logo

భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయొద్దు

జిల్లా పరిషత్‌ స్థాయీసంఘ సమావేశాల ద్వారా ఆశించిన ప్రయోజనం ఏమాత్రం చేకూరడం లేదు. తాము లేవనెత్తిన సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఇక్కడి వచ్చి అనవసర ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తోందని జడ్పీటీసీ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.

Updated : 08 Dec 2023 06:36 IST

సమావేశంలో ఖాళీగా కుర్చీలు

కర్నూలు నగరం(జిల్లా పరిషత్‌), న్యూస్‌టుడే: జిల్లా పరిషత్‌ స్థాయీసంఘ సమావేశాల ద్వారా ఆశించిన ప్రయోజనం ఏమాత్రం చేకూరడం లేదు. తాము లేవనెత్తిన సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఇక్కడి వచ్చి అనవసర ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తోందని జడ్పీటీసీ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పీ అధ్యక్షుడు ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన కర్నూలు జడ్పీ సమావేశ మందిరంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు స్థాయీసంఘ సమావేశాలు నిర్వహించారు. ఉపాధ్యక్షురాలు దిల్‌షాత్‌నాయక్‌, సీఈవో జి.నాసరరెడ్డి, పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.

ఏసీ గదిలో కూర్చుని ధరల నిర్ణయమా?

జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు తక్కువ ధర ఇవ్వడం సమంజం కాదని, ఏసీ గదుల్లో కూర్చుని ధరలు నిర్ణయించి, అన్యాయం చేయ్యెద్దని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధికారులకు చురకలు వేశారు. కర్నూలు నుంచి గార్గేయపురం రహదారి ఏళ్ల తరబడి కొనసాగుతోందని అసహనం వ్యక్తం చేశారు. అక్కడ ఎకరా రూ.కోటికిపై పైగా పలుకుతుండగా, రూ.15 లక్షలకు మించి పరిహారం ఇవ్వడం లేదన్నారు. నంద్యాల జిల్లాలో జల్‌జీవన్‌ మిషన్‌ పనులకు టెండర్లను ఎందుకు వేయడం లేదని, ప్రగతి వేగం పుంజుకోవడం లేదని కాటసాని అసహనం వ్యక్తం చేశారు.

జగనన్న కాలనీలపై సభ్యుల అసహనం

గ్రామాలకు దూరంగా జగనన్న కాలనీల్లో గృహాలు కేటాయించడంతో లబ్ధిదారులకు ఏమాత్రం ఆసక్తి లేకుండా పోయిందని, అక్కడ వసతులు కల్పించినా ప్రయోజనం లేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపల్లి మండలంలో కొన్ని గ్రామాల్లో అడవిలో స్థలాలు కేటాయించారని, సొంతస్థలంలో ఇళ్లు నిర్మించుకునేందుకు అకాశమివ్వాలని జడ్పీటీసీ సభ్యుడు సుధాకరరెడ్డి కోరారు. వెల్దుర్తిలోనూ ఇదే పరిస్తితి నెలకొందని జడ్పీటీసీ సభ్యుడు సుంకన్న తెలిపారు. పంట నష్టపరిహారంలో అర్హులకు న్యాయం చేయాలని చిప్పగిరి జడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షి కోరారు. ప్యాపిలి మండలాన్ని కరవు మండలంగా ప్రకటించకపోవడంతో రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందని జడ్పీటీసీ సభ్యుడు శ్రీరాంరెడ్డి అన్నారు.రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రయోజనాలు కలిగించే అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని జడ్పీ అధ్యక్షుడు పాపిరెడ్డి అధికారులను ఆదేశించారు.  

కోరం లేకున్నా సమావేశాలు

ఏడు స్థాయీసంఘ సమావేశాలకు సంబంధించిన నాలుగింటికి సభ్యుల కోరం లేకున్నా సమావేశాలు కొనసాగించే పరిస్థితి నెలకొంది. హాజరైన ఇద్దరు సభ్యులకు ఆయాశాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సమావేశాలకు కాటసాని మినహా మిగిలిన ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరుకాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని