logo

చెదిరిన పర్యాటక కల

పర్యాటక శాఖ నిర్లక్ష్యం అవుకు జలవిహార కేంద్రానికి శాపంగా పరిణమించింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతినివ్వాల్సి ఉండగా అవేమీ కానరావడం లేదు. జలవిహార కేంద్రం ఎందుకూ పనికిరాకుండా పోయింది.

Published : 27 May 2024 03:12 IST

న్యూస్‌టుడే, అవుకు

పర్యాటక శాఖ నిర్లక్ష్యం అవుకు జలవిహార కేంద్రానికి శాపంగా పరిణమించింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతినివ్వాల్సి ఉండగా అవేమీ కానరావడం లేదు. జలవిహార కేంద్రం ఎందుకూ పనికిరాకుండా పోయింది. రూ.కోట్లు ఖర్చుచేసి నిర్మించిన భవనం నిరుపయోగంగా మారగా, విలువైన బోట్లు తుప్పుపట్టి పనికి రాకుండా పోయాయి. ప్రభుత్వ ఖజానాకు కూడా గండి పడింది.

వుకు జలాశయంలో బోటు షికారు, సీమవాసులకు జల విహారం అనుభూతిని కల్పించడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు రాబడి సమకూరుతుందనే లక్ష్యంతో ఏడేళ్ల కిందట అవుకు జలవిహార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన టెండర్ల ప్రక్రియలో ప్రైవేటు సంస్థ నిర్వహణా బాధ్యతలు చేపట్టింది. ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన జలవిహార కేంద్రానికి తొలి నుంచి సమస్యలు వెంటాడుతున్నాయి. 2017లో ప్రారంభమైన కేంద్రం బాలారిష్టాలతో అపసోపాలు పడుతోంది. 2019లో కొవిడ్‌ ప్రభావంతో దాదాపు రెండేళ్లపాటు దీన్ని ఏకంగా మూసేశారు.  లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఈ కేంద్రం అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. పర్యాటకులకు ఎటువంటి అనుభూతిని కల్పించలేక దూరమవుతోంది.

అసలుకే ఎసరు 

జలవిహార కేంద్రంలో 2022లో జరిగిన ప్రమాదం వల్ల దీన్ని ఏకంగా మూసేశారు. పర్యాటకులతో వెళ్తున్న బోటు బోల్తాపడిన ఘటనలో ముగ్గురు చనిపోగా...ఆరుగురు అప్పట్లో గాయపడ్డారు. ప్రమాదం అనంతరం చర్యలు చేపట్టిన అధికారులు నిర్వాహకులను బాధ్యుల్ని చేస్తూ కేసు నమోదు చేశారు. ఏకంగా కేంద్రాన్ని మూసేశారు.

ఏడాది గడిచినా 

మూతపడిన కేంద్రాన్ని తెరిపించేందుకు అధికారులు చేపట్టిన చర్యలు ఫలించలేదు. కొత్త గుత్తేదారు ద్వారా ఈ కేంద్రాన్ని ప్రారంభించడానికి వీలుగా 2023 నవంబరులో టెండర్లు పిలిచారు. పాత గుత్తేదారుకు నిర్వహణ కాలపరిమితి ఉండటంతో న్యాయస్థానం ద్వారా ఆయన నిలుపుదల ఉత్తర్వులు తెచ్చారు. దీంతో కేంద్రం ప్రారంభం వ్యవహారం మరోసారి ఆగిపోయింది.  గతంలో సగటున రోజుకు వంద మంది పర్యాటకులు జలవిహారం చేసేవారు. ప్రస్తుతం ఆ అవకాశం లేకపోయిందని అంతా ఆందోళన చెందుతున్నారు.

తుప్పు పట్టిన బోట్లు..

దాదాపు రూ.60 లక్షలతో సమకూర్చిన బోట్లు పనికిరాకుండా పోతున్నాయి. తుప్పుపడుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో విలువైన భవనం పాడవుతోంది. పిల్లలు ఆడుకునే పరికరాలు కళావిహీనంగా మారాయి. జలవిహార కేంద్రం ఆధారంగా ఉపాధి పొందుతున్న దాదాపు 30 మంది ఉపాధికి దూరమయ్యారు.


అందనంత దూరంలో..

వానాకాలంలో ఎత్తైన కొండలపై నుంచి జాలువారే జలపాతాలు స్థానికులకు కనువిందు చేస్తాయి. జలాశయంలో బోట్లు ద్వారా ఎందరో పర్యాటకులు జలపాతాల దగ్గరికి వెళ్లి ఎంతో అనుభూతిని పొందేవారు. ప్రస్తుతం బోట్లు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ పర్యాటక కళ తప్పుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని