logo

పాఠాలు బోధపడక

క్లస్టర్‌ విశ్వవిద్యాలయాన్ని పలు సమస్యలు వేధిస్తున్నాయి. నిధులలేమితో మౌలిక వసతులు కరవయ్యాయి. దీనికితోడు అధికారుల మధ్య సమన్వయం కరవవడం శాపంగా మారింది. చివరికి విద్యార్థులు సైతం ఇక్కడ చదివేందుకు విముఖత చూపుతున్నారు. ఇక్కడ విద్యనభ్యసించలేమని.

Updated : 08 Dec 2023 06:35 IST

క్లస్టర్‌ వర్సిటీ నుంచి వెళ్లిపోతున్న విద్యార్థినులు
భారీగా మిగిలిపోయిన పీజీ సీట్లు

నగరంలోని కె.వి.ఆర్‌. మహిళా డిగ్రీ కళాశాల

ఈనాడు, కర్నూలు : క్లస్టర్‌ విశ్వవిద్యాలయాన్ని పలు సమస్యలు వేధిస్తున్నాయి. నిధులలేమితో మౌలిక వసతులు కరవయ్యాయి. దీనికితోడు అధికారుల మధ్య సమన్వయం కరవవడం శాపంగా మారింది. చివరికి విద్యార్థులు సైతం ఇక్కడ చదివేందుకు విముఖత చూపుతున్నారు. ఇక్కడ విద్యనభ్యసించలేమని.. వేరే విశ్వవిద్యాలయానికి వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌ను విద్యార్థినులు ఆశ్రయించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

క్లస్టర్‌ వర్సిటీ పరిధిలోని కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో పీజీ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు తాము వేరే వర్సిటీకి వెళుతామంటూ దరఖాస్తు చేసుకున్నారు. వారు ముగ్గురూ ఎమ్మెస్సీ (జువాలజీ) చదువుతున్నవారే కావడం గమనార్హం. ఇందులో ఇద్దరు తిరుపతిలోని ఎస్వీ, పద్మావతి మహిళా వర్సిటీలకు, మరొకరు కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా జువాలజీ విభాగంలో కేవలం ఐదుగురు మాత్రమే చేరినట్లు తేలింది. మీకేం పాఠాలు చెబుతామని కొందరు అధ్యాపకులే నిరాశ వ్యక్తం చేయడం.. అవకాశముంటే వేరే వర్సిటీకి వెళ్లిపోవాలంటూ వారు సూచించినట్లు వీసీ, రిజిస్ట్రార్ల దృష్టికి వెళ్లింది.

సమన్వయ లోపంతో..

  • నగరంలోని సిల్వర్‌జూబ్లీ ప్రభుత్వ కళాశాల, కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర కళాశాలలను ప్రభుత్వం క్లస్టర్‌ విశ్వవిద్యాలయ పరిధిలోకి తెచ్చింది. వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లను నియమించి వారి ఆధ్వర్యంలో ఆయా కళాశాలలు కొనసాగేలా చట్టం చేశారు. వీటిల్లో ప్రవేశాలు సైతం వర్సిటీయే నిర్వహిస్తోంది. మరోవైపు వివిధ నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రిన్సిపాళ్లకు, వీసీ, రిజిస్ట్రార్లకు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతున్నాయి.
  • క్లస్టర్‌ విశ్వవిద్యాలయ వీసీ, రిజిస్ట్రార్‌పై కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల పూర్వ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఇందిరాశాంతి మైనార్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మైనార్టీ కమిషన్‌ నుంచి రిజిస్ట్రార్‌కు నోటీసులు అందాయన్న విషయం తాజాగా చర్చనీయాంశంగా మారింది.

తగ్గిపోతున్న పిల్లల సంఖ్య

క్లస్టర్‌ విశ్వవిద్యాలయ పరిధిలోని మూడు కళాశాలల్లో 400కు పైగా సీట్లు ఉన్నాయి. కొన్ని పీజీ కోర్సుల్లో 30 సీట్లు, మరికొన్నింటిలో 40 సీట్ల చొప్పున ఉన్నాయి. వీటికి అదనంగా ఇ.డబ్ల్యు.ఎస్‌. కోటా కింద మరికొన్ని సీట్లు ఉన్నాయి. అయినప్పటికీ అన్ని కోర్సుల్లో కలిపి 63 మంది విద్యార్థులు మాత్రమే చేరడం గమనార్హం. గతంలో ఎప్పుడూ ఇంత తక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరిన దాఖలాలు లేవు. దశాబ్దాల చరిత్ర ఉన్న కె.వి.ఆర్‌. మహిళా డిగ్రీ కళాశాలలో చదివేందుకు గతంలో పలువురు పోటీ పడేవారు. ఇతర జిల్లాల విద్యార్థులు సైతం సీటు కోసం ప్రయత్నించేవారు. అలాంటి చరిత్ర ఉన్న కళాశాలలో ఎమ్మెస్సీ (జువాలజీ) కోర్సులో కేవలం ఐదుగురు మాత్రమే చేరడం గమనార్హం. ఈ క్రమంలో  ఉన్నవారిలో ముగ్గురు ఇతర వర్సిటీలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని