logo

అంగన్‌వాడీ కేంద్రాల్లో సీఎం బొమ్మ కనపడకూడదు

అంగన్‌వాడీ కేంద్రాల్లో సీఎం బొమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ కనబడకుండా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఓ సీడీపీవో చేసిన సూచనలు, హెచ్చరికల ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

Published : 08 Dec 2023 03:51 IST

కేంద్ర బృందం తనిఖీలకు వస్తోంది
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు హెచ్చరికలు
అధికారిణి ఆడియో వైరల్‌

ఈనాడు, కర్నూలు, న్యూస్‌టుడే, ఆదోని గ్రామీణం: అంగన్‌వాడీ కేంద్రాల్లో సీఎం బొమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ కనబడకుండా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఓ సీడీపీవో చేసిన సూచనలు, హెచ్చరికల ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. గురు, శుక్ర, శనివారాల్లో కర్నూలు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన ఉంటుందని అధికారులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న 1886 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలను అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు ఓ సీడీపీవో వివరించారు. ‘ఈనెల 7, 8, 9వ తేదీల్లో కేంద్ర బృందాలు జిల్లాలో పర్యటించనున్నాయి. వారు ఏ ప్రాజెక్టుకు, ఏ ప్రాంతానికి వస్తారో తెలియదు. ఆదోని, ఆస్పరి ప్రాంతాలకు రావచ్చని అనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇస్తున్న పదార్థాల ప్యాకెట్లుపై రాష్ట్ర ప్రభుత్వం తన బొమ్మలు వేసుకుంది. అలా ఉంటే కేంద్రం తదుపరి నిధులను విడుదల చేయదు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో సీఎం బొమ్మ కనబడడానికి వీల్లేదు. చార్టులు, ప్యాకెట్లు, బ్యాగులపై ఎక్కడా సీఎం బొమ్మ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అని ముఖ్యమంత్రి చిత్రంపై తెల్లకాగితం అంటించవద్దు. ఆ ఫొటో ఉన్న ప్యాకెట్లు/చార్టులను అంగన్‌వాడీ కేంద్రం నుంచి మొత్తంగా తీసివేయాలి. బియ్యం, పప్పు, నూనె, బాలామృతం కేంద్రం నుంచి వస్తాయి. వైఎస్‌ఆర్‌ కిట్లు, గుడ్లు, పాలు రాష్ట్రప్రభుత్వం సరఫరా చేస్తుంది.  దేన్ని ఎవరు సరఫరా చేస్తున్నారని అడిగితే అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు కచ్చితమైన సమాధానం చెప్పగలగాలి. ఏ ఒక్క కేంద్రంలో పాతప్యాకెట్లు ఉండకూడదు. దీంతోపాటు కేంద్రాల్లో ఉండే సరకుకు లెక్కలు కచ్చితంగా ఉండాలి.   ప్రీస్కూల్‌ పిల్లలకు పాతప్యాకెట్లు వచ్చినట్లు తెలిసింది. ఆయా పాత ప్యాకెట్లు వస్తే వాటిని తెరిచి అందులోని పదార్థాలను ఏదైనా కంటైనర్‌లో పోసుకోవాలి.  ఎవరైనా ఆయా సూచనల్ని ఉల్లంఘిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని పీడీ స్పష్టంగా చెప్పారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అంటూ ఆఖరులో హెచ్చరికలు చేయడం గమనార్హం. దీనిపై కర్నూలు జిల్లా మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ సాధికారత అధికారిణి వెంకటలక్ష్మిని ‘ఈనాడు’ ప్రతినిధి సంప్రదించగా అంగన్‌వాడీ కార్యకర్తలు నిబంధనల ప్రకారం ఏ విధంగా విధులు నిర్వర్తించాలన్న విషయాన్ని గుర్తు చేశామని తెలిపారు. తాము ఎలాంటి హెచ్చరికలు జారీ చేయమని,   ఎవరికీ చెప్పలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని