logo

సేవలకు మసక

రాయలసీమలోనే పేరొందిన కర్నూలు ప్రాంతీయ కంటి వైద్యశాల ఆదరణకు నోచుకోవడం లేదు. పాలకులు పట్టించుకోకపోవడం.. విలువైన పరికరాలు మూలన పడటంతో సేవలు అధ్వానంగా మారాయి.

Published : 27 May 2024 03:19 IST

ప్రాంతీయ కంటి ఆస్పత్రిపై పర్యవేక్షణ కరవు

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : రాయలసీమలోనే పేరొందిన కర్నూలు ప్రాంతీయ కంటి వైద్యశాల ఆదరణకు నోచుకోవడం లేదు. పాలకులు పట్టించుకోకపోవడం.. విలువైన పరికరాలు మూలన పడటంతో సేవలు అధ్వానంగా మారాయి.  

కర్నూలు నగరంలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రికి రాయలసీమ జిల్లాల నుంచేకాక తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి బాధితులు చికిత్స నిమిత్తం వస్తుంటారు. వైద్యాలయంలో ప్రతిరోజూ ఓపీ 250 నుంచి 300 వరకు ఉంటుంది. వీరిలో కనీసం 20 నుంచి 30 మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతుంటారు. ప్రతి నెలా 6 వేల నుంచి 7 వేల వరకు ఓపీ ఉంటుంది. 250 వరకు శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. 

ఆసుపత్రి పర్యవేక్షకుడిగా పృథ్వీ వెంకటేశ్వర్లు 9 నెలల కిందట పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్నారు. ఈ వైద్యాలయంలో నలుగురు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్లు, 12 మంది అసిస్టెంట్లు ఉన్నారు. అదనంగా 12 పీజీ సీట్లు ఉన్నాయి. నిత్యం 20 నుంచి 30 వరకు శస్త్రచికిత్సలు చేసేందుకు అవసరమైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఆ స్థాయిలో   శస్త్రచికిత్సలు చేయడం లేదు.  

పర్యవేక్షణ కరవవడం.. సేవలు మొక్కుబడిగా అందుతుండటంతో చాలామంది రోగులు   ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు.  


చేతులెత్తేసిన సైరెక్స్‌

కంటి ఆసుపత్రిలో ఓసీటీ, విజివల్‌ ఫీల్డ్, ప్యాకో తదితర ఆధునిక యంత్రాలు పనిచేయడం లేదు. వీటి నిర్వహణ బాధ్యతలను సైరెక్స్‌ సంస్థకు అప్పగించారు. ఏడాది దాటినా పట్టించుకోకపోవడం గమనార్హం. దీనికితోడు జనరేటర్‌ లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. 

అంధత్వ నివారణ సంస్థ సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ సంస్థ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో వృద్ధులకు ప్రాథమిక కంటి వైద్య పరీక్షలు చేసి అవసరమైనవారిని ఆస్పత్రికి తీసుకొచ్చి శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. వారు నామమాత్రంగా.. ఇద్దరు, ముగ్గురిని తీసుకొచ్చి మమ అనిపించేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 


వైకాపా హయాంలో అభివృద్ధి శూన్యం

గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రాంతీయ కంటి ఆస్పత్రిలోని సూపర్‌ స్పెషాలిటీ విభాగానికి ప్రత్యేకంగా రూ.5 కోట్లు కేటాయించారు. వివిధ విభాగాలను అభివృద్ధి చేయడంతోపాటు ఆధునిక యంత్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అభివృద్ధి అటకెక్కింది.

నల్లగుడ్డు మార్పిడికి అవకాశాలున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కర్నూలు సర్వజన వైద్యశాలలో నెలకు కనీసం 30 నుంచి 40 వరకు సేకరించిన నేత్రాలను హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రికి పంపుతున్నారు. ఇక్కడే మార్పిడి జరిగితే చాలామందికి కంటి చూపు ప్రసాదించే అవకాశముంది. గతంలో నగరంలోని ప్రాంతీయ కంటి ఆస్పత్రిని తనిఖీ చేసిన వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌  సెక్రటరీ కార్నియా శస్త్రచికిత్సలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం 

- డాక్టర్‌ వెంకటేశ్వర్లు, కంటి ఆసుపత్రి పర్యవేక్షకుడు 

కంటి ఆసుపత్రికి ప్రధానంగా ఓసీటీ మిషన్, విజివల్‌ ఫీల్డ్‌ మిషన్‌తోపాటు జనరేటర్‌ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఎన్నికల తర్వాత కంటి శస్త్రచికిత్సలు చేయించుకునేవారి సంఖ్య పెరిగింది. ఈనెలలో ఇప్పటివరకు సుమారు 300 వరకు శస్త్రచికిత్సలు చేశాం. మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని