logo

పత్తి పరిశ్రమల బేలచూపు

ఒకప్పుడు కళకళలాడిన పత్తి పరిశ్రమలు ప్రస్తుతం మూతపడే పరిస్థితికి చేరాయి. వాణిజ్య పరంగా రెండో ముంబయిగా పేరుగాంచిన ఆదోనిలో ప్రసుత్తం పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. స్థానికంగా పత్తి వ్యాపారం కారణంగా..

Published : 04 Dec 2023 04:08 IST

పూర్తిగా పడిపోయిన దిగుబడులు
నష్టాలతో సతమతమవుతున్న వ్యాపారులు

ఆదోని యార్డులో అరకొరగా పత్తి దిగుబడులు

ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: ఒకప్పుడు కళకళలాడిన పత్తి పరిశ్రమలు ప్రస్తుతం మూతపడే పరిస్థితికి చేరాయి. వాణిజ్య పరంగా రెండో ముంబయిగా పేరుగాంచిన ఆదోనిలో ప్రసుత్తం పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. స్థానికంగా పత్తి వ్యాపారం కారణంగా.. పదుల సంఖ్యలో పరిశ్రమలు స్థాపించారు. భారీగా దిగుబడులు వచ్చేవి. ప్రస్తుతం సరకు అరకొరగా ఉండటంతో ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి.

దిగువకు దూది కండి ధరలు

గతేడాది దూది కండి ధర రూ.లక్ష వరకు పలికింది. అప్పుడు పత్తి ధర క్వింటా రూ.12 వేల వరకు పలికింది. ప్రస్తుతం మార్కెట్లో దూది కండి ధర రూ.55 వేలు, గింజలు క్వింటా రూ.3,100 మాత్రమే పలుకుతోంది. వస్త్ర ఉత్పత్తి లేక దారానికి డిమాండ్‌ తగ్గింది.  మూడేళ్ల కిందట ఆదోనిలో ఉన్న పరిశ్రమలు 5-6 లక్షల వరకు పత్తి బేళ్లు ఉత్పత్తి చేస్తే.. గతేడాది రెండున్నర లక్షలు ఉత్పత్తి మాత్రమే చేయగలిగాయి.

ప్రభుత్వాలు ఆదుకోక..

ఇంతటి సంక్షోభంలో ఉన్న పరిశ్రమలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం ఆదుకోవడం లేదు. విద్యుత్తు డ్యూటీ ఒకప్పుడు యూనిట్‌పై 6 పైసలు ఉండగా ప్రస్తుతం రూపాయికి చేరింది.  గతంలో కొత్త పరిశ్రమలకు ఐదేళ్ల పాటు రాయితీలు ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇవి అమలుకావడం లేదు.

కార్మికులకు ఉపాధి కరవు

ఒక్కో పత్తి పరిశ్రమలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా 150-200 మంది కార్మికులకు ఉపాధి లభించేది. ప్రస్తుతం పత్తి దిగుబడులు లేక చాలా పరిశ్రమలు నడవడం లేదు. ఫలితంగా వీరికి ఉపాధి కరవైంది. పత్తి పరిశ్రమలు నడిస్తే ఒక్కో  కార్మికుడికి రోజుకూలీ రూ.500కుపైగా వచ్చేది. ప్రసుత్తం వారి పరిస్థితి దయనీయంగా మారింది. సుమారు ఐదు వేల మంది కార్మికులు అర్ధాకలితో అవస్థలు పడుతున్నారు.

తీవ్ర వర్షాభావ పరిస్థితులతో..

పత్తి సాగుకు వర్షమే ఆధారం. సాగైన పత్తి ఆదోని మార్కెట్‌యార్డుకు తెస్తే.. అక్కడి నుంచి వ్యాపారులు ఈ-నామ్‌ పద్ధతిలో కొనుగోలు చేసి పరిశ్రమలకు తరలిస్తారు. అక్కడ జిన్నింగ్‌ చేసి దూది, గింజలు వేరుచేస్తారు. దూదిని నూలు కోసం తమిళనాడు వంటి రాష్ట్రాలకు, గింజలను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఒక్కో టీఎంసీ యూనిట్‌కు సరాసరి 1500-2000 క్వింటాళ్ల పత్తి దిగుబడులు అవసరం. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌కు రోజువారీగా వచ్చే పత్తి కేవలం 2 నుంచి 4 వేల క్వింటాళ్ల లోపే ఉంటోంది. ఫలితంగా చాలా పరిశ్రమలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. 

ఆదోని పరిధిలో పత్తి వ్యాపారం నమ్ముకుని సుమారు 50 వరకు టీఎంసీ (పత్తి పరిశ్రమలు) యునిట్లు నెలకొల్పారు. ఒక్కో పరిశ్రమ ఏర్పాటుకు సుమారు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు పెట్టుబడి కావాలి. ఇందులో చాలావరకు సొంత పెట్టుబడితో పాటు బ్యాంకు రుణాలతో పరిశ్రమలు స్థాపించారు. ప్రసుత్తం వీటి పరిస్థితి దయనీయంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని