logo

కాల్వ భూములుకబ్జా

నంద్యాల జిల్లా కావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా అక్కడి అధికార పార్టీ నేతలు వాలిపోతున్నారు.

Updated : 05 Dec 2023 06:19 IST

వెంచర్లుగా మార్చి విక్రయం
 నీటి ప్రవాహానికి ఆటంకం

నంద్యాల జిల్లా కావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా అక్కడి అధికార పార్టీ నేతలు వాలిపోతున్నారు. జిల్లా కేంద్రంలోని కేసీ కాల్వ శిఖం భూమి అక్రమార్కులకు ఫలహారంగా మారింది. భవిష్యత్తు అవసరాల కోసం చెరువుకు పక్కనే వదిలేసిన ఖాళీ స్థలాలు కట్ట నిర్మాణం, ఇతర అవసరాలకు వినియోగిస్తారు. ఇప్పటికే స్థిరాస్తి వ్యాపారులు పంట కాల్వలను ఆక్రమించి విక్రయించారు. ఇప్పుడు అధికార పార్టీ అండతో ఏకంగా కేసీ కాల్వ శిఖం భూములను పొలాలుగా మార్చేస్తున్నారు. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే 

పంటకాల్వలు కనుమరుగు

నంద్యాల పట్టణంలో సర్వే నంబరు 869 నుంచి 2304 వరకు మూడు దశాబ్దాల కిందట 2,500 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో 1900 నుంచి 2000 ఎకరాల వరకు కేసీ కాల్వ పంట కాల్వలు ఉన్నాయి. ప్రత్యేక శ్రేణి పురపాలకంగా మారినప్పటి నుంచి కాల్వ అక్రమణలు పెరిగిపోయాయి. పట్టణంలో సుమారు 12 కి.మీ మేర కనుమరుగయ్యాయి. ప్రత్యేకించి జగజ్జననీనగర్‌, చిన్నచెరువు కట్ట, ఆత్మకూరు బస్టాండు, బాలాజీ కాంప్లెక్స్‌, ఫరూక్‌నగర్‌, ఎస్‌బీఐ కాలనీ, ఎన్జీవోకాలనీ, నూనెపల్లె, రైతునగరం, కాంతినగర్‌ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కేసీ కాల్వ శిఖం భూమి ఆక్రమణలకు గురైంది. పట్టణాన్ని ఆనుకుని ఉన్న పెద్ద చెరువు, చిన్న చెరువు 750 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ రెండు చెరువుల శిఖం భూమి 50 ఎకరాలు ఉంది. ప్రస్తుతం అందులో సగానికి సగం కబ్జాకు గురైంది.

20 ఎకరాలు స్వాహా

కేసీ కాల్వ శిఖం భూమికి సంబంధించి సంబంధితశాఖ వద్దనే సరైన దస్త్రాలు, వివరాలు లేవు. దీన్ని అవకాశంగా తీసుకున్న అక్రమార్కులు ఆక్రమణలకు బరి తెగించారు. సుమారు 12 కి.మీల పొడవున ఉన్న స్లూయిస్‌లు, కాల్వలు ప్రస్తుతం కనిపించడం లేదు. ఆక్రమణల పర్వంతో సుమారు 20 ఎకరాల భూమిని స్థిరాస్తి వ్యాపారులు స్వాహా చేశారు. ఆ భూమికి రూ.300 కోట్లకు పైగా విలువ ఉంటుంది. బాలాజీ కాంప్లెక్స్‌లో పంట కాల్వలపై బహుళ అంతస్తుల నిర్మాణాలు, గ్రేటెడ్‌ కమ్యూనిటీ భవనాలు కనిపిస్తున్నాయి. ఫరూక్‌నగర్‌, జగజ్జననీనగర్‌, ఎస్‌బీఐకాలనీ, పద్మావతినగర్‌లలో ప్రస్తుతం సెంటు స్థలం రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంది. రాజ్‌ థియేటర్‌ సమీపంలో చామకాల్వ వెడల్పు పెద్దదిగా ఉండగా.. దానికి 100 అడుగుల దూరంలో రెండు మీటర్ల వెడల్పూ కనిపించని పరిస్థితి నెలకొంది.

రూ.15 కోట్ల భూమికి రెక్కలు  

నంద్యాల పట్టణం ఎస్‌బీఐ సమీపంలో పెద్ద చెరువు నీటిని స్లూయిస్‌ ద్వారా శిఖం భూమి మీదుగా పొలాలకు మళ్లిస్తున్నారు. ఇది కొంతకాలం కిందటి నుంచి అధికార పార్టీ నాయకుడి ముఖ్య అనుచరుడి చేతిల్లోకి వెళ్లింది. ఆయన దాన్ని చదును చేసి పొలంగా మార్చి కౌలుకు ఇచ్చారు. వరదల సమయంలో పాలేరు వాగు నుంచి వచ్చే వరద జలాలు ఈ స్లూయిస్‌ మీదుగా వెళ్లేందుకు వీలుకాక ఎక్కడిక్కడ నిల్వ ఉంటున్నాయి. మహానంది- నంద్యాల మార్గంలో రాకపోకలకు ఆటంకంగా మారుతోంది. ఇక్కడ సెంటు స్థలం రూ.15 లక్షల వరకు ఉంది. అక్రమణకు గురైన భూమి ఎకరానికి పైగా ఉంది. రూ.15 కోట్లు విలువ చేసే భూమి అక్రమార్కుల చేతిలో ఉన్నా అధికారుల చర్యలు శూన్యం.  

వీటినీ వదల్లేదు

  • బాలాజీ కాంప్లెక్స్‌లో సుమారు రెండెకరాల భూమిని సెంట్ల ప్రకారం కొనుగోలు చేసిన అధికారపార్టీ నాయకుడు పంట కాల్వలను పూడ్చి తన స్థలంలో కలిపేసుకున్నారు.
  •  పద్మావతినగర్‌లోని పంట కాల్వలను మురుగుకాల్వలుగా మార్చివేసిన అధికార పార్టీకి చెందిన సొసైటీ యాజమాన్యం వాటిని సెంట్ల ప్రకారం పట్టణంలో పలుకుబడి ఉన్న వ్యాపారులు, రాజకీయ నాయకులకు నామమాత్రపు ధరకు కట్టబెట్టింది.
  • ఎస్‌బీఐ కాలనీలోని చామకాల్వ వెంట అధికారపార్టీకి చెందిన ఒక నాయకుడి అనుచరులు స్థలాలను బిట్లుగా విడగొట్టి తమ గుప్పెట్లో ఉంచుకున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని