logo

అధికారం అండగా.. మట్టి దందా

కల్లూరు మండల పరిధిలోని తడకనపల్లె, ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ సరిహద్దులో ఎర్రమట్టి మాఫియా పేట్రేగిపోతోంది. నిత్యం వందల సంఖ్యలో భారీ టిప్పర్లతో మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.  ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో మట్టి దందా నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.

Updated : 08 Dec 2023 06:36 IST

ప్రతి రోజూ టిప్పర్లలో భారీగా తరలింపు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కల్లూరు మండల పరిధిలోని తడకనపల్లె, ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ సరిహద్దులో ఎర్రమట్టి మాఫియా పేట్రేగిపోతోంది. నిత్యం వందల సంఖ్యలో భారీ టిప్పర్లతో మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.  ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో మట్టి దందా నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.

కల్లూరు మండల పరిధిలో ఎర్రమట్టి మాఫియా దందా పెద్దఎత్తున సాగుతోంది. ఇప్పటికే లక్ష్మీపురం జగన్నాథగట్టుపై పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపి మట్టి అమ్ముకొని రూ.కోట్లు వెనకేసుకున్నారు. ఓ నేత సహకరించారన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం ఓర్వకల్లు మండలం నన్నూరు, కల్లూరు మండలం తడకనపల్లె పరిధిలో ఎర్రమట్టి తవ్వకాలు సాగుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.

సొమ్ము చేసుకుంటూ..

అక్రమార్కులు కొండను కొల్లగొట్టి ఎర్రమట్టిని తడకనపల్లె మీదుగా జాతీయ రహదారికి అటు నుంచి కర్నూలు, ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు దాదాపు 70 టిప్పర్లు రవాణా చేస్తున్నారు. ఒక్కో టిప్పరును రూ.5 వేలకుపైగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. రహదారి పనులు, ప్రైవేటు వెంచర్లు తదితర వాటికి తరలిస్తున్నారు. మట్టి తరలింపు ద్వారా ప్రతిరోజూ రూ.3.50 లక్షలు, నెలకు రూ.కోటికిపైగా జేబుల్లో వేసుకుంటున్నారు.

రహదారులు ధ్వంసం..

గ్రామాల మీదుగా ప్రధాన రహదారులపై ప్రతి రోజూ భారీగా టిప్పర్లు తిరుగుతుండటం.. పరిమితికి మించి మట్టి తీసుకెళ్తుండటంతో రహదారులు ధ్వంసమవుతున్నాయి. వాహనాలు వెళ్లే క్రమంలో పెద్దఎత్తున దుమ్ము లేస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతర్గత రోడ్లు పూర్తిగా రూపు కోల్పోయాయి. దీనిపై ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా తీసుకుంటున్న చర్యలు శూన్యమే. మట్టిని తరలిస్తున్న అక్రమార్కులకు నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు.

టిప్పరులో తరలుతున్న మట్టి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని