logo

నిర్వహణ చతికిలబడింది

సుద్దముక్కలకు రూ.2 వేలు, విద్యుత్తు బిల్లు రూ.8 వేలు, స్టేషనరీ రూ.2 వేలు ఇలా నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు పాఠశాల నిర్వహణకు ఖర్చు అవుతోంది

Published : 29 Nov 2023 05:32 IST

డోన్‌ పట్టణం, కర్నూలు విద్య, న్యూస్‌టుడే: ‘‘ సుద్దముక్కలకు రూ.2 వేలు, విద్యుత్తు బిల్లు రూ.8 వేలు, స్టేషనరీ రూ.2 వేలు ఇలా నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు పాఠశాల నిర్వహణకు ఖర్చు అవుతోంది. గతేడాది మంజూరైన నిధులు డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఈ ఏడాది ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు.. సొంతంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని 1,120 మంది విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆవేదన ఇది.!!

ఆరునెలలు దాటినా స్పందన లేదు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1,934, ప్రాథమికోన్నత 351, ఉన్నత 601 పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 4,65,735 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నిర్వహణకు సంబంధించి విద్యార్థుల సంఖ్య ఆధారంగా సమగ్ర శిక్ష నిధులు మంజూరు చేస్తుంది. 30 లోపు విద్యార్థులంటే రూ.10 వేలు, 30-100 మధ్య ఉంటే రూ.25 వేలు, 100-250 ఉంటే రూ.50 వేలు, 250-1000 మధ్య విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.75 వేలు పాఠశాలల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు దాటింది. నేటికీ పాఠశాల నిర్వహణ నిధులు ప్రభుత్వం ఇవ్వలేదు. బోధన సామగ్రి, విద్యుత్తు బిల్లులకు ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.


గతేడాది వెనక్కి తీసుకున్నారు

 గతేడాది ఐదు విడతలుగా ఇస్తామన్నారు. ఆగస్టులో రూ.2.33 కోట్లు విడుదల చేశారు. పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (పీఎఫ్‌ఎంఎస్‌)లో వేయడంతో కొందరు డ్రా చేసుకోగా, మరికొందరు చేసుకోలేకపోయారు. పీఎఫ్‌ఎంఎస్‌లో ఎంటర్‌ చేసుకుని డ్రా చేసుకోవాలంటే తీవ్ర జాప్యం అవుతోంది. 2023 ఫిబ్రవరిలో మరో 20 శాతం నిధులు మంజూరు చేయగా కర్నూలు జిల్లాలో రూ.1.27 కోట్లు, నంద్యాలలో రూ.86.85 లక్షలొచ్చాయి. ఇంకా రూ.7.77 కోట్లు రావాల్సి ఉంది. విడుదలైన నాలుగైదు రోజులకే వెనక్కి తీసుకున్నారు.


నాడు -  నేడుతో పెరిగిన ఖర్చులు

మన బడి నాడు-నేడు కింద అదనపు గదులు పూర్తైన పాఠశాలల్లో నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి. 100- 200 మంది విద్యార్థులున్న పాఠశాలలకు గతంలో నెలకు రూ.1,500- రూ.2 వేల వరకు ఖర్చయ్యేది... ప్రస్తుతం రూ.4 వేలకుపైగా ఖర్చవుతోందని ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. నాడు..నేడు అంటూ తరగతి గదుల్లో పంకాలు, స్మార్ట్‌ టీవీలు, ప్రొజెక్టర్లు, మరుగుదొడ్లకు నీటి సౌకర్యం, ఎఫ్‌టీ ప్యానళ్లు, ఆర్వో ప్లాంటు వంటి వాటికి విద్యుత్తు వినియోగం ఎక్కువైంది. గతంలో రూ.వందల్లో ఉన్న విద్యుత్తు బిల్లులు ఇప్పుడు రూ.వేలల్లో వస్తుండటంతో చెల్లించేందుకు హెచ్‌ఎంలు తంటాలు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు