logo

పదోన్నతులిచ్చినా కుర్చీ వదలరు

జిల్లా విద్యా శాఖలో ఇన్‌ఛార్జుల పాలన సాగుతోంది. ఉన్నత పదవుల్లో వారే ఉండటంతో పనులు సులువుగా చేసుకోవడంతోపాటు పని విభజన కింద ఉపాధ్యాయులను ఇష్టానుసారంగా బదిలీ చేయడం.

Published : 05 Dec 2023 01:42 IST

విద్యా శాఖలో ఇన్‌ఛార్జుల రాజ్యం
ఉన్నతాధికారుల ఆదేశాలు పట్టించుకోని వైనం
 

డీఈవో కార్యాలయం

జిల్లా విద్యా శాఖలో ఇన్‌ఛార్జుల పాలన సాగుతోంది. ఉన్నత పదవుల్లో వారే ఉండటంతో పనులు సులువుగా చేసుకోవడంతోపాటు పని విభజన కింద ఉపాధ్యాయులను ఇష్టానుసారంగా బదిలీ చేయడం.. మధ్యాహ్న భోజన పథకానికి చెందిన బిల్లులు, నాడు-నేడు పనులు తదితరాలకు సంబంధించి సంతకాలు చేసి బిల్లులు స్వాహా చేస్తున్నారు. విద్యా శాఖలో ఖాళీగా ఉన్న ఉన్నత పదవులను సీనియర్‌ ప్రధానోపాధ్యాయులతో భర్తీ చేయాలని విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ మూడు నెలల కిందట జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో డీఈవో రంగారెడ్డి, ఆర్జేడీకి ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ వీటి భర్తీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

న్యూస్‌టుడే, కర్నూలు విద్య

డీఈవోకు రెండు అదనపు పోస్టులు..

కర్నూలు జిల్లా డీఈవో ఉన్న రంగారెడ్డి ఆదోని, పత్తికొండ డివిజన్‌కు ఇన్‌ఛార్జి డిప్యూటీ డీఈవోగా కొనసాగుతున్నారు. రెండు చోట్ల డిప్యూటీ హోదాలో తానే ఉండడంతో నిధులు రాల్చే దస్త్రాలు పెండింగులో లేకుండా పూర్తవుతున్నట్లు సమాచారం. కర్నూలు నగరానికి దగ్గరలో ఉన్న మండల కేంద్రాల్లోని బడులను తూతూమంత్రంగా తనిఖీ చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలోని పాఠశాలలను నెలలో రెండు, మూడు సార్లు పరిశీలించి మిగిలిన సమయం మొత్తం కార్యాలయంలోనే ఉంటూ కాలయాపన చేస్తున్నారని వారు ధ్వజమెత్తుతున్నారు.

కార్యాలయానికి పరిమితమై..

డీఈవో కార్యాలయంలో ఏడీ-2గా ఉన్న శామ్యూల్‌పాల్‌కు ఏడీ-1, మధ్యాహ్న భోజన పథకం, ఆదర్శ పాఠశాలల ఏడీగా ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. గత ఆరు నెలలుగా ఆయన ఇన్‌ఛార్జిగానే కొనసాగుతున్నారు. ఏడీ-2 కార్యాలయానికే పరిమితం కావడంతో జిల్లాలో ఉన్న ఆదర్శ పాఠశాలలు, మధ్యాహ్న భోజన పథకం తనిఖీకి వెళ్లిన సందర్భాలు వేళ్ల మీద లెక్కించవచ్చు. ఆయన తనిఖీలు లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యతలేని భోజనం వడ్డిస్తున్నారన్న విమర్శలున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా..

మూడు నెలల కిందట జరిగిన బదిలీ పదోన్నతుల్లో భాగంగా జిల్లా సైన్సు అధికారిణిగా ఉన్న రంగమ్మ కల్లూరు మండలం నుంచి గోనెగండ్ల మండలంలోని గంజిహళ్లి ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. గంజిహళ్లిలో విధులు నిర్వహిస్తూ జిల్లా సైన్సు అధికారిణిగా బాధ్యతలు చేపట్టడం ఇబ్బందిగా ఉండటంతో సమగ్ర శిక్షలో తిష్ట వేసేందుకు నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో డీఈవో సాయంతో గంజిహళ్లిలో విద్యా వాలంటీరును నియమించి ఆమె డీఈవో కార్యాలయంలో తిష్ట వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడే విద్యా వాలంటీరు పోస్టులు భర్తీ చేయాలి. ఒక వ్యక్తి కోసం నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిలో విద్యా వాలంటీరును ఎలా నియమిస్తారంటూ పలువురు ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరికొన్ని ఉదాహరణలు

  •  కర్నూలు మండల ఎంఈవో-1 పోస్టు ఎంతో కీలకమైనది.. ఈ పోస్టులో కర్నూలు డివిజన్‌ డిప్యూటీ డీఈవోగా ఉన్న హనుమంతరావు ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈ పోస్టు కీలకం కావడం.. మూడు నెలల కిందట జరిగిన బదిలీల్లో ఇద్దరు పోటీ పడినప్పటికీ ఫలితం లేకపోవడంతో వెనక్కి వెళ్లినట్లు సమాచారం.
  • ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో నిర్వహించే పరీక్షలకు సంబంధించి సర్కారు అందించే ప్రశ్నపత్రాల పంపిణీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు జిల్లా కేంద్రంలో డీసీఈబీ సెక్రటరీ హోదాలో సీనియర్‌ ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. గతంలో ఈ హోదాలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు నాగరాజు పదోన్నతిపై గూడూరు ఎంఈవో-2గా నియమితులయ్యారు. నిబంధనల ప్రకారం పదోన్నతి పొందిన వ్యక్తి డీసీఈబీ సెక్రటరీగా ఉండకూడదని నిబంధన చెబుతోంది. దీంతోపాటు జిల్లాలో ఉన్న ఉర్దూ పాఠశాలలకు ఇన్‌ఛార్జిగా ఉన్న సీనియర్‌ ప్రధానోపాధ్యాయుడు ఆదాం బాషా సైతం సి.బెళగల్‌ ఎంఈవో-2గా పదోన్నతిపై వెళ్లారు ఆయన సైతం అలానే విధులు నిర్వహిస్తున్నారు. నాగరాజు, ఆదాం బాషాను వెంటనే రిలీవ్‌ చేయడంతోపాటు ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి జిల్లా పర్యటన సమయంలో డీఈవో రంగారెడ్డికి మూడు నెలల కిందట ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఉర్దూ జిల్లా అధికారి పోస్టు తనకు వద్దంటూ ఎంఈవో-2 ఆదాం బాషా డీఈవో రంగారెడ్డికి లేఖ ఇచ్చారు. ఈ పోస్టులో మీరే ఉండాలని.. మిమ్మల్ని ఇక్కడి నుంచి రిలీవ్‌ డీఈవో చెప్పినట్లు సమాచారం.
  • జిల్లాల విభజన తర్వాత కర్నూలు జిల్లాలో ఉన్న సార్వత్రిక విద్య ఇన్‌ఛార్జిగా ఉన్న లక్ష్మీనారాయణ నంద్యాల వెళ్లిపోయారు. ఇక్కడ ఖాళీగా ఉన్న సార్వత్రిక ఇన్‌ఛార్జి పోస్టును పరీక్షల విభాగ అధికారి అయిన చంద్రభూషణ్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. సార్వత్రిక విద్య అందిస్తున్న కేంద్రాలను ఒక్కరోజు తనిఖీ చేసిన సందర్భాలు లేకపోవడం గమనార్హం.

    మార్చమని ఆదేశాలు ఇచ్చాం

- వెంకటకృష్ణారెడ్డి, ఆర్జేడీ

డీసీఈబీ సెక్రటరీ, ఉర్దూ జిల్లా అధికారి పోస్టులను సీనియర్‌ ప్రధానోపాధ్యాయులకు కేటాయించాలని గతంలో డీఈవో రంగారెడ్డికి ఆదేశాలు జారీ చేశాం. దీనిపై మరోసారి పరిశీలన చేయిస్తాం. డీఈవోకు ఉన్న రెండు అదనపు బాధ్యతల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఏడీ-2గా ఉన్న అధికారి గురించి సైతం డీఈవోతో మాట్లాడుతాం. పాఠశాలల పర్యవేక్షణ పెంచడంతోపాటు పిల్లలకు నాణ్యమైన విద్య, భోజనం అందించేందుకు కృషి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని