logo

పెద్ద మంత్రి.. నీటికి అడ్డంకి

గాజులదిన్నె జలాశయంలో నీళ్లు నింపకపోతే వేసవిలో కర్నూలు నగరం, డోన్‌, కృష్ణగిరి, కోడుమూరు, ఎమ్మిగనూరులో ప్ర‘జల’ దాహం కేకలు మిన్నంటే ప్రమాదం ఉంది.

Published : 05 Dec 2023 01:26 IST

గాజులదిన్నెపై పట్టువీడని నేత
తన జిల్లాకు నీటిని తీసుకెళ్లే యత్నం
 

ఈనాడు, కర్నూలు : గాజులదిన్నె జలాశయంలో నీళ్లు నింపకపోతే వేసవిలో కర్నూలు నగరం, డోన్‌, కృష్ణగిరి, కోడుమూరు, ఎమ్మిగనూరులో ప్ర‘జల’ దాహం కేకలు మిన్నంటే ప్రమాదం ఉంది.. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు హంద్రీ కాల్వ ద్వారా నీటి తరలింపుపై చేస్తున్న ప్రయత్నాన్ని రాయలసీమకు చెందిన ‘పెద్ద’ మంత్రి అడ్డుపడుతున్నారు. తన జిల్లాకు నీళ్లు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే పెద్దమంత్రి అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. హెచ్‌.ఎన్‌.ఎస్‌.ఎస్‌. నుంచి 250 క్యూసెక్కుల నీటిని గాజులదిన్నెకు పంపే అవకాశం ఉంది. సదరు మంత్రి తీరుతో 130 క్యూసెక్కులే విడుదల చేయకలేకపోతున్నారు. దీంతో జలాశయం పరిధిలో గ్రామాలకు మంచినీరు, రబీలో 24,372 ఎకరాలకు నీరందే పరిస్థితి కానరావడం లేదు. అయినప్పటికీ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మొద్దునిద్ర వీడలేదు.

ఎల్లెల్సీ నుంచి తరలింపు

ప్రస్తుతం గాజులదిన్నె ప్రాజెక్టులో 1.4 టీఎంసీల నీరుంది. తుంగభద్ర దిగువ కాల్వ (ఎల్‌.ఎల్‌.సి.) నుంచి నిత్యం 220 క్యూసెక్కులు పంపుతున్నారు. ఆ నీటిని పంపేందుకు ఎల్లెల్సీ పరిధిలోని కొంత ఆయకట్టుకు నీటిని ఇవ్వకుండా కోత పెట్టారు. ఆ నీరూ మరో పది రోజులు మాత్రమే పంపేందుకు అవకాశం ఉంది. గాజులదిన్నె ప్రాజెక్టులో ఎలాగైనా రెండు టీఎంసీలు నిల్వ చేసి వచ్చే వేసవిలో కనీసం తాగునీటి కొరత రాకుండా చూడాలని జలవనరులశాఖ అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. మరి వారి ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో చూడాల్సి ఉంది.

3 టీఎంసీలు కేటాయించినా

  • గాజులదిన్నె జలాశయానికి హంద్రీనీవా సుజల స్రవంతి నుంచి మూడు టీఎంసీలు కేటాయించారు. ఈ నీటిని విడుదల చేసేందుకు పెద్ద మంత్రి అంగీకరించలేదు. కేవలం మంచినీటి అవసరాలకు మాత్రమే వదిలేందుకు అనుమతించడంతో నిత్యం 130 క్యూసెక్కులు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఆ నీరూ విడుదల కాకపోవడం గమనార్హం. ఆదివారం సగటున కేవలం 80 క్యూసెక్కుల మాత్రమే వచ్చింది.
  •  నిత్యం 130 క్యూసెక్కుల విడుదల చేసినా నెల రోజుల్లో కేవలం 0.3 టీఎంసీలు చేరుతుంది. ఒక టీఎంసీ నీరు చేరాలంటే కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం శ్రీశైలం నీటిమట్టం 838.3 అడుగుల వరకు ఉంది. ఇది 810 అడుగులకు పడిపోతే హెచ్‌.ఎన్‌.ఎస్‌.ఎస్‌. నుంచి నీరు వచ్చే అవకాశముండదు. డిసెంబరు నెలాఖరుకుగానీ.. జనవరి మొదటి వారానికి శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 810 అడుగులకు పడిపోతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాజులదిన్నెకు మహా అయితే 0.5 టీఎంసీలకు మించి ఇచ్చే అవకాశం లేదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని