logo

హఫీజ్‌ఖాన్‌కు అవకాశం లేనట్లే?

నా ఎస్సీలు... నా ఎస్టీలు.. నా బీసీలు.. నా మైనార్టీలు అని ఊదరగొట్టే ప్రసంగాలతో అందర్నీ ఆకట్టుకోవాలని పరితపించే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వారిని దగా చేస్తున్నారు.

Published : 23 Feb 2024 01:58 IST

తెరపైకి డాక్టర్‌ ఇలియాస్‌ బాషా
జగన్‌ను కలిసిన ఇరువురూ

ఈనాడు, కర్నూలు: నా ఎస్సీలు... నా ఎస్టీలు.. నా బీసీలు.. నా మైనార్టీలు అని ఊదరగొట్టే ప్రసంగాలతో అందర్నీ ఆకట్టుకోవాలని పరితపించే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వారిని దగా చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు బీసీల సీట్లు గల్లంతుకాగా... తాజాగా మైనార్టీ ఎమ్మెల్యే సీటుకు పొగపెట్టారనే ప్రచారం జరుగుతోంది. మైనార్టీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, డాక్టర్‌ ఇలియాస్‌ బాషాలు ముఖ్యమంత్రిని గురువారం కలిసిన నేపథ్యంలో అభ్యర్థి మార్పునకు సంబంధించి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జిల్లాలోని నందికొట్కూరు, కోడుమూరు స్థానాల్లోని ఎస్సీ అభ్యర్థులను మార్చిన ఆయన తాజా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా హఫీజ్‌ఖాన్‌ స్థానంలో డాక్టర్‌ ఇలియాస్‌ బాషా పేరు తెరపైకి తీసుకొచ్చారు. సీటు మార్పుపై నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ ఇప్పటికే నిరసన తెలిపారు. దళితుల ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని ముఖ్యమంత్రి తాకట్టుపెట్టారని ఆర్థర్‌ అనుచరులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. నందికొట్కూరు నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని సమన్వయకర్తగా నియమించడం ఏమిటని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ను కూడా అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించకుండా దూరంగా ఉంచడం చర్చనీయాంశమైంది. మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు ఆలూరు టికెట్‌ ఇవ్వడానికి నిరాకరించి కర్నూలు ఎంపీగా ప్రకటించడంతో ఎవరికీ అందుబాటులోకి రాకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని