logo

భూ హక్కుకు చిక్కులు

‘‘ నా కోడలు సావిత్రికి సర్వే నంబర్లు 193-ఏలో 1.44 ఎకరాలు, 193-బిలో 1.02 ఎకరాల పొలం ఉంది.

Published : 05 Dec 2023 01:24 IST

తప్పులమయంగా పత్రాలు
ఆందోళనలో అన్నదాతల్జు

భూ హక్కు పత్రంతో చిన్న రంగన్న

‘‘ నా కోడలు సావిత్రికి సర్వే నంబర్లు 193-ఏలో 1.44 ఎకరాలు, 193-బిలో 1.02 ఎకరాల పొలం ఉంది. అధికారులు ఇటీవల ఇచ్చిన భూహక్కు పత్రంలో 2.46 ఎకరాలు తక్కువగా నమోదు చేశారు. ఇదేమని రెవెన్యూ అధికారులను అడిగితే సమాధానం రావడం లేదు. సర్వే నంబరు 214-3లో 0.95 ఎకరాలు, 228లో ఒక ఎకరా నా పేరుపై ఉంది.. భూహక్కు పత్రంలో ఈ రెండు సర్వే నంబర్లూ ’’ కనిపించడం లేదు.. నాలుగున్నర ఎకరాలు మాయం చేశారని గుండ్రేవులకు చెందిన చిన్న రంగన్న ఆందోళన వ్యక్తం చేశారు.

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : జగనన్న శాశ్వత భూహక్కు .. భూరక్ష పత్రాలు రైతులకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. భూ విస్తీర్ణంలో భారీగా వ్యత్యాసాలు ఉన్నాయి. సర్వే నంబర్లు తప్పుగా ముద్రణ అయ్యాయి. ఒకరి చిత్రం బదులు మరొకరిది ప్రచురించడం.. ఎకరాలకు ఎకరాలు తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలపై ముఖ్యమంత్రి చిత్రం వేయించుకోవడంలో ఉన్న శ్రద్ధ.. భూహక్కు పత్రాల్లో తప్పులు సరిదిద్దడం లేదని అన్నదాతలు మండిపడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రప్రథమంగా కల్లూరు మండలం పందిపాడు, ఆలూరు మండలం కాత్రికి, నంద్యాలలోని బిల్లలాపురం గ్రామాల్లో 2020 డిసెంబరులో భూముల రీసర్వే ప్రారంభించారు. 2022లో జిల్లాల విభజన నాటికి మొదటి విడత భూముల రీసర్వే చేశారు. జిల్లాల విభజన అనంతరం కర్నూలు జిల్లాలో మొదటి విడత 67 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేశారు. రెండో విడతలో 21 గ్రామాల్లో పూర్తైంది. రెండు విడతల్లో కలిపి 88 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారు.

మూడో విడత ముద్రణలో

మూడో విడతలో 380 గ్రామాల్లో సర్వే చేయాల్సి ఉండగా 180 ప్రాంతాల్లో రీసర్వే పనులు సాగుతున్నాయి. అందులో 175 గ్రామాలకు సంబంధించి 80 గ్రామాల్లో ఫైనల్‌ ఆర్వోఆర్‌ పూర్తైంది. మిగిలిన గ్రామాల్లో రీసర్వే పనులు సాగుతున్నాయి. మొదటి విడతలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో మూడో విడతలో ఆరు మండలాల్లో 16 గ్రామాల్లో రీసర్వే పూర్తైంది. ఈ గ్రామాలకు సంబంధించి 13,544 శాశ్వత భూ హక్కు పత్రాలు వచ్చాయి. వాటిని ఆయా మండలాలకు సరఫరా చేశారు. ఆయా గ్రామాలకు చెందిన వాలంటీర్లు భూహక్కు పత్రాలు రైతులకు ఇచ్చి ఈ-కేవైసీ వేలిముద్రలు వేయించుకుంటున్నారు.

ఎకరాలకు ఎకరాలు మాయం

భూ విస్తీర్ణంలో తేడాలు.. కొన్ని సర్వే నంబర్ల భూ వివరాలు లేకుండా ఇవ్వడం, నలుగురైదుగురు రైతులకు కలిపి జాయింట్‌ ఎల్‌పీఎం నంబర్లతో భూహక్కు పత్రాలు పంపిణీ చేస్తుండటంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతుకు సెంటు నుంచి పది, 20 సెంట్లు, అర ఎకరా, ఎకరా, రెండెకరాలకు సంబంధించి సర్వే నంబర్లు లేకుండానే హక్కు పత్రాలు ఇస్తుండటం గమనార్హం. తమ భూమి కొలతలు, విస్తీర్ణంలో తేడాలున్నాయని..   అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు.

ఈ-పట్టాదారు పాసు పుస్తకాలివ్వండి

రీసర్వే పూర్తి చేసిన గ్రామాల్లో వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం పేరుతో జగనన్న భూహక్కు పత్రం, భూ యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పాసు పుస్తకం అనే వివరాలతో భూహక్కు పత్రాలపై ముఖ్యమంత్రి చిత్రంతో ముద్రించిన పుస్తకాలు రైతులకు అందజేస్తున్నారు. ఈ హక్కు పత్రాలన్నీ తప్పులతడకగా ఉండటంతో రైతులు ఈ పుస్తకాలు మాకొద్దని స్పష్టం చేస్తున్నారు. గతంలో మాదిరిగా ఈ.పట్టాదారు పాసు పుస్తకాలు కావాలని కోరుతున్నారు. హడావుడిగా రీసర్వే పూర్తి చేసి హక్కు పత్రాలు ఇస్తున్నారని.. తప్పులు సరి చేయడం లేదని మండిపడుతున్నారు.

మాటలు గొప్ప

దేశంలోనే ప్రప్రథమంగా మన రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రారంభించాం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో.. డ్రోన్ల సాయంతో ప్రతి క్షేత్రం, పొలం చిత్రపటాలు తీసుకుని ఎలాంటి లోపాలు లేకుండా.. భూ విస్తీర్ణంలో తేడాలు లేకుండా రైతులకు కచ్చితమైన కొలతలు వేయించి, రీసర్వే చేయించి శాశ్వత భూహక్కు పత్రాలు అందిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్‌ పదేపదే చెప్పే మాటలివి.

చేతలు ఇట్ల

రీసర్వే అన్నారు.లెక్కలు రాసుకుపోయారు.ఇటీవల భూ హక్కు పత్రాలు ఇచ్చారు.అవన్నీ తప్పులమయంగా ఉన్నాయి.  విస్తీర్ణంలో భారీగా తేడాలున్నాయని సి.బెళగల్‌ మండలం గుండ్రేవులకు చెందిన 30 మంది రైతులు సమస్యను పరిష్కరించాలని సోమవారం కలెక్టరేట్‌లోని స్పందనలో విన్నవించారు. ‘‘ సర్వే నంబర్లు 12, 17లో 2.07 ఎకరాలు మా నాన్న ఆర్‌.సుదర్శనం పేరుపై ఉంది. 17వ సర్వే నంబరులో 1.32 ఎకరాలకుగాను 1.38 ఎకరాలు ఉన్నట్లు పత్రం ఇచ్చారు.. 12వ సర్వే నంబరులో 0.75 సెంట్లు నమోదు చేయలేదని’’ ఆర్‌.దానం వాపోయారు.

గుండ్రేవులలో సర్వే నంబరు 65-4లో 1.15 ఎకరాల భూమి నా భార్య బోయ లక్ష్మీదేవి పేరున ఉంది. రీసర్వే చేసిన తర్వాత కేవలం 0.17 సెంట్ల భూమితో హక్కు పత్రం ఇచ్చారు.. నా భార్య చిత్రానికి బదులు పురుషుడి చిత్రం ముద్రించారు.. శాశ్వత భూహక్కు అంటే భూములు మాయం చేయడమేనా అని రోగన్న ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని