logo

నామఫలకంపై ప్రచార రాత.. బిల్లు కోత

కేంద్రం పలు పథకాలకు ఇచ్చిన సొమ్ములను తామే ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది.. బొమ్మలు పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది

Updated : 29 Nov 2023 06:02 IST

 వైఎస్సార్‌ పేరు ఉంటే బిల్లుకు గండం

 పీఎంఏవై కనిపించేలా దిద్దుబాటు

 

ఇంటికి ఇలా పీఎంఏవై పేరుతో నామఫలకం ఏర్పాటు చేసుకుంటేనే బిల్లు మంజూరవుతుంది

కేంద్రం పలు పథకాలకు ఇచ్చిన సొమ్ములను తామే ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది.. బొమ్మలు పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రాయోజిత పథకాలపై రాష్ట్ర ప్రభుత్వ ముద్ర, జగనన్న, వైఎస్సార్‌ పేర్లు ఉంటే నిధులు ఆపేస్తామని కేంద్రం హెచ్చరించింది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇప్పటికే అతికించిన బోర్డుల్లో వైఎస్సార్‌ పేరు, రాష్ట్ర ప్రభుత్వ లోగో కనిపించకుండా స్టిక్కర్లు వేస్తూ దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. పీఎంఏవై బోర్డు కనిపించేలా చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లా అధికారుల్లో కలవరం

కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది. దీనిపై దిల్లీకి సమాచారం అందడం.. వారు తనిఖీలకు వస్తుండటంతో జిల్లా అధికారుల్లో కలవరం మొదలైంది. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎప్పుడు జిల్లాలో పర్యటిస్తారో.. ఏ ఇళ్ల వద్దకు వచ్చి ఏమి అడుగుతారో అని గృహ నిర్మాణ సంస్థ అధికారులు, ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు.

కేంద్రం రూ. 1,010 కోట్ల చెల్లింపులు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై-అర్బన్‌) పథకం, పీఎంఏవై (గ్రామీణ్‌) పథకం కింద 1,13,024 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వీటిలో ఇప్పటి వరకు 40,757 గృహ నిర్మాణాలు పూర్తి అయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే పీఎంఏవై గ్రామీణ ఇళ్ల నిర్మాణాలకు నిధులిస్తోంది. ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు మంజూరు చేస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు ఇస్తే.. మరో రూ.30 వేలు నరేగా ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి అందిస్తున్నారు. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో కేంద్రం రూ.1,010 కోట్లు జమ చేసింది. ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.35 వేలను బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తోంది. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం పేరుతో వీటన్నింటినీ తామే నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటోంది.

ప్రతీ పథకానికి రంగులద్దారు

  • వైకాపా ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ప్రతి పథకానికి రంగులద్దారు. రూ.కోట్లు ఖర్చు చేసి కరపత్రాలు ముద్రించి ప్రచారయావ చేసుకుంటోంది. ఇళ్ల లబ్ధిదారులకు చెల్లించే మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వానిదే అయినా.. ఇంటి ముంగిట పీఎంఏవై, వైఎస్సార్‌ అర్బన్‌, గ్రామీణ్‌ అని చెక్కిన ఫలకం అంటించారు.
  •  తాజాగా ‘‘ఏపీకి జగనే ఎందుకు కావాలి?’’ పేరుతో పథకాల వివరాలతో పెద్ద బోర్డులను వైకాపా నాయకులు ఆవిష్కరిస్తున్నారు. ఆయా పథకాల్లో చాలా వాటికి కేంద్రమే నిధులిస్తోంది. ఈ విషయం జనాలకు తెలియకుండా ఉండేందుకు ప్రతి పథకానికి జగనన్న, వైఎస్సార్‌ పేర్లు పెట్టారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి కరపత్రాలు, పుస్తకాలు ముద్రించి వాలంటీర్ల చేత పంచిపెడుతున్నారు.
  • రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 మాత్రమే ఇస్తోంది. ప్రచారంలో మాత్రం కేంద్ర ఇచ్చే నిధులు కలిపి రూ.13,500 తామే ఇస్తున్నట్లు గొప్పగా చెప్పుకుంటోంది.
  •  గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషన్‌ అభియాన్‌ ద్వారా కేంద్రం నిధులు సమకూరుస్తుంటే దానికి వైఎస్సార్‌ పేరు జతచేర్చి అవన్నీ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని