logo

నాడితప్పిన ఇంటింటి వైద్యం

వైద్యులు ఇంటింటికెళ్లడం లేదు. విద్యార్థులనూ కేంద్రం వద్దకే రప్పిస్తున్నారు. అన్ని ‘పరీక్ష’లు చేయడం లేదు. నాలుగు మాత్రలు చేతిలో పెట్టి మమ అనిపిస్తున్నారు.

Published : 09 Dec 2022 03:44 IST

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: వైద్యులు ఇంటింటికెళ్లడం లేదు. విద్యార్థులనూ కేంద్రం వద్దకే రప్పిస్తున్నారు. అన్ని ‘పరీక్ష’లు చేయడం లేదు. నాలుగు మాత్రలు చేతిలో పెట్టి మమ అనిపిస్తున్నారు. ప్రజల ఆరోగ్య బాధ్యతను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్‌ (కుటుంబ వైద్యుడు) పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిని గత నెల 21న ఉమ్మడి జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభించింది. ఆరోగ్య కేంద్రాల్లో అందే సేవలు నేరుగా గ్రామ స్థాయిలో అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటైన కార్యక్రమం మొక్కుబడి తంతుగా మారింది.

హెల్త్‌ వెల్‌నెస్‌ కేంద్రాలు : 841
ఎంఎల్‌హెచ్‌పీలు : 606
ఖాళీలు : 169
పీహెచ్‌సీలు : 87
104 వాహనాలు : 53

14 పరీక్షలు.. 69 రకాల ఔషధాలు

* ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహించే వైద్యుల్లో ఒకరు గ్రామాలకు వెళ్లాలి. నెలలో ఒక్కో కేంద్రాన్ని రెండుమార్లు సందర్శించాలి. ఓపీ చూసి రోగులకు అవసరమైన మందులను ఇవ్వాలి. తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉన్నవారిని మెరుగైన చికిత్సకు సిఫార్సు చేయాలి.
* మధ్యాహ్నం 12 గంటల నుంచి అంగన్‌వాడీ, పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ఆ తర్వాత వైద్యశాలకు రాలేక ఇంటి పట్టునే ఉన్న రోగుల వద్దకు  వెళ్లి వైద్యమందించాలి.
* 69 రకాల ఔషధాలు అందుబాటులో ఉండాలి. రోగ నిర్ధారణకు 14 రకాల వైద్య పరీక్షలను చేయాల్సి ఉంటుంది.
* ఏ గ్రామానికి వైద్యులు వెళ్తారో అక్కడ 104 వాహనం అందుబాటులో ఉండాలి. వైద్యులు రాని రోజు మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) వెల్‌నెస్‌ కేంద్రంలో ఉండి రోగులను పరీక్షించాలి.


జరుగుతున్న తీరు ఇది

రుద్రవరం మండలం కోటకొండలో సచివాలయంలోనే రక్త పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది

* కుటుంబ వైద్య ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) సిబ్బంది కొరత ఉంది. 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కొన్నిచోట్ల కేవలం 4 రకాల పరీక్షలే నిర్వహిస్తున్నారు. మరికొన్నిచోట్ల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పీహెచ్‌సీలకు పంపుతామంటున్నారు.
* వైద్యులు 104 వాహనంతోపాటు సచివాలయంలో ఉండి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల ఇంటింటికెళ్లడం లేదు. మధ్యాహ్నం వరకు ఉండి తిరుగుబాట పడుతున్నారు. రుద్రవరం మండలం కోటకొండలో గురువారం రోగులను ఇంటి వద్ద పరీక్షించుకుండా దండోరా వేయించి సచివాలయానికే రప్పించి పరీక్షించడం గమనార్హం. చాలా చోట్ల అంగన్‌వాడీ, పాఠశాలలకు వెళ్లడం లేదు.


పాఠశాల విద్యార్థులే శిబిరానికి వచ్చి..

వైద్య సేవలకు రైతు భరోసా కేంద్రానికి వచ్చిన పాఠశాల విద్యార్థినులు

డోన్‌ మండలం దేవరబండలో గురువారం నిర్వహించిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమంలో వైద్యాధికారులు పాఠశాల వద్దకు వెళ్లలేదు. ఎస్సీ కాలనీలోని రైతుభరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, 104 వాహనం వద్దకే విద్యార్థులు వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ చూసి మధ్యాహ్నం నుంచి పాఠశాల, అంగన్‌వాడీ తదితర ప్రాంతాలకు వెళ్లి వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మధ్యాహ్నం ఓబులాపురం గ్రామానికి వెళ్లటంతో పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి ఉందని స్థానికులు పేర్కొన్నారు.

న్యూస్‌టుడే, డోన్‌


మా ఇంటికి రాలేదు

మల్లేశ్వరమ్మ, దొడ్డిమేకల, పెద్దకడబూరు

రెండేళ్ల నుంచి దగ్గు, ఆయాసంతో బాధపడుతున్నా. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం వద్దకు నెలకోసారి 104 వాహనం వస్తుంది. అక్కడిదాకా వెళ్లి వైద్యం చేయించుకోవడం నా వల్ల కాదు. నడిచి వెళ్లాలంటే ఆయాసం పెరుగుతుంది. వాహనం వద్దకు వెళ్తే వైద్యం చేస్తారు. ఆశా కార్యకర్తలను మందులు అడిగితే లేవంటున్నారు.

న్యూస్‌టుడే, పెద్దకడబూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని