logo

మిరప కుప్పలు.. నిల్వకు తిప్పలు

రూ.లక్షలు పెట్టుబడి పెట్టి మిరప సాగు చేసిన రైతులను మిగ్‌ జాం భయపెడుతోంది. ఉమ్మడి జిల్లాలో 79,793 హెక్టార్లలో సాగు చేయగా ఒక్క కర్నూలు జిల్లాలో 60,100 హెక్టార్లలో సాగైంది. పశ్చిమ ప్రాంతంలో రైతులు ఎక్కువగా సాగు చేశారు.

Published : 05 Dec 2023 01:36 IST

కల్లాల్లో పెద్ద ఎత్తున్న ఆరబోత 
భయపెడుతున్న మిగ్‌జాం

రూ.లక్షలు పెట్టుబడి పెట్టి మిరప సాగు చేసిన రైతులను మిగ్‌ జాం భయపెడుతోంది. ఉమ్మడి జిల్లాలో 79,793 హెక్టార్లలో సాగు చేయగా ఒక్క కర్నూలు జిల్లాలో 60,100 హెక్టార్లలో సాగైంది. పశ్చిమ ప్రాంతంలో రైతులు ఎక్కువగా సాగు చేశారు. కరవు కాలంలో పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. పంట చేతికొచ్చింది.. మిరప కాయలు తీసి కల్లాల్లో ఆరబెట్టారు. కుప్పలపై పట్టాలు కప్పుతున్నారు.

న్యూస్‌టుడే, పెద్దకడబూరు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ‘కరవు’ పరిస్థితులకు ఎదురొడ్డి పంటలు పండించారు. చేతికొచ్చిన పంట అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులే దిక్కయ్యారు. ప్రస్తుతం తుపాను మేఘం కమ్ముకోవడంతో దళారులు ధరలు మరింత తగ్గించడంతో వరి, మొక్కజొన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌లో మొక్కజొన్న 58,204 హెక్టార్లలో, వరి 62,788 హెక్టార్లు, మిరప 79793 హెక్టార్లలో సాగు చేపట్టారు. మొక్కజొన్న, వరి కోతలు పూర్తి అయ్యాయి.. గింజలు రోడ్లపై ఆరబోశారు. నంద్యాల జిల్లాలో 50,030 హెక్టార్లలో వరి సాగవ్వగా ఎక్కువగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉంది. ఏ రోడ్డుపై చూసినా ధాన్యం కుప్పలే దర్శనమిస్తున్నాయి. మొక్కజొన్న పరిస్థితి ఇలానే ఉంది.. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 52,364 హెక్టార్లలో సాగు చేశారు. ప్రస్తుతం మిగ్‌ జాం తుపాను రైతులను వణికిస్తోంది. దీని ప్రభావం రెండ్రోజుల పాటు ఉంటుందని వాతావరణ నిపుణుల హెచ్చరికలు జారీ చేశారు. ప్లాస్టిక్‌ కవర్లు, పట్టలు అద్దెకు తెచ్చుకొని కుప్పలపై కప్పుతున్నారు. ధాన్యం తడిస్తే వ్యాపారులు ధర తగ్గిస్తారన్న ఆందోళన అన్నదాతలను వెంటాడుతోంది. ‘‘ తుపానుతో పంటకు నష్టం జరగడమో, ధాన్యం తడిసిపోవడమో జరిగితే జరిగిన నష్టానికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. తడిసిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ పరిశీలిస్తుందని ’’ మార్క్‌ఫెడ్‌ నంద్యాల జిల్లా ఎండీ నాగరాజు పేర్కొన్నారు.

ఆళ్లగడ్డకు చెందిన ఓబులేసు ఎకరా పొలంలో నంద్యాల సోనా సాగు చేశారు. నాలుగు సంచుల దిగుబడి వచ్చింది. రూ.27 వేల వరకు పెట్టుబడి పెట్టా. రెండ్రోజుల కిందట ఒక సంచి (76 కిలోలు) రూ.2,300 పలికింది. తుపాను పేరు చెప్పి రూ.2,200కు తగ్గించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని