logo

కాటసాని x బైరెడ్డి

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శాప్‌ అధ్యక్షుడు, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న అంతర్యుద్ధం తారస్థాయికి చేరింది. ఇరు నాయకుల అనుచరులు పరస్పరం తమతమ నాయకులకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోటాపోటీగా పోస్టింగులు చేస్తున్నారు.

Published : 08 Dec 2023 03:50 IST

సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు

ఈనాడు, కర్నూలు: నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శాప్‌ అధ్యక్షుడు, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న అంతర్యుద్ధం తారస్థాయికి చేరింది. ఇరు నాయకుల అనుచరులు పరస్పరం తమతమ నాయకులకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోటాపోటీగా పోస్టింగులు చేస్తున్నారు. వైరివర్గానికి చెందిన వారిపై తీవ్ర అభ్యంతరకర పదజాలంతో విమర్శలు గుప్పిస్తుండటంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని పలువురు ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో పాణ్యం ఎమ్మెల్యే టికెట్‌ను బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి కేటాయిస్తారని కొద్దిరోజులుగా పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని సిద్ధార్థరెడ్డి వర్గీయులు ఖండించకుండా మౌనంగా ఉన్నారు. సిద్ధార్థరెడ్డి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో సన్నిహితంగా ఉంటారన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆ మేరకు హామీ ఇచ్చారేమోనన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పాణ్యం నుంచే పోటీచేస్తానని, అందులో ఎలాంటి సందేహం లేదని కాటసాని రాంభూపాల్‌రెడ్డి తేల్చిచెప్పారు. తాను నంద్యాల ఎంపీగానో, ఇతర నియోజకవర్గాల నుంచో పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కుండబద్దలు కొట్టారు. దీంతో పాణ్యం టికెట్టు ఎవరికి దక్కుతుందన్న అంశం రాజకీయ  వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కొందరు సిదార్థరెడ్డిని హేళన చేస్తున్నట్లు, అభ్యంతరకర పదజాలంతో ఎక్స్‌లో చేసిన పోస్టింగు మరో వివాదానికి దారితీసింది. ఆ పోస్టింగుకు పోటీగా కాటసాని రాంభూపాల్‌రెడ్డిని మరింత తీవ్రమైన పదజాలంతో నిందిస్తూ పలు ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ప్రతి ఊర్లో కాటసాని బాధితుల్ని కలుస్తామని, ఆయన అక్రమాలను ధారావాహికలా రోజుకొకటి వెలుగులోకి తెస్తామని ఆ పోస్టులో హెచ్చరించడం గమనార్హం. ఒకే పార్టీలో ఉన్న కాటసాని, బైరెడ్డి వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తాయన్నది ఉత్కంఠగా మారింది.

వైకాపా పెద్దలు ప్రతి నియోజకవర్గంలోనూ సర్వేలు నిర్వహించి ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని