logo

ఎరువుకేదీ భరోసా.. రైతులకు నిరాశ

గ్రామస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాం. ఖరీఫ్‌ సీజన్‌ రాగానే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తాం. వాటి కోసం వ్యయప్రయాసలు పడాల్సిన పనిలేదు. అన్నీ రైతు భరోసా కేంద్రాల్లోనే అందుబాటులో ఉంచుతున్నాం.

Published : 27 May 2024 03:23 IST

ఆర్బీకేల్లో అందుబాటులో లేని వైనం
అన్నదాతలకు తప్పని అవస్థలు

గ్రామస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాం. ఖరీఫ్‌ సీజన్‌ రాగానే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తాం. వాటి కోసం వ్యయప్రయాసలు పడాల్సిన పనిలేదు. అన్నీ రైతు భరోసా కేంద్రాల్లోనే అందుబాటులో ఉంచుతున్నాం. రైతుకు ఏం కావాలంటే దాన్ని తీసుకోవచ్చు. 

- పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి అన్న మాటలు..

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : మరో ఐదు రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంకానుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాల్సి ఉంది. ప్రసుత్తం ఆర్బీకేల్లో వేరుశనగకాయ విత్తనాలు పంపిణీ ప్రారంభించారు. ఇతర విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 877 రైతు భరోసా కేంద్రాలున్నాయి. అందులో సగానికి పైగా అద్దె భవనాలు, సచివాలయాల్లో నడుస్తున్నాయి. కొన్నిచోట్ల రెండు, మూడు గ్రామాలకొకటి చొప్పున ఆర్బీకేలు నిర్మించారు. వీటిల్లో ఏం కొనుగోలు చేయాలన్నా అద్దె ఆటోలో వెళ్లాల్సిన పరిస్థితి. ఆర్బీకే భవనాలు చిన్నవిగా ఉండటంతో ఎరువులు, విత్తనాలు నిల్వ ఉంచుకునే పరిస్థితి లేకుండా పోయింది. కొన్నిచోట్ల మాత్రమే ఆర్బీకేలకు అనుగుణంగా గోదాములు నిర్మించారు. 

సాగు లక్ష్యం ఘనం

కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని పంటలు కలిపి 4,19,219 హెక్టార్లు సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. నంద్యాల జిల్లాలో సాధారణ సాగు 2,38,130 హెక్టార్లుగా ఉంది.  50 శాతం ఆర్బీకేల్లో వేరుశనగ కాయల విత్తనాలు తప్ప కందులు, పెసలు, కొర్ర, వరి, పచ్చిరొట్ట ఎరువులు, డీఏపీ, యూరియా,  సూక్ష్మపోషక ఎరువులు.. ఇలా ఏ ఒక్కటీ అందుబాటులో లేవు. ఆర్బీకేల్లో విత్తనాలు తప్ప ఎరువులు నిల్వ చేసే పరిస్థితి లేదు. అద్దె గోదాముల్లో నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి. వీటికి అద్దెలు చెల్లించకపోవడంతో గతేడాది ఆర్బీకేలకు అద్దెకు ఇవ్వని ఘటనలు ఉన్నాయి. 

అధిక ధరలకు అమ్ముతున్నా..

పత్తి, మొక్కజొన్న, మిరప, వరి వంగడాలు, కంది, ఉల్లి, సజ్జలు, ఆముదాలు, సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఇతర విత్తనాలకు సంబంధించి ప్రైవేటు కంపెనీలతో ఏప్రిల్, మే నెలల్లోనే ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకోవాలి. ఆయా కంపెనీల నుంచి వివిధ రకాల విత్తనాలను ఏసీ సీడ్స్‌ ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతలకు అందుబాటులో ఉంచాలి. ఆ పరిస్థితి లేకపోవడంతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కోసం ప్రైవేటు డీలర్లపై ఆధారపడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. డీలర్లు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్ముతున్నా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవడం లేదు

విపణిలో కొనుగోలు చేయాల్సిందే

ఉమ్మడి జిల్లాలో 3.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని అంచనా. ఆర్బీకేల్లో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. 2023-24లో కర్నూలు జిల్లాలో 18,918, నంద్యాల జిల్లాలో 26,657 కలిపి మొత్తం ఉమ్మడి జిల్లాలో 45 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు మాత్రమే అమ్మారు. మిగిలిన వాటిని రైతులు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేశారు. మరో నాలుగు రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఆర్బీకేలకు ఎరువులు రాకపోవడంతో అన్నదాతలు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.

ప్రకటనలకే పరిమితం

899 రకాల పురుగు మందులను ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. గతేడాది నాలుగు రకాల ఎరువులను కూడా రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేయలేదు. ఆర్బీకేల నుంచి 10 శాతం మంది రైతులు కూడా పురుగు మందులు కొనుగోలు చేయలేదు. రసాయన పురుగు మందులు అరకొరగానే సరఫరా చేశారు. ఈ ఏడాది ఇప్పటికీ పురుగు మందులకు సంబంధించి లక్ష్యం కేటాయించలేదు. అసలు ఇస్తారా? ఇవ్వరా? అన్న విషయమై ఏపీ సీడ్స్‌ అధికారులకు కూడా ఎలాంటి ముందస్తు సమాచారం రాలేదంటున్నారు. 


కేటాయింపులు బాగానే ఉన్నా..

ర్బీకేలకు రసాయన ఎరువులు సరఫరా చేసే బాధ్యత ఏపీ మార్క్‌ఫెడ్‌కు అప్పగించారు. కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు యూరియా 54,432 టన్నులు, డీఏపీ 16,223 టన్నులు, ఎంవోపీ 1,485, కాంప్లెక్సు ఎరువులు 1,16,571 టన్నులు, ఎస్‌.ఎస్‌.పి 1,689 కలిపి మొత్తం 1,90,400 టన్నుల ఎరువులు కేటాయిస్తూ వ్యవసాయ శాఖ జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు సప్లై ప్లాన్‌ ఇచ్చింది. నంద్యాల జిల్లాకు 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు కేటాయించారు. కాగా ఎరువులకు సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి మార్క్‌ఫెడ్‌కు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ప్రస్తుతం ఆర్బీకేల్లో రాయితీ వేరుశనగ విత్తనాల పంపిణీ జరుగుతుండటంతో ఎరువులు సరఫరా చేసేందుకు 15  రోజుల నుంచి నెల రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. 
అరకొరగా పాత నిల్వలు
కర్నూలు జిల్లాలో 466 రైతు భరోసా కేంద్రాలుండగా 2023-24లో రెండు సీజన్లలో కలిపి 390 ఆర్బీకేల్లో ఎరువుల అమ్మకాలు జరిగాయి. 76 ఆర్బీకేల్లో ఒక్క బస్తా కూడా అమ్మలేదు. ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి 18,918 మెట్రిక్‌ టన్నుల అన్నిరకాల ఎరువులను మార్క్‌ఫెడ్‌ ఆర్బీకేలకు సరఫరా చేసింది. ప్రస్తుతం ఆర్బీకేల్లో యూరియా 600, కాంప్లెక్సు ఎరువులు 400 టన్నుల నిల్వలున్నాయి. మార్క్‌ఫెడ్‌ వద్ద డీఏపీ వెయ్యి, యూరియా 600, కాంప్లెక్సు వెయ్యి కలిపి మొత్తం 2,600 మెట్రిక్‌ టన్నుల ఎరువులు నిల్వలున్నాయని మార్క్‌ఫెడ్‌ అధికారులు చెబుతున్నారు.  
ః నంద్యాల జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ద్వారా ఆర్బీకేలకు సరఫరా చేసిన ఎరువుల్లో యూరియా 19,718, డీఏపీ 4,278, కాంప్లెక్సు ఎరువులు 2,575, ఎంవోపీ 86 కలిపి మొత్తం 26,657 మెట్రిక్‌ టన్నుల ఎరువుల విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం ఆర్బీకేల్లో డీఏపీ 579, యూరియా 494, కాంప్లెక్సు ఎరువులు 275 కలిపి మొత్తం 1,348 మెట్రిక్‌ టన్నుల నిల్వలు ఉన్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని