logo

యువతరం.. కదిలితేనే నవ్యపథం

ప్రజాస్వామ్యానికి యువతే వెన్నెముక. అయినా ఓటు నమోదు విషయంలో వెనుకడుగు వేస్తోంది. 18 ఏళ్లు నిండినవారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు, పాలకులు కోరుతున్నా ప్రయోజనం లేకపోతోంది.

Updated : 08 Dec 2023 06:06 IST

2 లక్షల మందికిపైగా ఓటు హక్కుకు దూరం
ఉమ్మడి జిల్లాలో కానరాని సదస్సులు
రేపటితో ముగియనున్న ఓటరు నమోదు, సవరణ

ఓటరు నమోదు కోసం వచ్చినవారితో మాట్లాడుతున్న బీఎల్వోలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ప్రజాస్వామ్యానికి యువతే వెన్నెముక. అయినా ఓటు నమోదు విషయంలో వెనుకడుగు వేస్తోంది. 18 ఏళ్లు నిండినవారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు, పాలకులు కోరుతున్నా ప్రయోజనం లేకపోతోంది. మరోవైపు ఓటరు నమోదుపై యువతకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు కానరావడం లేదు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో కీలకం.. అయినప్పటికీ ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది యువత ఓటరుగా నమోదు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు.
కర్నూలు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 19.71 లక్షల మంది, నంద్యాల జిల్లాలో 13.60 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18-21 ఏళ్లలోపు యువత ఓటరు నమోదు శాతం కేవలం 0.5 శాతమే ఉండటం గమనార్హం. అర్హులు లక్షల్లో ఉండగా.. ఇప్పటి వరకు 20-30 వేలకు మించి దరఖాస్తు చేసుకోలేదన్న విమర్శలున్నాయి. ఈనెల 9వ తేదీ వరకు మాత్రమే కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు ఉంది. ఇక కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి (ఈఆర్వో), సహాయ ఓటరు నమోదు అధికారి (ఏఈఆర్వో), బీఎల్వోల వద్ద దరఖాస్తులు లభిస్తాయి. వీటిని పూరించి ఫొటో అతికించి, వయస్సు, చిరునామా పత్రాలు జతచేసి దరఖాస్తు అందించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంటుంది. 9వ తేదీ దాటిన తర్వాత అవకాశముండదు. ఈ నేపథ్యంలో అర్హులైనవారు దరఖాస్తు చేసుకునేందుకు కృషి చేయాల్సి ఉంది.

ప్రత్యేక శిబిరాలకు ఆదరణ అంతంతే..

  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నవంబరు 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు శిబిరాలు నిర్వహించారు. దీనికి పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో బీఎల్వోలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కర్నూలు జిల్లా పరిధిలో 8,636, నంద్యాల జిల్లాలో 1,495 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
  • ఈనెల 2, 3 తేదీల్లో రెండో విడతలో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో భాగంగా కర్నూలు నియోజకవర్గంలో కొత్తగా ఓటరు నమోదుకు 18,569 దరఖాస్తులు వచ్చాయి. ఓటరు నమోదు.. తొలగింపులు.. మార్పులు, చేర్పులకు కలిపి 31,676 దరఖాస్తులు వచ్చాయి. నంద్యాల జిల్లాలో అన్నింటికి కలిపి 10,800 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు.

నేతల్లో స్పందనేదీ..

యువతను ఓటర్లుగా నమోదు చేయించడంలో రాజకీయ పార్టీలు సైతం విఫలమయ్యాయి. వారికి ఓటు హక్కు కల్పించే ప్రక్రియపై ఆయా పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరమున్నప్పటికీ ఆ దిశగా అడుగులు వేయడం లేదన్న విమర్శలున్నాయి.

రెండు రోజులే అవకాశం

అర్హులైనవారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు కేవలం శుక్ర, శనివారాల్లో మాత్రమే అవకాశముంది. ముఖ్యంగా 18 ఏళ్ల వయస్సు ఉన్న యువత స్పందించాల్సి ఉంది. ఆన్‌లైన్‌ ద్వారా లేదా ఆఫ్‌లైన్‌లో బీఎల్వో, ఏఈఆర్వోలు, ఈఆర్వోలకు దరఖాస్తులు అందించవచ్చు.

అధికారుల విఫలం

  • కరూలు జిల్లాలో 18-20 ఏళ్ల యువత 1.20 లక్షల మంది.. నంద్యాల జిల్లాలో 1.10 లక్షల మంది యువత ఓటుకు దూరంగా ఉండటం గమనార్హం. వీరిని కొత్తగా ఓటర్లుగా నమోదు చేయించడంలో అధికారులు విఫలమయ్యారు. ఓటరు చైతన్య కార్యక్రమాలు, కళాశాలల్లో ఓటుహక్కు నమోదుపై పెద్దఎత్తున సదస్సులు నిర్వహించకపోవడం తదితర కారణాలతో చాలామంది ఓటుకు దూరమవుతున్నారు. బీఎల్వోలు ఇంటింటికి తిరిగి యువతను గుర్తించి ఓటరుగా నమోదు చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు సెట్కూరు సీఈవో, మెప్మా పీడీలను నోడల్‌ అధికారులుగా నియమించినా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు.
  • యువతను పెద్దఎత్తున ఓటర్లుగా నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం లేకపోయింది. డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సదస్సులు నిర్వహించాల్సి ఉండగా పట్టించుకోలేదు. గడువు సమీపిస్తుండటంతో హడావుడిగా అక్కడక్కడా సదస్సులు ఏర్పాటుచేసి మమ అనిపించేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని