logo

ఉన్నోళ్లవి మాయం.. జాబితా గందరగోళం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు ఆదివారంతో ముగిశాయి. శనివారం వెలవెలబోయినా.. ఆదివారం మాత్రం కొంతమేర స్పందన కనిపించింది. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు ఉందో? లేదో? అని పరిశీలించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారు.

Published : 04 Dec 2023 04:17 IST

ముగిసిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు
అంతంత మాత్రంగానే వచ్చిన దరఖాస్తులు

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం, ఈనాడు-కర్నూలు : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు ఆదివారంతో ముగిశాయి. శనివారం వెలవెలబోయినా.. ఆదివారం మాత్రం కొంతమేర స్పందన కనిపించింది. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు ఉందో? లేదో? అని పరిశీలించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారు. తమ ఓటు హక్కు నివసించే ప్రదేశానికన్నా సుదూర ప్రాంతాల్లో ఉండటంతో ఆశ్చర్యపోయారు. మరికొందరి పేర్లు జాబితాలో కనపడకపోవంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో బీఎల్వోలతో వాగ్వాదానికి దిగారు. చివరికి కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంమీద 20 శాతం మంది ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు రాగా.. మిగిలిన 80 శాతం మంది స్పందించలేదు. కొన్ని ప్రాంతాల్లో బీఎల్వోలు ఆలస్యంగా వచ్చి.. ముందుగానే వెళ్లిపోవడంతో పలువురు దరఖాస్తుదారులు నిరాశగా వెనుదిరిగారు.

ఏళ్లుగా దరఖాస్తు చేస్తున్నాం

అర్హులైన వారందరికీ ఓటుహక్కు కల్పించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇస్తోంది. ఇది ఏమాత్రం అమలు కావడం లేదు. కర్నూలు చాణిక్యపురి కాలనీకి చెందిన కృష్ణమూర్తిరావు, సరిత మాట్లాడుతూ ఇప్పటికీ పలుమార్లు ఓటు హక్కు కోసం గత కొన్నేళ్లుగా దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసుత్తం మరోసారి కర్నూలు ఎ.క్యాంపు మాంటిస్సోరి పాఠశాలలోని ప్రత్యేక శిబిరంలో దరఖాస్తు ఇచ్చామని చెప్పారు. ఈసారైనా తమకు ఓటుహక్కు వస్తుందో లేదోనని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంతో పోల్చితే..

గత నెల 4, 5 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదు శిబిరాల కంటే ఈసారి కొంత ఎక్కువమంది కేంద్రాలకు వచ్చారు. ఆయా కేంద్రాల్లో కొత్తగా ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు దరఖాస్తులు వచ్చాయి. కర్నూలు నగర పరిధిలోని 92వ పోలింగ్‌ కేంద్రంలో ముప్పై మంది బోగస్‌ ఓటర్లు ఉన్నారు. 96వ పోలింగ్‌ కేంద్రంలో 25 మంది మృతులు ఉన్నప్పటికీ వాటిని తొలగించలేదు.

వివరాలు సరిచేయాలంటూ..

ప్రస్తుతం నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలకు కొత్తగా ఓటరు నమోదుకు సంబంధించి  పేర్లు లేని వారు దరఖాస్తు చేసుకుంటున్నారు. జాబితాలో పేర్లు ఉన్నా.. తప్పులతడకగా ఉన్నాయని.. మార్పులు, చేర్పులు చేయాలని, ఒక పోలింగ్‌ కేంద్రం నుంచి మరో పోలింగ్‌ కేంద్రాలకు మార్చాలని.. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి తమ ఓటును బదిలీ చేయాలంటూ దరఖాస్తులు అందించారు. అయితే తొలగింపులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు అంతంత మాత్రంగానే ఉన్నాయి..

యువత కోసం వెతుకులాట

కర్నూలు నియోజకవర్గంలో ఒక్కో బీఎల్వో 25 మంది యువతను ఓటర్లుగా నమోదు చేయించాలంటూ లక్ష్యాలు నిర్దేశించారు. పట్టణ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఎల్వోలు ఆ లక్ష్యాలు అధిగమించేందుకు యువత కోసం వెతుకులాట ఆరంభించారు. ఇన్నాళ్లు వారి గురించి పట్టించుకోని బీఎల్వోలు.. ప్రసుత్తం లక్ష్యాలు నిర్దేశించడంతో యువతను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మరి వారిని ఓటర్లుగా నమోదు చేయడంలో ఎంతవరకు సఫలీకృతమవుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.  

శాశ్వతంగా వలస వెళ్లినా..

కర్నూలు నియోజకవర్గ పరిధి 93వ పోలింగ్‌ కేంద్రంలో తొమ్మిది మంది దీర్ఘకాలికంగా వలస వెళ్లిన ఓటర్లు ఉన్నారు. వారిని తొలగించాలని ఇంటింటి సర్వేలో విన్నవించినా తొలగించలేదని బీఎల్వోలు పేర్కొన్నారు. ముగ్గురు కొన్నేళ్ల కిందట చనిపోయినప్పటికీ ముసాయిదా జాబితాలో బతికే ఉన్నారు.

చెప్పకనే తొలగించేశారు

నేను ఐదేళ్ల కిందట కర్నూలు బుధవారపేటలోని 104వ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నా. తీరా ఇప్పుడు ఓటరు జాబితాను పరిశీలిస్తే నాపేరు లేదని కర్నూలుకు చెందిన ఈశ్వర్‌ పేర్కొన్నారు. తన పేరు ఎలా తొలగిస్తారని అధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఆదివారం అదే పోలింగ్‌ కేంద్రంలో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

వయస్సు 24.. ఓటుహక్కు లేదు

నేను కర్నూలు బుధవారపేట గట్టయ్య స్కూల్‌ ప్రాంతంలో నివసిస్తున్నా.. ఇంటింటికి ఓటరు సర్వేకు బీఎల్వోలు రాలేదు. నా వయస్సు 24 ఏళ్లు. ఇప్పటివరకు నాకు ఓటు హక్కు లేదు. చివరికి ఎ.క్యాంపులోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చి కొత్తగా ఓటరు నమోదు చేసుకున్నా’ అని పరశురాముడు పేర్కొన్నారు.

అంతా అస్తవ్యస్తమే..

మిడుతూరులోని 1, 2 వార్డుకు సంబంధించి ఓటరు జాబితా అస్తవ్యస్తంగా ఉంది. చనిపోయినవారు, స్థానికంగా లేనివారి వివరాలు అలానే ఉన్నాయి. దీనికితోడు గతంలో ఉన్న ఓటర్లను ఇష్టానుసారంగా తొలగించేశారు. నంబరు 160లో వేణుగోపాల్‌రెడ్డి, 152 షకీర్‌ అహమ్మద్‌, 497లో స్నేహ, 508లో శకుంతల తదితరులు జాబితాలో చూపిన ఇళ్ల నంబర్లలో నివసించకపోయినా జాబితాలో మాత్రం వివరాలు ఉన్నాయి.

న్యూస్‌టుడే, నందికొట్కూరు, మిడుతూరు

మహిళగా చూపారు..

పాణ్యం నియోజకవర్గ పరిధి కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలోని 38వ పోలింగ్‌ కేంద్రంలో ఓటరు జాబితాలో ఎన్‌కేడీ3545555 సంఖ్యకు చెందిన ఓటరు పురుషుడు కాగా.. మహిళగా చూపారు. జాబితాలో ఒకరిద్దరివి అలానే ఉండటం గమనార్హం.

న్యూస్‌టుడే, కల్లూరు గ్రామీణ

ఇదో వి‘చిత్రం’

మహానంది మండలం తమ్మడపల్లె గ్రామంలో 207 పోలింగ్‌ కేంద్రం.. 610 నంబరులోని ఆర్‌ఏఏ 19335లో వివరాలు ఒకరివి ఉండగా చిత్రం మరొకరిది ఉంది. దీనిని చూసి సదరు ఓటరు ఆశ్చర్యపోయారు. అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం

బీఎల్వోల జాడేదీ..

నల్లగట్లలోని పోలింగ్‌ కేంద్రం వద్ద కానరాని బీఎల్వోలు

ఆళ్లగడ్డ మండలంలోని నల్లగట్ల, బత్తలూరు గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద బీఎల్‌వోల జాడ కానరాలేదు. సాయంత్రం 5 గంటల వరకు కేంద్రాల వద్ద అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలి. నల్లగట్లలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్‌ కేంద్రం వద్ద సిబ్బంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బత్తలూరులో అసలు ఓటరు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమాచారం ఇవ్వలేదని గ్రామస్థులు పేర్కొన్నారు.

న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ గ్రామీణం

మృతి చెందినా తొలగించరు..

జాబితాలో మృతి చెందిన   ఓటర్ల వివరాలు

నంద్యాల పట్టణంలోని 24వ వార్డు పి.వి.నగర్‌ పోలింగ్‌ కేంద్రం నంబరు 45లో మొత్తం 884 ఓట్లు ఉన్నాయి. ఏళ్ల కిందట పదుల సంఖ్యలో పలువురు ఓటర్లు మృతి చెందినా ఓటర్ల జాబితాలో వారి వివరాలు అలానే ఉన్నాయి. ఇంటింటి సర్వే సమయంలో బీఎల్వోలు ఈ వివరాలు గుర్తించలేదు.

న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని