logo

బడుగులపై బకాయిల కత్తి

నా ఎస్సీలు...నా ఎస్టీలు..వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి దళితుల పట్ల సవతితల్లి ప్రేమ ఒలకబోస్తున్నారు.

Published : 23 Feb 2024 02:05 IST

మంజూరైన ట్రాక్టర్ల వద్ద గిరిజన, దళితులు

నంద్యాల పట్టణం, చాగలమర్రి, న్యూస్‌టుడే: ‘నా ఎస్సీలు...నా ఎస్టీలు..వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి దళితుల పట్ల సవతితల్లి ప్రేమ ఒలకబోస్తున్నారు. పేద, బడుగు, గిరిజన, దళితులకు ప్రయోజనం చేకూరుస్తామని ‘వైఎస్సార్‌ జగనన్న బడుగు వికాసం’ పథకం కింద వాహనాలను కొనుగోలు చేయించి రాయితీ మొత్తాలను అర్హుల ఖాతాలకు జమ చేయక వారిని కష్టాల ఊబిలోకి నెట్టేశారు. 2020-23 మధ్య ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేసి బడుగులకు కష్టాలను మిగిల్చారు.

ఏటా ఆగస్టులో అన్నారు

జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం కింద అవసరమైన వాహనాల కొనుగోలుకు పరిశ్రమల శాఖ ద్వారా రుణాలను అందజేసింది. పథకం విలువలో 85 శాతం బ్యాంకు రుణంగా ఇస్తే మిగిలిన 15 శాతం లబ్ధిదారు వాటాగా చెల్లించాలి. వాహనం విలువలో 45 శాతం రాయితీ మొత్తాన్ని రుణం ఇచ్చిన బ్యాంకుకు జమచేసి మిగతా మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో 11 శాతం వడ్డీతో లబ్ధిదారులు చెల్లించాలి. ఏటా ఆగస్టులో రాయితీ మొత్తం విడుదల చేస్తామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా హామీ ఇచ్చి మూడేళ్లయినా జమకాలేదు.

రూ.138 కోట్లకు తప్పని నిరీక్షణ

జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాస్‌ కింద కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 300 మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. కర్నూలు జిల్లాలో రూ.75 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.63 కోట్లు కలిపి మొత్తం రూ.138 కోట్ల రాయితీ మొత్తం అందాలి. నంద్యాల జిల్లాలోని చాగలమర్రి, పాణ్యం, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నంద్యాల, నందికొట్కూరు, బేతంచెర్ల, అవుకు, కర్నూలు జిల్లాలోని కర్నూలు నగరం, ఆదోని, ఎమ్మిగనూరు, చిప్పగిరి, ఆస్పరి, దేవనకొండ, ఆలూరు తదితర మండలాలకు చెందిన లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్నారు. ఎస్సీల్లో ఎక్కువ మంది ఇన్నోవా, స్కార్పియో, తూఫాన్‌, టిప్పర్లు, జేసీబీలు, ఎస్టీలైతే ట్రాక్టర్లు, లారీలు, కార్లు తదితర వాహనాలు కొనుగోలు చేశారు. ప్రభుత్వం రాయితీ విడుదల చేయకపోవడంతో బ్యాంకుల నుంచి ఒత్తిళ్లు తట్టుకోలేక, ఇచ్చిన వాహనాలు బేరాలు కుదరక నడపలేక లబ్ధిదారులు మల్లగుల్లాలుపడుతున్నారు. కర్నూలు, నంద్యాలలో కలెక్టర్ల అధ్యక్షతన జరిగిన పారిశ్రామిక సలహా మండలి సమావేశంలో సభ్యులు ఈ విషయాన్ని ప్రస్తావించినా స్పందన కరవైంది.


మేకలు అమ్ముకుని కంతులు కట్టా
-లక్ష్మమ్మబాయి, ఓజీ తండా

జగనన్న ప్రభుత్వాన్ని నమ్మి రాయితీ వస్తుందని ట్రాక్టరును కొన్నాం. వ్యవసాయం, గొర్రెల పెంపకమే ప్రధాన జీవనాధారం. రాయితీకి ఆశపడి ట్రాక్టరు కొనుగోలు చేసి కంతులు కట్టేందుకు దాదాపు 30 మేకలను అమ్మేశాం. ఆరు నెలలకు ఒక వాయిదాకు రూ.1.12 లక్షలు కట్టలేక ఇంట్లో దాచుకున్న డబ్బులు, బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి కట్టాం. ప్రభుత్వం ఇస్తామన్న రాయితీని జమచేయలేదు.


వడ్డీలు కట్టలేక ఇబ్బందులు
- రాజమహేంద్ర, జిల్లా పరిశ్రమల శాఖ కమిటీ సభ్యులు

2020-23లో పారిశ్రామిక పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ యువతకు ఇచ్చిన రుణాలకు సంబంధించి రాయితీ మొత్తం ఇంతవరకు జమకాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వెనుకబడిన వర్గాలకు ఆర్థిక చేయూత కోసం ఉద్దేశించిన ఈ పథకంలో భాగంగా రాయితీలు ఇవ్వలేదు. ప్రస్తుతం లబ్ధిదారులు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని