 IST

కేంద్రాలకు ఏటా తగ్గుతున్న ఆదరణ

రైతునగరం (నంద్యాల), నందికొట్కూరు, న్యూస్‌టుడే : అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏటా చిన్నారుల చేరిక తగ్గుతోంది. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంతో పాటు 3-6 ఏళ్ల వయసున్న చిన్నారులకు విద్యాబోధన అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వీటిని ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా వీటిలో చిన్నారుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. చివరికి ఇవి పౌష్టికాహార పంపిణీ కేంద్రాలుగానే మిగిలిపోతున్నాయి. 

ఆసక్తి చూపని తల్లిదండ్రులు

అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీప్రైమరీ పాఠశాలలుగా తీర్చిదిద్దామని.. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా చెబుతోంది. వాస్తవంగా పరిశీలిస్తే తల్లిదండ్రులు పౌష్టికాహారం తీసుకుంటున్నారే తప్ప తమ పిల్లలను వీటిలో చేర్పించేందుకు ఆసక్తి చూపడంలేదు. అంగన్‌వాడీల్లో విద్యాబోధన అంతంతమాత్రంగా ఉంటోందని వారు పేర్కొంటున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధించేలా కార్యకర్తలకు గతంలో శిక్షణ తరగతులు నిర్వహించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక టేక్‌ హోం రేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టి సరకుల పంపిణీ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వంటి అదనపు పనులు అప్పగించింది. కార్యకర్తలు ఈ పనులన్నీ చేస్తూనే 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు విద్యాబోధన చేయాల్సి వస్తోందని.. ఫలితంగా బోధనపై అంత శ్రద్ధ పెట్టడం లేదని పిల్లల తలిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

వేసవి సెలవుల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సదుపాయాలు, విద్యా బోధనపై అధికారులు, కార్యకర్తలు, ఆయాలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసేవారు. మీ పిల్లల బాధ్యత మాదంటూ తల్లిదండ్రులను ఒప్పించి కేంద్రాల్లో చేర్చుకునేవారు. ఇటీవల కాలంలో ప్రచారం మరిచిపోయారు. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఇదీ ఓ కారణమని ప్రజలు పేర్కొంటున్నారు.


జిల్లాలో ఇలా..

  • నంద్యాల జిల్లాలోని 6 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,663 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 1,620 ప్రధాన, 43 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 2022-23లో 39,462 మంది ఉండేవారు. 2023-24 విద్యా సంవత్సరంలో 37,076 వేల మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. 
  • నంద్యాల అర్బన్‌ ప్రాజెక్టు పరిధిలో 295 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 2022-23 విద్యా సంవత్సరంతో 7,746 మంది ఉండేవారు. 2023-24లో 926 మంది తగ్గడం గమనార్హం. 

1 నుంచి అంగన్‌వాడీ బాట

- నిర్మల, ఐసీడీఎస్‌ పీడీ, నంద్యాల

అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా జూన్‌ 1 నుంచి అంగన్‌వాడీ బాట కార్యక్రమం చేపట్టనున్నాం. పది రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో కల్పిస్తున్న సదుపాయాలు, అందించే పౌష్టికాహారం,  నాణ్యమైన విద్య గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అంగన్‌వాడీల్లో  విద్యార్థులకు ఉచితంగానే నాణ్యమైన విద్య అందుతుందన్న  విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి పిల్లలను చేర్పించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని