logo

గెలుపు కిరీటంలో పల్లెపగడాలు

క్రీడల్లో పతకాలు.. చదువులో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. ఆ పాఠశాలకు ఆటస్థలం లేదు. ప్రస్తుతం వ్యాయామ ఉపాధ్యాయుడూ బదిలీపై వెళ్లారు. అప్పటి వ్యాయామ ఉపాధ్యాయుడు హరికృష్ణ తర్ఫీదుతో ఆ విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు.

Updated : 08 Dec 2023 06:04 IST

క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులు
గుండ్లకొండ నుంచి జాతీయ స్థాయికి..

క్రీడల్లో పతకాలు.. చదువులో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. ఆ పాఠశాలకు ఆటస్థలం లేదు. ప్రస్తుతం వ్యాయామ ఉపాధ్యాయుడూ బదిలీపై వెళ్లారు. అప్పటి వ్యాయామ ఉపాధ్యాయుడు హరికృష్ణ తర్ఫీదుతో ఆ విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు. ఈ ఏడాదిలో 20 మంది విద్యార్థులు వివిధ క్రీడల్లో రాష్ట్రస్థాయి పోటీలకు, మరో ఇద్దరు జాతీయస్థాయి క్రీడలకూ ఎంపికయ్యారు. దేవనకొండ మండలం గుండ్లకొండలోని ఉన్నత పాఠశాల. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు.

న్యూస్‌టుడే, దేవనకొండ

ఎవరికి వారు ప్రత్యేకం..

దేవనకొండ మండలం గుండ్లకొండ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు వివిధ పోటీల్లో ప్రత్యేకతను చాటుతున్నారు. అండర్‌-17 బాల్‌బ్యాడ్మింటన్‌లో తేజస్‌కుమార్‌(తొమ్మిదో తరగతి) నెల్లూరులో జరిగిన బాల్‌ బ్యాడ్మింటన్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. జావీద్‌ (తొమ్మిదో తరగతి) అక్టోబర్‌ 15న ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచాడు. ఆ పాఠశాలకు ఆట స్థలం లేదు.. క్రీడల్లో శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయుడూ బదిలీ అయ్యారు. అయినా.. విద్యార్థులు నిత్యం సాధన చేస్తూ సత్తా చాటుతున్నారు. విజేతలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజారావు, ఉపాధ్యాయులు ఉచ్చీరప్ప, సలీంబాషా, గ్రామస్థులు అభినందించారు.

జాతీయ స్థాయిలో తేజస్సు

గుండ్లకొండ గ్రామానికి చెందిన జాన్సన్‌, విజయకుమారి దంపతుల కుమారుడు తేజస్‌కుమార్‌ చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నాడు. జాతీయ ఉపకార వేతనానికి కూడా ఎంపికయ్యాడు. బాల్‌బ్యాడ్మింటన్‌ అంటే ఇష్టం. నెల్లూరు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెలలో ఛత్తీస్‌ఘడ్‌లో నిర్వహించే జాతీయస్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొంటాడు. గతంలో పని చేసిన వ్యాయామ ఉపాధ్యాయుల తర్ఫీదుతోనే ఆటల్లో మెలకువలు నేర్చుకున్నట్లు తేజస్‌ తెలిపాడు.

జయం మనదే జావీద్‌

బంటుపల్లికి చెందిన గోసంరక్షకులు చాంద్‌బాషా, షంషాద్‌బీ దంపతుల కుమారుడు జావీద్‌. ప్రస్తుతం గుండ్లకొండ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు పాడిపరిశ్రమ, వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నారు. జావీద్‌ జాతీయ ఉపకారవేతనానికి కూడా ఎపింకయ్యాడు. అక్టోబరు 15న జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలో పాల్గొన్నాడు. అక్కడ ప్రథమస్థానంలో నిలిచాడు.

నిత్య సాధనలో నవనీత్‌

గుండ్లకొండకు చెందిన రమణ, దేవీ దంపతుల కుమారుడ నవనీత్‌. కుటుంబం వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మొదటిసారి అండర్‌-17లో రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌కు ఎంపికయ్యాడు. పాఠశాల ఆవరణలో మరిన్ని సదుపాయాలు కల్పిస్తే.. పాఠశాల నుంచి ఇంకా క్రీడాకారులు సిద్ధమవుతారని నవనీత్‌ చెబుతున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి క్రీడా కోటలో ఉద్యోగం సాధించి దేశ రక్షణకుడిగా సేవలు అందించాలనేది లక్ష్యమని అంటున్నాడు ఈ క్రీడాకారుడు.

శభాష్‌ కార్తిక్‌

కృష్ణ, లలిత దంపతుల కుమారుడు కార్తిక్‌. వ్యవసాయ కుటుంబం. మొదటిసారి ఎనిమిదో తరగతిలోనే జాతీయస్థాయి అండర్‌-14లో కబడ్డీకి ఎంపికయ్యాడు. ఈసారి ట్రిబుల్‌ జంప్‌లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని