logo

ఊరించే మాటలు.. ఉడకని పప్పులు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేషన్‌ కార్డుదారులకు కందిపప్పు సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. నిత్యావసర సరకుల ధరలు కొండెక్కి కూర్చోవడంతో రేషన్‌ సరకుల్లో బియ్యంతోపాటు కందిపప్పు ఇస్తామని పాలకులు గత ఆరేడు నెలలుగా చెబుతూనే ఉన్నారు..

Published : 04 Dec 2023 04:05 IST

ఉమ్మడి జిల్లాకు 50 శాతం కందిపప్పు సరఫరా
ఈ నెలలోనూ కార్డుదారులకు నిరాశే

కందిపప్పు ప్యాకెట్లు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేషన్‌ కార్డుదారులకు కందిపప్పు సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. నిత్యావసర సరకుల ధరలు కొండెక్కి కూర్చోవడంతో రేషన్‌ సరకుల్లో బియ్యంతోపాటు కందిపప్పు ఇస్తామని పాలకులు గత ఆరేడు నెలలుగా చెబుతూనే ఉన్నారు.. కార్డుదారులు ప్రతినెలా ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు. వారికి నిత్యం నిరాశే ఎదురవుతోంది. ఈ నెలలోనూ పూర్తిస్థాయిలో కోటా రాకపోవడంతో కొందరికి మాత్రమే అందే పరిస్థితి నెలకొంది.

నవంబరులో నగుబాటు

నవంబరు నెలలో కర్నూలు జిల్లాకు 400 టన్నులు, నంద్యాల జిల్లాకు 350 టన్నుల కందిపప్పును రెండు విడతల్లో సరఫరా చేస్తామని పౌరసరఫరాల ఉన్నతాధికారులు తెలిపారు. అక్టోబరు చివరి నాటికి, నవంబరు మొదటి వారంలో కలిపి ఉమ్మడి జిల్లాలకు 750 టన్నుల కందిపప్పు అంటే.. ఒక్కో కార్డుదారుడికి కిలో చొప్పున 7.50 లక్షల మందికి అందించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 12.10 లక్షల మంది కార్డుదారులు ఉండగా కేవలం 24,667 మందికి మాత్రమే పంపిణీ చేయడం గమనార్హం.
బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు  కిలో రూ.180 వరకు చేరింది.  ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నాఫెడ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కందిపప్పును కేటాయించడం లేదనే విమర్శలున్నాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కార్డుదారులకు కందిపప్పు అందించలేని పరిస్థితి. ఫలితంగా పేదలు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

అధికారులు ఏమన్నారంటే..

రేషన్‌ కార్డుదారులకు నవంబరు నుంచి కిలో చొప్పున కందిపప్పు అందిస్తాం. అన్ని రేషన్‌ దుకాణాల్లో సరకు అందుబాటులో ఉంచుతాం. కార్డుదారులు ఎండీయూ వాహనాల వద్దకు వెళ్లి కందిపప్పు తెచ్చుకోవచ్చు. - అక్టోబరులో రాష్ట్ర పౌరసరఫరా శాఖ కమిషనర్‌ చెప్పిన మాటలివి..

క్షేత్రస్థాయిలో పరిస్థితి..

‘డిసెంబరులో ప్రతి కార్డుదారుడికి కందిపప్పు పంపిణీ చేస్తాం. జిల్లాలకు పూర్తిస్థాయి కోటా వస్తుంది.. కందిపప్పు లేదనే మాట రాకూడదు’ అని అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ఉమ్మడి జిల్లాలో సగం కోటా కూడా జిల్లాకు రాని పరిస్థితి నెలకొంది.

సగమే పంపిణీ

కర్నూలు జిల్లాలో 6.71 లక్షల మంది కార్డుదారులుండగా 658.359 టన్నుల కందిపప్పు కోటా కేటాయించారు. తీరా 365.611 టన్నులు మాత్రమే జిల్లాలోని చౌక దుకాణాలకు సరఫరా చేశారు. 1,233 చౌక దుకాణాల్లో 55 శాతం వాటికే కందిపప్పు అందింది.  ఇప్పటి వరకు 166.814 టన్నులు మాత్రమే సరఫరా చేయడం గమనార్హం.

కర్నూలు జిల్లాలో ఈ మూడు రోజుల్లో 1.33 లక్షల మంది కార్డుదారులకు 19.83 శాతం రేషన్‌ సరకులు పంపిణీ చేశారు. అందులో 1.06 లక్షల మందికి అర కిలో చొప్పున పంచదార, 97,011 మందికి కిలో చొప్పున కందిపప్పు ఇచ్చారు.

జనం ఆగ్రహం

కార్డుదారులకు గత ఐదారు నెలలుగా కందిపప్పు అందడం లేదు. ఈ నేపథ్యంలో కందిపప్పు లేకుండా ఎండీయూ వాహనాన్ని తమ వీధికి తీసుకురావొద్దంటూ కార్డుదారులు ఆపరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.160-180 వరకు ఉంది. ఇంటింటికి రేషన్‌ పంపిణీలో భాగంగా ప్రభుత్వం కిలో రూ.67కే అందించాల్సి ఉంది. బహిరంగ మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడు పేదలకు కందిపప్పు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని