logo

ప్రతిభ చాటుతూ.. పతకాలు సాధిస్తూ..

పేద, మధ్య తరగతికి చెందిన బాలికలు చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తున్నారు. పాఠశాల పీడీలు సుజాత, లూథియమ్మల పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతూ పతకాలను దక్కించుకుంటూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Published : 04 Dec 2023 03:56 IST

షటిల్‌ బ్యాడ్మింటన్‌లో సాధన చేస్తున్న బాలికలు

న్యూస్‌టుడే, డోన్‌ పట్టణం : పేద, మధ్య తరగతికి చెందిన బాలికలు చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తున్నారు. పాఠశాల పీడీలు సుజాత, లూథియమ్మల పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతూ పతకాలను దక్కించుకుంటూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. షటిల్‌ బ్యాడ్మింటన్‌లో రాణించి జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను సొంతం చేసుకుంటున్నారు. డోన్‌ పట్టణంలోని జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినుల క్రీడాప్రతిభపై ‘న్యూస్‌టుడే’ కథనం.

క్రీడా కోటలో ప్రభుత్వ కొలువు

క్రీడల్లో ప్రతిభను చూపి ప్రభుత్వ కొలువును పొందాలన్నదే లక్ష్యమంటోంది కొత్తపేటకు చెందిన విజయ్‌కుమార్‌, విజయలక్ష్మీ దంపతుల కుమార్తె సాత్విక. జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తండ్రి కేబుల్‌ ఆపరేటర్‌గా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. డోన్‌లో జరిగిన మండల, నియోజకవర్గ షటిల్‌ పోటీల్లో రాణించి జిల్లాస్థాయికి ఎంపికైంది. నంద్యాలలో జరిగిన జిల్లాస్థాయి షటిల్‌లో రాణించింది. నవంబరు 9 నుంచి 11 వరకు విశాఖలో జరిగిన రాష్ట్ట్ర్రస్థాయి పోటీల్లో ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందుకొంది.

జాతీయస్థాయిలో..

జాతీయస్థాయిలో సత్తా చాటి పతకాలు సాధించాలనుందని ఎం.తైబా చెబుతోంది. టీచర్స్‌కాలనీకి చెందిన ఎం.కరీముల్లా, నజీమా దంపతుల కుమార్తె అయిన ఆమె పీడీల వద్ద తర్ఫీదు పొందుతోంది. తండ్రి గ్యాంగ్‌మెన్‌గా పని చేస్తున్నారు. జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక 2023 ఆగస్టులో మండల, నియోజకవర్గ షటిల్‌ బ్యాడ్మింటన్‌లో ప్రతిభ చూపి జిల్లాస్థాయికి ఎంపికైంది. అక్టోబరు 26న నంద్యాలలో జరిగిన జిల్లాస్థాయి షటిల్‌ పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయికి ఎంపికైంది. విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి షటిల్‌లో రాణించి ప్రశంసాపత్రం, జ్ఞాపికలను సొంతంచేసుకొంది.

రాష్ట్రస్థాయిలో ఖ్యాతి

నెహ్రూనగర్‌కు చెందిన షేక్‌ మహమ్మద్‌రఫి, షేక్‌ మొహసీనా దంపతుల కుమార్తె ముష్కాన్‌ సర్వత్‌ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తండ్రి బిల్డింగ్‌ కాంట్రాక్టరుగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. 2023 ఆగస్టులో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన మండల, నియోజకవర్గ స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో సర్వత్‌ సత్తా చాటింది. అక్టోబరు 26న నంద్యాలలో జరిగిన జిల్లాస్థాయి షటిల్‌ పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. విశాఖలో నవంబరు 9 నుంచి 11 వరకు జరిగిన రాష్ట్రస్థాయి షటిల్‌ పోటీల్లో రాణించి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను సొంతం చేసుకొంది. భవిష్యత్తులో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యమని చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని