logo

మన పులిపిల్లలు పెద్దవయ్యాయ్‌

గతేడాది మార్చిలో తల్లిపులి నుంచి తప్పిపోయిన పులి కూనలు తిరుపతి జంతు ప్రదర్శన కేంద్రంలో పెరిగి పెద్దవయ్యాయి. ప్రస్తుతం 15 నెలల వయసులో ఉన్న మూడు ఆడ పులులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

Updated : 27 May 2024 05:00 IST

15 నెలల వయసుకు చేరిన రుద్రమ్మ, అనంత, హరిణి

ఆత్మకూరు, న్యూస్‌టుడే : గతేడాది మార్చిలో తల్లిపులి నుంచి తప్పిపోయిన పులి కూనలు తిరుపతి జంతు ప్రదర్శన కేంద్రంలో పెరిగి పెద్దవయ్యాయి. ప్రస్తుతం 15 నెలల వయసులో ఉన్న మూడు ఆడ పులులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. 2023 మార్చి నెల మొదటి వారంలో కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం సమీప అటవీ ప్రాంతంలో నాలుగు పులి కూనలు దొరికిన విషయం తెలిసిందే. తల్లి నుంచి దూరమైన పులికూనలు ఎలా పెరుగుతాయన్నది అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. గతేడాది మార్చి 7న నాలుగు పులి కూనలను బైర్లూటి వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహించి అక్కడి నుంచి తిరుపతి శ్రీ వెంకటేశ్వర జులాజికల్‌ పార్క్‌కు తరలించారు.

అక్కడ జూ అధికారులు వాటిని సంరక్షించారు. నాలుగింటిలో ఒకటి మృతి చెందగా మూడు ఆరోగ్యంగా పెరిగాయి. వాటికి రుద్రమ్మ, అనంత, హరిణి అని పేర్లు పెట్టారు. ప్రస్తుతం ఒక్కో పులి 70 కిలోలకుపైగా బరువు పెరిగాయి. వాటికి రెండేళ్ల వయసు వచ్చే వరకు తిరుపతి జూలోనే సంరక్షిస్తారు. పులి పిల్లలను ఆరు నెలల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ఏడాది పాటు దత్తత తీసుకుంది. వాటి ఆహారం, ఆరోగ్య పర్యవేక్షణ, వైద్య ఖర్చులకు రూ.12 లక్షలు చెల్లించింది. వాటికి రెండేళ్ల వయసు దాటాక అవి దొరికిన అటవీ ప్రాంతంలోనే వదిలి వేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని