logo

తాళం వేసిన ఇళ్లకు కన్నం

ఆదోని పట్టణ శివారులోని తిరుమలనగర్‌, బాబా గార్డెన్‌ ప్రాంతాల్లో చోరీలు జరిగాయి. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడ్డారు. 22 తులాల బంరం, 50 తులాల వెండి, రూ.2.55 లక్షల నగదు దోచుకెళ్లిళ్లారు. బాధితులు,   ఏపీ కో-ఆపరేటివ్‌ సొసైటీలో ఉద్యోగం చేస్తున్న సాకరే పద్మావతి వారం రోజుల కిందట ఇంటికి తాళం వేసి కుమార్తె ఇంటికి వెళ్లారు.

Updated : 04 Dec 2023 06:03 IST

బంగారం, వెండి ఆభరణాలు, నగదు మాయం

పద్మావతి ఇంట్లో బీరువాను పగులగొట్టి చెలాచెదురుగా పడేసిన సామగ్రి

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆదోని పట్టణ శివారులోని తిరుమలనగర్‌, బాబా గార్డెన్‌ ప్రాంతాల్లో చోరీలు జరిగాయి. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడ్డారు. 22 తులాల బంరం, 50 తులాల వెండి, రూ.2.55 లక్షల నగదు దోచుకెళ్లిళ్లారు. బాధితులు,   ఏపీ కో-ఆపరేటివ్‌ సొసైటీలో ఉద్యోగం చేస్తున్న సాకరే పద్మావతి వారం రోజుల కిందట ఇంటికి తాళం వేసి కుమార్తె ఇంటికి వెళ్లారు. దొంగలు ఇంట్లో బీరువాను, అల్మారాలను పగులగొట్టి అందులో ఉంచిన సుమారు పది తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి శివరామిరెడ్డి తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి ఈ నెల 1వ తేదీన బెంగళూరులో ఉంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లారు. ఇంట్లో బీరువాలో ఉంచిన సుమారు పది తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.86 వేలు ఎత్తుకెళ్లిపోయారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ కాలనీలో సీఆర్‌పీఎఫ్‌ జవాను గురురాజా, స్రవంతి దంపతులు నివాసం ఉంటున్నారు. గురురాజా విధుల్లో ఇతర రాష్ట్రంలో పనిచేస్తుండగా స్రవంతి తన తల్లిగారి ఇంటికి శనివారం ఉదయం వెళ్లారు. దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉంచిన రూ.65 వేలు నగదుతో పాటు, రూ.25 వేలు విలువ చేసే సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లారని బాధితురాలు పేర్కొన్నారు. ఫెస్టిసైడ్స్‌ సేల్స్‌మెన్‌ గోపాల్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కసాపురం ఆంజనేయస్వామి ఆలయానికి శనివారం రాత్రి వెళ్లారు. తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో గోపాల్‌రెడ్డి ఇంట్లో నుంచి శబ్దం రావడంతో సమీపంలోని ఇళ్ల వారు గోపాల్‌రెడ్డికి ఫోన్‌ చేసి సమాచారం అందించారు. ఆయన తన ఇంటి వద్ద ఉన్న బంధువులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకునే లోపే దొంగలు పరారయ్యారన్నారు. ఆయన ఇంట్లో రెండు తులాల బంగారం, 50 తులాల వెండితోపాటు రూ.50వేల నగదు, ఇక్కడ ఇంటి ఆవరణలో ఉన్న విశ్వనాథ్‌శెట్టి ఇంట్లో సైతం దొంగ చొరబడి బీరువాలో రూ.4వేలు నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదోని డీఎస్పీ శివనారాయణస్వామి, మూడో పట్టణ సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సై జయశేఖర్‌ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని