logo

స్మార్ట్‌ టౌన్‌షిప్‌లపై అధికార పెత్తనం

నగరాలు, పట్టణాల్లో మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ధరలకు ఇళ్ల పట్టాలు సమకూర్చే పథకం నేతలకు భరోసాగా మారింది. విలువైన ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతలు కన్నేసి వాటినే ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌’కు సిఫార్సులు చేస్తున్నారు. లే-అవుట్లు వేశాక మధ్య తరగతి పేరుతో దక్కించుకునేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి

Published : 07 Feb 2023 04:30 IST

ఎమ్మిగనూరు: బనవాసి క్షేత్రంలో యంత్రాలతో చదును చేస్తున్నారు ఇలా

ఈనాడు - కర్నూలు: నగరాలు, పట్టణాల్లో మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ధరలకు ఇళ్ల పట్టాలు సమకూర్చే పథకం నేతలకు భరోసాగా మారింది. విలువైన ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతలు కన్నేసి వాటినే ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌’కు సిఫార్సులు చేస్తున్నారు. లే-అవుట్లు వేశాక మధ్య తరగతి పేరుతో దక్కించుకునేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. మరికొందరు తమ భూములనే రైతుల ముసుగులో ప్రభుత్వానికిచ్చి భారీగా పరిహారం పొందేందుకు పావులు కదుపుతున్నారు. అనుకున్నట్లు ఆమోదముద్ర వేసుకోవడానికి అధికారంతో చక్రం తిప్పుతున్నారు. ఈ జాప్యాల నడుమ ఎంఐజీ-లేఅవుట్లు నిజమైన లబ్ధిదారులకు సకాలంలో అందక అందనిద్రాక్షగా మిగులుతున్నాయి.

నేతల భూములిచ్చేలా...

నంద్యాల జిల్లాలో లే-అవుట్లకు నేతల భూములే సేకరించేలా పావులు కదిపారు. గతేడాది ఓ నియోజకవర్గంలో 40 ఎకరాలు రైతుల నుంచి బినామీ పేర్లతో ముందే కొనుగోలు చేసి, ఆపై స్మార్ట్‌టౌన్‌షిప్‌లకు ఇచ్చేలా అడుగులు వేశారు. ఎకరాకు ఏకంగా రూ.1.20 కోట్ల పరిహారం చెల్లించాలంటూ ప్రతిపాదనలు చేసి ముందుకు కదిపే యత్నాలు చేశారు. ఈ విషయం వెలుగులోకి వచ్చాక విమర్శలు రావడంతో దీనిపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే ఇక్కడ మధ్యతరగతి వర్గాల్లో ఈ లే-అవుట్లపై ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కర్నూలు గ్రామీణ పరిధిలో నిడ్జూరులో టౌన్‌షిప్‌కు అడుగులు వేశారు. ఇక్కడ భూములకు పరిహారం భారీగా అడుగుతుండటంతో పక్కనబెట్టేసినట్లు సమాచారం.

బనవాసి క్షేత్రంలో 110 ఎకరాలు

ఎమ్మిగనూరు పరిధిలో బనవాసి క్షేత్రం భూములపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఇప్పటికే చేనేత క్లస్టర్‌కు కేటాయించిన 95 ఎకరాల్లో జగనన్న కాలనీలకు కేటాయించడంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే. తాజాగా జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పేరిట 110 ఎకరాలు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. ఆదోని-ఎమ్మిగనూరు రెండు మున్సిపాల్టీలకు సంబంధించి 13వేలకుపైగా ప్లాట్లు ఇచ్చేలా ప్రణాళికలు చేశారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు పది శాతం, విశ్రాంత ఉద్యోగులకు 5 శాతం, ఆదాయ పన్ను చెల్లించే మధ్యతరగతి వర్గాలకు మిగిలిన 75 శాతం ప్లాట్లు కేటాయించాల్సి ఉంటుంది. అరుదైన వనాలున్న బనవాసి భూములు ప్రధాన జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్నాయి. ఈ విలువైన భూములను మధ్యతరగతి పేరుతో నేతలు కొట్టేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి.

అడుగులు పడింది అక్కడే

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డలో 14.50 ఎకరాలు భూ సేకరణ చేశారు. బేతంచెర్ల సమీపంలో బుగ్గానిపల్లెలో 12.50 ఎకరాలు ఒక్కో ఎకరా రూ.53 లక్షలు చెల్లించి తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎమ్మిగనూరు బనవాసి వద్ద 110 ఎకరాలు కేటాయించారు. ఆత్మకూరు కరివేన ఎస్సార్బీసీ ఎదురుగా 32 ఎకరాలు రైతుల నుంచి సేకరించే పనిలో ఉన్నారు. 18 మంది రైతులకు సంబంధించిన ఈ భూమికి ఎకరా రూ.60 లక్షల పరిహారం డిమాండ్‌ చేస్తుండగా,  రూ.50 లక్షలు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నట్లు కొందరు రైతులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని