logo

గాలిమరల ఉద్యోగిపై వైకాపా నాయకుల దాడి

ఆలూరు మండలం మొలగవల్లి గ్రామ పరిధిలోని గాలిమరల కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న మేకల రాజేష్‌పై వైకాపా నాయకులు దాడిచేశారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మొలగవల్లి గ్రామానికి చెందిన మేకల రాజేష్‌ అక్కడే గాలిమరల కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు.

Published : 08 Dec 2023 03:56 IST

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేకల రాజేష్‌

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఆలూరు మండలం మొలగవల్లి గ్రామ పరిధిలోని గాలిమరల కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న మేకల రాజేష్‌పై వైకాపా నాయకులు దాడిచేశారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మొలగవల్లి గ్రామానికి చెందిన మేకల రాజేష్‌ అక్కడే గాలిమరల కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. అదే కంపెనీలో ఆలూరుకు చెందిన వైకాపా నాయకుడు హనుమయ్య సైతం అద్దెకు వాహనాన్ని పెట్టారు. కంపెనీ వారు మూడు నెలలుగా అద్దె చెల్లించలేదు. దీనికి తోడు ఆ కంపెనీ స్థానంలో మరోటి వచ్చి చేరింది. వీరు సైతం రెండు నెలలుగా అద్దె చెల్లించడం లేదు. దీంతో ఆగ్రహించిన హనుమయ్య గాలిమరల కంపెనీ కార్యాలయానికి తాళం వేసుకుని వచ్చారు. ఈ విషయమై సూపర్‌వైజర్‌ మేకల రాజేష్‌ కంపెనీ అధికారులతో మాట్లాడి ఒక నెల అద్దెను ఖాతాలో జమచేశారు. అయినా కార్యాలయం తాళం ఇవ్వకపోవడంతో ఆయనతో  మాట్లాడటానికి ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదని, తిరిగి మొలగవల్లికి వెళ్తుండగా.. హనుమయ్య, ఆయన సోదరుడు చంద్రతో పాటు మరికొందరు కాపుకాసి దాడికి పాల్పడ్డారని బాధితుడి సోదరుడు మేకల రంగనాథ్‌ విలేకరులకు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మేకల రాజేష్‌ను ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడు సైతం వైకాపా సానుకూలపరులు కావడం గమనార్హం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.


మోసపూరిత హామీలతో నమ్మకద్రోహం

సీఎంపై ఠాణాల్లో ఫిర్యాదు

ఎస్సై సునీల్‌కు ఫిర్యాదుపత్రం అందజేస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేత ప్రవీణ్‌ తదితరులు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: పాదయాత్రలో మోసపూరితమైన హామీలిచ్చి విద్యార్థులకు నమ్మకద్రోహం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు రామాంజనేయులు, కార్యదర్శి బి.ప్రవీణ్‌ గురువారం నగరంలోని మూడు, నాలుగో పట్టణ ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. సీఎం తన అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించాడన్నారు.  82 లక్షల మంది విద్యార్థులుంటే కేవలం 40 లక్షల మందికే అమ్మఒడి ఇస్తున్నారని, అదీ రూ.15 వేల నుంచి రూ.13 వేలకు కుదించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో 16 లక్షల మందికి ఫీజు రీయంబర్స్‌మెంటు ఇస్తే ఈ ప్రభుత్వం కేవలం 9 లక్షలు మందికే ఇస్తోందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులను చదువుకు దూరం చేశారన్నారు.


పోక్సో కేసులో నిందితులకు జైలుశిక్ష

కర్నూలు న్యాయవిభాగం, నేరవిభాగం న్యూస్‌టుడే: ఓ బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు యత్నించిన ఇద్దరు యువకులకు కోర్టు జైలు శిక్ష విధించింది. 2020 జనవరి 9న బాలిక పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా కర్నూలు మండలం ఉల్చాలకు చెందిన మధు, బోయ గణేష్‌ ఆమె చేయి పట్టుకుని బలవంతంగా తీసుకెళ్లే యత్నం చేశారు. బాలిక వారి నుంచి తప్పించుకుని ఇంటికి పారిపోయింది. బాధితురాలి బంధువైన వృద్ధురాలు నిందితులను ప్రశ్నించగా ఆమెపై దాడి చేసి గాయపరిచారు. బాధితులు కర్నూలు తాలూకా పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడి, పోక్సో చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కర్నూలు జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి జి.భూపాల్‌రెడ్డి కేసును విచారించి గురువారం నిందితులిద్దరికీ ఏడాది జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పీపీ వెంకటేశ్వరరెడ్డి వాదించారు.


తండ్రి దెబ్బలకు మూడేళ్ల కొడుకు బలి

సంజు    (పాత చిత్రం)

మహేశ్వరం, మంత్రాలయం, న్యూస్‌టుడే:  తండ్రి దెబ్బలకు మూడేళ్ల పసివాడు బలయ్యాడు. విషాదకరమైన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని అమీర్‌పేటలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన లలితమ్మకు సి.బెళగల్‌ మండలం రంగాపురం గ్రామానికి చెందిన శివతో వివాహమైంది. బతుకుదెరువు కోసం వారు మహేశ్వరం పరిధిలోని అమీర్‌పేటకు వలస వచ్చారు. నాలుగేళ్ల ప్రణయ్‌, మూడేళ్ల సంజు, 6 నెలల పాప వారి సంతానం. శివ మేస్త్రీ పని చేస్తాడు. అతను పని మీద బయటకు వెళ్లగా.. సంజు ఇంట్లో నిద్రపోయాడు. లలితమ్మ.. తన ఆరు నెలల పాపను, ప్రణయ్‌ (4)ను వెంట తీసుకొని మార్కెట్కు వెళ్లింది. కొంతసేపటికి శివ ఇంటికి వచ్చి తలుపు తీయగా సంజు నిద్రలేచి నడుచుకుంటూ రోడ్డు ఎక్కాడు. బుజ్జగించినా.. వినకపోవడంతో ఇంట్లోకి లాక్కొచ్చి రెండుమూడు దెబ్బలు కొట్టాడు. తర్వాత కుటుంబ సభ్యులు సంజును ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని లలితమ్మ కుంటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని