logo

అమృత్‌ను మింగేశారు

లక్షలాది మందికి స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు వీలుగా తలపెట్టిన అమృత్‌ ఫేజ్‌-1 పనుల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి.

Published : 27 May 2024 03:15 IST

పనులు చేయకనే బిల్లుల చెల్లింపు
రూ.69.32 లక్షల రికవరీకి తాత్సారం

ఈనాడు, కర్నూలు: లక్షలాది మందికి స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు వీలుగా తలపెట్టిన అమృత్‌ ఫేజ్‌-1 పనుల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. నిధులన్నీ పక్కదారి పట్టాయి. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కర్నూలు నగరంతోపాటు పాణ్యం నియోజకవర్గ పరిధిలోని పలు వార్డుల్లో అధునాతన పైపులైను వ్యవస్థ ఏర్పాటుకు వీలుగా ‘అమృత్‌’ పథకం కింద 2017లో పనులు ప్రారంభించారు. రూ.57.35 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. తుది బిల్లులు చెల్లించేముందు టెండరు నిబంధనల ప్రకారం ఆయా పనులన్నింటినీ గుత్తేదారు పూర్తి చేశారా? లేదా? అనే విషయాలను అధికారులు పరిశీలించాలి. ఏమాత్రం నిర్ధారించుకోకుండానే గుత్తేదారుకు అధికారులు బిల్లులు చెల్లించేశారు. నాణ్యతా ప్రమాణాల ప్రకారం పనులు చేయలేదన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేసి పనులను పరిశీలించి అక్రమాలను నిర్ధారించారు. గుత్తేదారు నుంచి రూ.69.32 లక్షలు రికవరీ చేయాలని సిఫార్సు చేశారు. ఒకటిన్నర సంవత్సరం గడిచినా నేటికీ ఆ మొత్తాన్ని రికవరీ చేయకపోవడం గమనార్హం. 

పూర్తిస్థాయిలో విచారణ జరిగితే..

టెండరు నిబంధనల ప్రకారం గుత్తేదారు మొత్తం 403 కి.మీ.ల దూరం పాటు హెచ్‌.డి.పి.ఇ. పైపులైను వేయాల్సి ఉండగా 389 కి.మీ. మాత్రమే వేశారని.. 14 కి.మీ.లు అసలు పైపులైను వేయలేదని అధికారుల ప్రాథమిక పరిశీలనలో తేలింది. 15,367 మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా... 11,248 కనెక్షన్లు మాత్రమే ఇచ్చినట్లు తేల్చారు. పనులు పూర్తిచేసే కాల వ్యవధిని మూడుసార్లు పొడిగించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఒప్పందం మేరకు పనులు చేయకపోతే ఆ మేరకు చెల్లించాల్సిన బిల్లుల్లో కోత పెట్టాలి. కోత పెట్టకుండా గుత్తేదారుపై అధికారులు అంతులేని కరుణ ఎందుకు చూపారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మంచినీటి సామర్థ్యం లేకపోవడంతో ఆయా పనులు చేయలేదని గుత్తేదారుకు అనుకూలంగా అధికారులు మాట్లాడుతుండటం గమనార్హం. మంచినీటి సామర్థ్యం లేని కారణంగా పనులు చేసే పరిస్థితి లేనప్పుడు... వాటిని పూర్తి చేయాలంటూ టెండర్లలో ఎందుకు చూపారన్న ప్రశ్నకు అధికారుల దగ్గర సమాధానం లేదు. 


కౌన్సిల్‌  సమావేశంలో చర్చ

కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలోనే ఓ కార్పొరేటర్‌ ఆయా అమృత్‌ పనుల్లో రూ.8 కోట్లు దుర్వినియోగమైనట్లు ఆరోపించారు. టెండరు నిబంధనలు, డి.పి.ఆర్‌., అధికారులకు సమర్పించిన డిజైన్లు, డ్రాయింగ్‌లకు విరుద్ధంగా పనులు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా నగరపాలక సంస్థ అధికారులు సమగ్ర విచారణ చేయకుండా తాత్సారం చేస్తుండటం గమనార్హం.


మమ అనిపించారు

  • పాతబస్తీ ప్రాంతంలోని పలు వీధుల్లో మంచినీటి పైపులైన్లు కాలువల మధ్యలో వెళ్తున్నాయి. ఆయా పైపులైన్లలో కలుషిత నీరు చేరితే ప్రజలకు ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉంది. అలాంటి అత్యవసర ప్రాంతాల్లో పైపులైన్లు వేయకుండా వదిలేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
  • అమృత్‌ ఫేజ్‌-1 పనులను హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ హ్యూమ్‌ పైప్స్‌ కంపెనీ అధికారికంగా దక్కించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఆయా పైపులైను నిర్మాణ పనుల్లో ఏమాత్రం అనుభవం లేనివారు క్షేత్రస్థాయిలో పనులు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని