logo

ఇంటర్‌ విద్య.. వసతులు మిథ్య

ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కనీస సదుపాయాలు కానరావడం లేదు. నాడు-నేడు కింద విద్యాలయాల రూపురేఖలు మారుస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వానంగా ఉంది.

Updated : 27 May 2024 04:55 IST

తీవ్రంగా వేధిస్తున్న గదుల సమస్య
అధ్యాపకుల కొరతతో ఇబ్బందులు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కనీస సదుపాయాలు కానరావడం లేదు. నాడు-నేడు కింద విద్యాలయాల రూపురేఖలు మారుస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వానంగా ఉంది. పలు ప్రాంతాల్లో పక్కా భవనాలు కరవయ్యాయి. 

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 44 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఆదర్శ, ఎయిడెడ్, కేజీబీవీ తదితరాలు కలిపి మరో 119 వరకు ఉన్నాయి. అరకొర సదుపాయాల నడుమే ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. చాలా విద్యాలయాల్లో గదుల కొరత ఉంది. నాడు-నేడు కింద చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. కొన్ని కళాశాలల్లో ప్రయోగశాలలు లేవు. కేజీబీవీల్లో ఏళ్లుగా అధ్యాపకుల కొరత వేధిస్తున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. 

ఒక్క పైసా ఇస్తే ఒట్టు

ఉమ్మడి జిల్లాలో నాడు-నేడు రెండో విడత పనుల్లో భాగంగా కర్నూలు, నంద్యాల జిల్లాలోని 23 జూనియర్‌ కళాశాలలను ఎంపిక చేశారు. రెండేళ్ల కిందటే ఎంపిక జరిగినా ఇంతవరకు ఒక్క కళాశాలలో కూడా పనులు ప్రారంభం కాలేదు. అదనపు తరగతి గదుల నిర్మాణం, ఫర్నిచర్, మరుగుదొడ్లు, ప్రయోగశాలలు తదితర పనులకు రూ.176 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఇంతవరకు పైసా నిధులు విడుదల కాలేదు. 

కేజీబీవీలదీ అదే పరిస్థితి

ఉమ్మడి జిల్లాలోని 53 కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో పూర్తిగా అతిథి అధ్యాపకులతోనే పాఠాలు బోధిస్తున్నారు. చిప్పగిరి, కౌతాళం, హాలహర్వి కేజీబీవీల్లో గతేడాది సున్నా ఫలితాలు వచ్చాయి. ఈ ఏడాదీ మెరుగుపడలేదు. ఇక్కడ చాలాచోట్ల ప్రయోగశాలలు సరిగ్గా లేవు. అవసరమైన బోధన సిబ్బంది లేకపోవడంతో ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు.

నిర్మాణాలు సాగక..

ఇది జిల్లా కేంద్రమైన నంద్యాలలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల. ఈ విద్యాలయంలో నూతన గదుల నిర్మాణానికి చేపట్టిన పనులు గత నాలుగేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. గదుల కొరత తీవ్రంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది నిర్మాణంలో ఉన్న గదుల్లోనే తరగతులు నిర్వహించారు. ఇక్కడ మొత్తం ఆరు గదుల అవసరం ఉంది. గదులు లేకపోవడంతో గత పదేళ్లుగా రెండు గదుల రేకుల షెడ్డులోనే విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తున్నారు.


పలు ప్రాంతాల్లో ఇలా..

  • బండి ఆత్మకూరులోని జూనియర్‌ కళాశాల శిథిలావస్థకు చేరింది. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు గదులు లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. 
  • శిరివెళ్ల మండలం యర్రగుంట్ల కళాశాల కూలిపోయే దశలో ఉంది. ఇక్కడ సరైన ప్రయోగశాలలు అందుబాటులో లేవు. అధికారులు దృష్టి సారించని పరిస్థితి.
  • కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని గూడూరు జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు తరగతి గదులతోపాటు వసతులు కానరావడం లేదు. 
  • ఆత్మకూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాలలు రెండు ఒకే ఆవరణలో నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని