logo

ఉత్తుత్తి సవాళ్లు.. అడుగడుగునా అక్రమాలు

నంద్యాల మిర్చి యార్డులో దళారులు రాజ్యమేలుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చిని శీతల గోదాముల్లో దాచుకుని విక్రయించేందుకు యార్డుకు తీసుకొస్తే విపణిలో ఉన్న అసలు ధరను దాచి రైతుల అవసరాలు గుర్తించి ఎంతోకొంత చేతుల్లో పెడుతున్నారు.

Updated : 08 Dec 2023 06:05 IST

కుమ్మక్కై ధరలు తగ్గించేస్తున్న వ్యాపారులు
నిలువునా మోసపోతున్న రైతులు

గిట్టుబాటు ధర లేక ఆటోలో సరకును వెనక్కి తీసుకెళ్తున్న రైతు

నంద్యాల మిర్చి యార్డులో దళారులు రాజ్యమేలుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చిని శీతల గోదాముల్లో దాచుకుని విక్రయించేందుకు యార్డుకు తీసుకొస్తే విపణిలో ఉన్న అసలు ధరను దాచి రైతుల అవసరాలు గుర్తించి ఎంతోకొంత చేతుల్లో పెడుతున్నారు. వారి రెక్కల కష్టాన్ని ‘గద్దల్లా’ తన్నుకుపోతున్నారు. నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేస్తున్నట్లు రైతులను మభ్యపెడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు.

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. ఈ నేపథ్యంలో రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం నంద్యాల టెక్కె మార్కెట్‌ యార్డులో మిర్చి యార్డు ఏర్పాటు చేసింది. పాణ్యం, గడివేముల, వెలుగోడు, బండిఆత్మకూరు, నంద్యాల, మహానంది, శిరివెళ్ల, గోస్పాడు, బనగానపల్లి, అవుకు తదితర మండలాల నుంచి యార్డుకు రోజుకు సగటున 1,000 క్వింటాళ్ల మిర్చి విక్రయాలకు వస్తుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. రైతుల అవసరాలు.. మిర్చి రకాలను గుర్తించి కొందరు వ్యాపారులు అక్రమాలకు తెగబడుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 15 వేల హెక్టార్లలో మిర్చి సాగవుతుందని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం అంతకుమించి 80 వేల హెక్టార్లలో సాగైంది. ఫలితంగా దిగుబడులు  ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి.

సరకు వెనక్కి తీసుకెళ్లి..

ఈ పక్క చిత్రంలోని రైతు పేరు వాల్మీకి. కోవెలకుంట్ల మండలం అమడాల గ్రామానికి చెందిన ఇతను నంద్యాలలోని శీతల గిడ్డంగిలో మిర్చి నిల్వ చేశారు. యార్డులో సరకు విక్రయించేందుకు వస్తే కిలో రూ.150 నుంచి రూ.170 వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని వ్యాపారులు చెప్పారు. ఆ ధర గిట్టుబాటు కాకపోవడంతో తెచ్చిన సరకును అతను ఆటోలో తీసుకెళ్లిపోయారు. గోదాము నుంచి యార్డుకు సరకు తీసుకొచ్చే క్రమంలో హమాలీలు, ఆటో తదితర ఖర్చులన్నీ కలిపి బస్తాకు రూ.250 వరకు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సరకు అమ్ముడుపోకపోగా రవాణా ఛార్జీల భారం మరింత ఎక్కువైందని చెప్పారు.

తప్పుదోవ పట్టిస్తూ..

మిర్చి రకం గుర్తింపులోనే వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. ఎరుపు వర్ణంలో ఉండి మందంగా ఉన్న మిర్చిని డీలక్స్‌ రకంగా గుర్తించకుండా కొన్నిసార్లు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిబంధనల మేరకు యార్డుకు సరకు తీసుకొచ్చిన రైతు కుప్పలుగా వేస్తే వ్యాపారులు సవాల్‌ పాడుతుంటారు. ఎవరు ఎక్కువగా పాడితే వారికి సరకు సొంతమవుతుంది. కొందరు ముందుగానే ‘మిలాఖత్‌’ అయి వేలం పాట పాడినట్లుగానే నటిస్తూ ఎక్కువ ధరకు పాడకుండా ముందస్తు ఒప్పందం చేసుకుంటున్నారు. డీలక్స్‌ రకం ధరను రూ.200 నుంచి ప్రారంభించి రూ.215, కొన్నిసార్లు రూ.190కే పరిమితం చేస్తుండటం గమనార్హం. మీడియం రకం సరకును రూ.150 నుంచి రూ.160కు పాడుకుంటున్నారు. గంటలకొద్దీ సవాల్‌ నిర్వహించినా ధర మాత్రం పెంచడం లేదు.

వడ్డీలు పెరిగిపోతుండటంతో..

ఆరు నెలల కిందట బహిరంగ విపణిలో మిర్చికి మంచి ధర పలికింది. కిలో ధర రూ.240 వరకు వచ్చింది. మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో చాలామంది రైతులు తమ దిగుబడులను నంద్యాల, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లోని శీతల గోదాముల్లో నిల్వ ఉంచారు. కానీ ఆరు నెలలుగా ధర క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఎకరాకు రూ.1.20 లక్షలు పెట్టి మిర్చి సాగు చేయగా ధర క్రమంగా తగ్గుతూ వస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో చివరికి గోదాముల్లోని మిర్చిని యార్డుకు తరలిస్తున్నారు. మరోవైపు ధర క్రమంగా తగ్గిపోతుండటం.. ఇటు రైతుల అవసరాలు గుర్తించిన కొందరు వ్యాపారులు కమీషన్‌ ఏజెంట్లతో కుమ్మక్కయ్యారు. ప్రస్తుతం విపణిలో డీలక్స్‌ రకం మిర్చి కిలో రూ.210, మధ్యస్థ రకం రూ.150 నుంచి రూ.180 వరకు, తాల్‌ రకం రూ.80 నుంచి రూ.105 ధర ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని